రాగులతో వేసవికి చెక్

Apr 21,2024 11:52 #ruchi, #Sneha

వేసవి కాలంలో ఏదీ తినాలని అనిపించదు. ఎండ వల్ల శరీరంలో నీరు ఆవిరైపోతుంది. దీంతో నీరసం వస్తుంది. అందుకే తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అందులోనూ రాగుల్లో మంచి ఫైబర్‌ ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే క్యాల్షియం, ఐరన్‌తో పాటు, ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందవచ్చు. రాగులు ఇతర ధాన్యాల కంటే బలమైన ఆహారం. శారీరక కష్టం చేసేవారు రాగి పిండితో తయారుచేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి ఎముకల బలం పెరుగుతుంది. సాధారణంగా రాగులతో ఎక్కువగా సంకటి, జావ చేసుకుంటాం. ఇవి కాకుండా రాగులతో వెరైటీ అల్పాహారం (టిఫెన్స్‌) చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

కిచిడి..

కావలసినవి : బియ్యం- కప్పు, పెసెరపప్పు- 1/2 కప్పు, రాగులు- కప్పు, కూరగాయల ముక్కలు- కప్పు ( క్యారెట్‌, టమోట, బంగాళదుంప, బీన్స్‌), పచ్చిమిర్చి- 2, తాలింపు గింజలు-1/2 టీ స్పూన్‌, పసుపు- స్పూన్‌, గరం మసాలా- స్పూన్‌, నెయ్యి- రెండు స్పూన్లు, ఉప్పు- రుచికి సరపడా.

తయారీ : పప్పు, బియ్యం, రాగులను కనీసం గంట నీటిలో నానబెట్టండి. కుక్కర్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. తాలింపు గింజలు చిటపటలాడే వరకూ వేయించాలి. పసుపు, పచ్చిమిర్చి, కూరగాయలు ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. నిమిషం తర్వాత నానబెట్టిన పప్పు, బియ్యం, రాగులను నీటితో సహా వేసి కలపండి. మూతపెట్టి, మూడు లేదా నాలుగు విజిల్స్‌ వచ్చే వరకూ ఉంచాలి. తర్వాత స్టవ్‌ ఆపి, మూత తీసి గరం మసాలా పొడి చల్లుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రాగి కిచిడి రెడీ.

ఇడ్లీ

కావాల్సినవి : ఇడ్లీ పిండి – రెండు కప్పులు, రాగి పిండి – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ : ఓ కళాయి స్టవ్‌ మీద పెట్టి, అరకప్పు నీళ్లు పోయాలి. నీళ్లు వేడెక్కాక రాగిపిండిని వేసి, ఉండల్లేకుండా కలుపుకోవాలి. కాస్త ఉప్పు కూడా వేయాలి. రాగి పిండి చిక్కగా ఉడికాక, అందులో ముందుగా కలుపుకున్న ఇడ్లీ పిండిని కూడా వేసి బాగా కలపాలి. పిండి కాస్త చిక్కగా అయ్యేవరకూ గరిటెతో కలుపుతూనే ఉండాలి. స్టవ్‌ కట్టేసి ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. పిండి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు కాస్త నూనె రాసి ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో సర్ది, కుక్కర్లో పెట్టేయాలి. పదినిమిషాలు ఉడికించాలి. అంతే రాగి ఇడ్లీ రెడీ అయిపోతుంది. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే టేస్టు అదిరిపోతుంది.

చపాతీ..


కావాల్సినవి : రాగి పిండి- కప్పు, గోధుమపిండి- కప్పు, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు- గుప్పెడు, జీలకర్ర- స్పూను, ఉప్పు- చిటికెడు, నెయ్యి- స్పూను, గోరువెచ్చని నీళ్లు- తగినన్ని.

తయారీ : ఒక పెద్ద గిన్నె తీసుకొని రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి కలపాలి. తర్వాత నెయ్యి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు వేసి కలపాలి. కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీళ్ళు పోసి పిండిని కలిపి, ముద్దలా చేయాలి. ఈ పిండిపై పలుచటి తడి వస్త్రం కప్పి ఉంచాలి. అరగంట తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్‌గా చేయాలి. వీటిని చపాతీ కర్రతో పొడి పిండి వేసుకుని, చపాతీలు ఒత్తుకోవాలి. మీడియం మంట మీద పెనంపై వేడి చేసి, చపాతీలు రెండు వైపులా కాల్చుకోవాలి. వీటిని టమాటా పచ్చడితో తింటే చాలా బాగుంటాయి.

➡️