ఎండల్లో చల్ల చల్లటి పానీయాలు

May 5,2024 08:40 #ruchi

ఎండలు మండుతున్నారు.. ఇంట్లోనే ఉన్నా చల్లచల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుంది. బయటికెళ్ళి వస్తే ఇహ చెప్పనక్కర్లేదు.. ఎన్ని మంచినీళ్ళు తాగినా పొట్ట నిండుతుందే కానీ దాహార్తి తీరదు. కూల్‌డ్రింకుల్లో ఉండే షుగర్‌, హానికర కెమికల్స్‌ అవి ఆరోగ్యానికి హానికరం. మనం ఏమన్నా తాగిన తర్వాత ఉపశమనం కలగాలంటే వాటిలో దాహాన్ని తీర్చే విటమిన్‌లు, మినరల్స్‌ ఉండాలి కదా! అలాంటి చల్లని పదార్థాలు ఇంట్లోనే త్వరగా, తేలికగా చేసుకుంటే అందరికీ మంచిది. మరి ఈ వేసవిలో హాయిగా.. చల్లగా.. ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని చల్లని పానీయాలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

మలబార్‌ అటుకుల డ్రింక్‌..

కావల్సినవి : మందపాటి అటుకులు-1/2 కప్పు, చల్లని పాలు-1/2 లీటరు, అరటిపండ్లు- 4, పంచదార-8 స్పూన్లు, వేరుశెనగగుండ్లు-1/4 కప్పు, జీడిపప్పు- 10, హార్లిక్స్‌/బూస్ట్‌/ బోర్నవిటా, టూటీఫ్రూటీ – కొద్దిగా.
తయారీ : అటుకులను సన్నని సెగ మీద కలుపుతూ కరకరలాడేట్టు వేపుకుని, వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాన్‌లో వేరుశనగ గుళ్ళు వేపుకొని, పొట్టు తీసి పక్కనుంచుకోవాలి. అరటిపండ్లు, పంచదార మరో గిన్నెలో తీసుకుని పప్పుగుత్తితో ఎనిపితే అక్కడక్కడా ముక్కలుగా తగులుతూ బాగుంటుంది. దానికి కాచి చల్లార్చి డీప్‌ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని పాలను కలపాలి. అలా కలిపిన పాలను గ్లాసులో సగం వరకూ పోసి, వేయించిన అటుకులు కొంచెం, పల్లీలు, జీడిపప్పు కొన్ని వేసి, మిగిలిన గ్లాసును మరల బనానా పాలతో నింపాలి. పైన మరికొన్ని వేరుశనగపప్పు, జీడిపప్పు, టూటీఫ్రూటీ చల్లి తాగుతుంటే అటుకులు సగం మెత్తగా ఇంకొంచెం కరకరలాడుతూ.. ఆ రుచే వేరులెండి. హార్లిక్స్‌, బూస్ట్‌ లాంటివి కూడా అయితే యమ్మీయమ్మీగా భలే రుచిగా ఉంటుంది ఈ అటుకుల సమ్మర్‌ డ్రింక్‌.

పుదీనా కూలర్‌..
కావల్సినవి : పుదీనా ఆకులు – కప్పు, కొత్తిమీర – 1/2 కప్పు (చిన్నకట్ట), అల్లం- అంగుళం ముక్క, యాలుకలు – 4, బెల్లం – 60 గ్రా. నీళ్ళు-750 ఎంఎల్‌, నిమ్మరసం – 2 స్పూన్లు, ఉప్పు – 1/4 స్పూను. పచ్చిమిర్చి – 1, పంచదార – 6 స్పూన్లు,
తయారీ : బెల్లంలో నీళ్ళు పోసి బాగా కరిగించాలి. పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్కలు, నిమ్మరసం అన్నీ వేసి మెత్తని పేస్టు చేసుకోవాలి. ఒక గిన్నెలోకి కరిగిన బెల్లాన్ని వడకట్టుకొని, అందులో పుదీనా పేస్ట్‌ వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన పుదీనా కూలర్ని మట్టి పాత్రలో అయితే రెండు గంటలు.. ఫ్రిజ్‌లో అయితే గంట ఉంచి, తీసుకుంటే చల్లగా, బాగుంటుంది.

ఆమ్‌పన్నా..
కావల్సినవి : పచ్చిమామిడి ముక్కలు – 450 గ్రా, అల్లం – అంగుళం ముక్క, ఉప్పు – స్పూను, కారం- 1/4 స్పూను, పచ్చిమిర్చి – ఒకటి, బెల్లం – 40 గ్రా, పంచదార -కప్పు, నీరు -1/2 లీ., పుదీనా – 20 ఆకులు, బ్లాక్‌సాల్ట్‌ – 1/2 స్పూను
మసాలా కోసం : మిరియాలు – 20, సోంపు – 2 స్పూన్లు, జీర – 2 స్పూన్లు, యాలకులు – 2 వీటిని దోరగా వేయించి, మెత్తగా పొడి చేసుకోవాలి.
తయారీ : పచ్చిమామిడి ముక్కలు, అల్లం ముక్క, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, బెల్లం, పంచదార, నీరు అన్నింటినీ కుక్కర్‌లో ఉడికించాలి. చల్లారిన తర్వాత జార్‌లోకి తీసుకుని, దానికి పుదీనా ఆకులు కూడా కలిపి, మెత్తగా గ్రైండ్‌ చేయాలి. దీనిని వడకట్టి 11/2 లీ. చల్లని నీరు, బ్లాక్‌ సాల్ట్‌, ముందుగా వేయించి పొడి చేసుకున్న పొడిని 11/4 స్పూన్లు కలిపి సర్వ్‌ చేసుకోవటమే. గ్లాసులో ఐసుముక్కలు వేసుకుంటే కూల్‌ కూల్‌గా కమ్మగా ఉంటుంది.

రోజ్‌ షర్బత్‌..
కావల్సినవి : రోస్‌ సిరప్‌-100 మి.లీ., సబ్జా- 2 టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం-11/2 స్పూన్లు, ఐసు ముక్కలు – 10, చల్లని నీరు – 600 మి.లీ.
తయారీ : సబ్జా గింజలు పది నిమిషాలు నానబెట్టాలి. ఒక గిన్నెలో రోజ్‌ సిరప్‌, ఐస్‌ ముక్కలు, చల్లని నీళ్ళు, సబ్జా, నిమ్మరసం అన్నీ కలపాలి. ఇష్టమయితే సోడా కలుపుకోవచ్చు. మనకు 100 మి.లీల డ్రింక్‌ తయారీకి 25 మి.లీల రోజ్‌ సిరప్‌ ఉండాలి. నిమ్మరసం తెలిసీ తెలియనట్టుంటేనే బాగుంటుంది.

➡️