సృజనకు నాంది..

Mar 24,2024 08:02 #Creativity, #Science, #Sneha

మాతృభాషలో విజ్ఞాన సముపార్జన తేలిక.. తత్ఫలితంగా చదువుపై ఆసక్తి, తెలుసుకోవాలనే జిజ్ఞాస అధిక ఫలితాలిస్తాయనేది మేధావుల వివరణ.. అది అక్షర సత్యం కూడా. అదలా ఉంటే ఇటీవల లండన్‌లోని గోల్డ్‌స్మిత్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో మరో విజ్ఞాన విశేషం వెల్లడైంది. ఒక్క భాష మాట్లాడగలిగే తల్లికి పుట్టిన శిశువు కంటే రెండు భాషలు మాట్లాడే తల్లికి పుట్టే శిశువుల మెదడులో ప్రతిస్పందనలు క్రియాశీలకంగా ఉన్నాయని వారి అధ్యయనంలో తెలిసింది. రెండో భాష ఆ పిల్లలకు సంకేతపరంగా ఎలాంటి పరిచయం లేకపోయినప్పటికీ రెండు భాషలూ వింటూ పెరిగిన పిల్లల మెదడు చురుకైన, ప్రత్యేకమైన ప్రతిస్పందనలను వెల్లడించిందని శాస్త్రవేత్తలంటున్నారు.

గర్భం ధరించినప్పటి నుండి బిడ్డ పుట్టిన నాలుగు నెలల కాలంలోనే ద్విభాషా తల్లుల పిల్లల్లో ఒక ప్రత్యేకత గమనించారు పరిశోధకులు. ఏక భాష మాట్లాడే తల్లుల పిల్లలు పందొమ్మిది మంది, ద్విభాషా తల్లుల పిల్లలు ఇరవై ఒక్కమందిపై వారు ఈ పరిశోధనలు జరిపారు. ద్విభాషా తల్లుల పిల్లల మెదడు క్రియాశీలకంగా ప్రతిస్పందిస్తుందన్నారు. ఆ శిశువు పుట్టినప్పటి నుండి రెండు భాషలు వినేటప్పుడుగానీ, మొదటిసారిగా సంకేత పరమైన భాషను విన్నప్పుడుగానీ మెదడు యొక్క కుడి అర్ధగోళంలోని కణాలు, ఎడమవైపు కంటే ఎక్కువ స్థాయిలో నిమగమయ్యాయని పరిశోధనా ఫలితాలు చూపించాయి.


నిశిత దృష్టి..
శిశువులు తమ ఇంటిలో రెండు భాషలు వింటూ పెరిగిన అనుభవం నిశిత దృష్టిని కలిగిస్తుందని పరిశోధనా బృందం నిర్ధారించింది. ఫలితంగా, మాట్లాడే భాషకు, సంకేత భాషకు వారి మెదడు ఒకేలా ప్రతిస్పందిస్తుంది. ‘భాష ఏదైనా క్రమానుగత నిర్మాణంతో ఏర్పడినదే. అయినప్పటికీ ఇక్కడ అనేక అంశాలు మిళితమై ఉచ్చారణకు తోడ్పడతాయి. భాషల నిర్మాణంలో ఉన్న సారూప్యత ఒకే విధమైన క్రియాశీలతకు దారితీసే అవకాశం ఉంది’ అంటున్నారు బృందంలోని డా. మెర్క్యూర్‌.

పసికూనలూను..!
అప్పుడే పుట్టిన పసి కూనలు కూడా మాటలు, శబ్దాలు వినడానికి సిద్ధంగా ఉంటారు. రెండు భాషలనూ నిశితంగా గమనించడం, ఉచ్చరించడానికి ప్రయత్నించడం చేస్తారు. శిశువు ఎక్కువ సమయం తల్లి సాంగత్యంలో ఉండటం వలన ఆమె మాట్లాడేటప్పుడు పెదవుల కదలికలను గమనిస్తుంది. దగ్గరగా మాట్లాడేటప్పుడు పెదవుల కదలికను బట్టి వివిధ భాషల మధ్య తేడాను కూడా వారు గుర్తిస్తారు. అంతేకాదు మాటతీరు ప్రేమగా ఉందా? కోపంగా ఉన్నదా అనేది కూడా వారికి స్పష్టంగా అర్థమవుతుంది.


వృద్ధాప్యంలో.. సమర్ధవంతంగా..
ఈ పిల్లలు వయసు పెరిగే కొద్దీ మాట్లాడే నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకుంటారు. అంతేకాదు.. ఈ ప్రత్యేకతతో ఇతరులను తెలివితేటల్లో అధిగమిస్తున్నట్లు బృందం కనుగొన్నది. ప్రారంభ జీవిత అనుభవాలు మన నాడీ మండలాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉండటం, ఏకాగ్రత, సృజనాత్మకత, సమస్యలను తేలికగా పరిష్కరించే శక్తిని కలిగి ఉండటం, వృద్ధాప్యంలో మతిమరుపును నియంత్రించి, సమర్ధవంతంగా పనిచేయడం లాంటి విశేష లక్షణాలు ప్రతిబింబిస్తాయి. భవిష్యత్తులో మాట్లాడేందుకు శిశువుగా ఉన్నప్పటి అనుభవమే క్రియాశీలకంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

బహుభాషలైతే..!
అలా అని శిశువు స్థాయిలోనే అనేక భాషలు నేర్పేయాలని ప్రయత్నిస్తే పిల్లవాడి మెదడుపై ఒత్తిడి పెరిగి సాధారణ మెదడుకు ఉండే లక్షణాలు కూడా మందగించే ప్రమాదం ఉందని ఇంతకుముందు పరిశోధనల్లో వెల్లడైంది. మూడు భాషలు తెలుసుకునేంత సామర్ధ్యం శిశువు మెదడుకు ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ పరిశోధనల అనంతరం బహుభాషా తల్లుల పిల్లలపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు బృందం తెలిపింది.

➡️