తుది సమరం నేడే

May 13,2024 07:18 #elections, #The final battle
  • పోలింగ్‌ కేంద్రాలకు 1.60 లక్షల ఇవిఎమ్‌లు తరలింపు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం పోలింగ్‌ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ స్టేషన్లకు తరలి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 ఎంపి స్థానాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 2,02,74,144 మంది, మహిళలు 2,10,56,137 మంది ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు థర్డ్‌ జెండర్స్‌ మరో 3,421 మంది ఉన్నారు. ఎన్నికల్లో ఎటువంటి హింసకు తావులేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికల నిర్వహణ 1,06,145 మందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 నియోజకవర్గాలు సమస్యాత్మకమైనవిగా ఉన్నట్లు గుర్తించిన ఎన్నికల సంఘం ఆయా నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఎన్నికల విధులు మూడు లక్షల మంది ఉద్యోగులతో పాటు, భద్రతా సిబ్బందితో కలుపుకుని మొత్తం 4.06 లక్షల మంది ఉద్యోగులు నిర్వహిస్తున్నారు.

1.60 లక్షల ఇవిఎమ్‌లు తరలింపు
రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 1.60 లక్షల కొత్త ఇవిఎమ్‌లను వినియోగించనున్నారు. వీటికి అదనంగా మరో 20 శాతం ఇవిఎమ్‌లను ఎన్నికల కమిషన్‌ సిద్ధంగా ఉంచింది. మొదట్లో ప్రతిపాదించిన విధంగా 46,165 పోలింగ్‌ కేంద్రాలకు 1.45 లక్షల ఇవిఎమ్‌లు సరిపోతాయని, అదనంగా ప్రతిపాదించిన 224 ఆగ్జిలరీ పోలింగ్‌ కేంద్రాలకు మరో 15 వేల ఇవిఎమ్‌లు సమకూర్చారు. మొత్తమ్మీద 46,389 పోలింగ్‌ కేందాల్లో 1.60 లక్షల కొత్త ఇవిఎమ్‌లను ఇసి వినియోగించనుంది.

వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల పరిశీలన
జీరో వయెలెన్స్‌ లక్ష్యంగా రాష్ట్రంలోని 75 శాతం పోలింగ్‌ కేంద్రాలను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షిస్తోంది. 26 జిల్లాలకు సంబంధించి 26 టివి మానిటర్ల ద్వారా ఆయా జిల్లాల్లోని పోలింగ్‌ కేందాల్లో జరిగే ఓటింగ్‌ సరళిని పోలింగ్‌ కేంద్రంలో బయట కూడా ఈ దఫా ఇసి నేతృత్వంలో 150 మంది అధికారులు, సిబ్బందిని ఇసి నియమించింది.

ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి – 83 శాతం ఓటింగ్‌ లక్ష్యంగా చర్యలు : సిఇఒ ఎంకె మీనా

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరగనున్న పోలింగులో ప్రతిఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, ధృడమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరగడం ఎంతో కీలకమన్నారు. గత ఎన్నికల్లో 79.84 శాతం ఓటింగ్‌ నమోదైందని, ఈ దఫా ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్‌ లక్ష్యంగా విస్తృత స్థాయిలో ఓటర్లను చైతన్యపరిచేలా పలు స్వీప్‌ కార్యక్రమాలు పెద్దయెత్తున నిర్వహించామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన తాగునీరు, వీల్‌ చైర్లు, ర్యాంపుల, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచామని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నట్లు సిఇఒ తెలిపారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద ఓటర్లను ఎవరైనా అడ్డుకున్నా, చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరగని సిరా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ అందుబాటులో ఉండదని అన్నారు.

➡️