పూల సుగంధం ఏదీ..?

Feb 18,2024 06:33 #Science, #Sneha
Effects of burns on the sensory organs of insects story

పూలు, మొక్కలు, మనకు ఆహ్లాదాన్నిస్తాయి. వాటి నుంచి వచ్చే సువాసన, రంగుల ఆకర్షణ దీనికి కారణం. కానీ రెండు మూడు దశాబ్దాలుగా.. ఏ పూవు పరిమళాన్నైనా మనం ఆస్వాదించగలుగుతున్నామా! ఏ ఆహారాన్నైనా ఆనందంగా తీసుకోగలుగుతున్నామా! టెక్నాలజీ పెరిగింది.. అభివృద్ధి పథంలో నడుస్తున్నాం అని మనం అనుకుంటున్నాం కానీ.. అంతకు మించిన కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయాం. ప్రాణి జీవించడానికి అవసరమైనవన్నీ కలుషితమైపోయాయి. వాయు కాలుష్యం వలన మొక్కలు, వాటిపై ఆధారపడిన కీటకాలు, ఇతర ప్రాణులు ఎంతగా సహజ లక్షణాలను కోల్పోతున్నాయో పరిశోధనలలో తేలింది. కీటకాల సెన్సరీ ఆర్గాన్స్‌పై (వాసనను గ్రహించేవి) కాల్యుష్య ప్రభావం ఎలా ఉంది అనే దానిపై సీటెల్‌లోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జెఫ్‌ రిఫెల్‌ వివరించారు.

వాతావరణంలోని కాలుష్యం వల్ల పూల పరిమళం దెబ్బ తింటుంది. ఫ్యాక్టరీలు, వాహనాలు, మానవ ఇతర కార్యకలాపాల వలన వెలువడే వాయువులు వాతావరణంలో కలిసి ప్రకృతిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు జెఫ్‌ రిఫెల్‌. అడవులు, వన్య ప్రాణుల జీవనంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. జాతులకు జాతులే అంతరించి పోతున్నాయి. శబ్ద కాలుష్యంతో పక్షుల పాటలు, కూతలు కనుమరుగయ్యాయి. నీటి కాలుష్యంతో జలచరాలు అస్తవ్యస్తంగా మారాయి.

పూల సువాసనకు కీటకాలు ఆకర్షింపబడి, వాటిలోని మకరందాన్ని తీసుకుంటాయి. అవి మరో మొక్కపై వాలినప్పుడు పరపరాగ సంపర్కం జరిగి, వృక్ష సంతతి పెరుగుతుంది. కానీ ఈ వాయువులు మొక్కలను ఆవహించడంతో సువాసనలు వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయి. వాహనాల నుండి వెలువడే వాయువుల్లో ఓజోన్‌, నైట్రేట్‌ రాడికల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి పువ్వుల నుండి వచ్చే వాసనతో మిళితమై, వాసన మారిపోతోంది. కీటకాల సెన్సరీ ఆర్గాన్స్‌ సరిగా పనిచేయక అవి పువ్వులపై వాలటం తగ్గింది.

గ్యాస్‌, బొగ్గు, పవర్‌ ప్లాంట్లు, సహజ వనరుల విపరీత వినియోగం వల్ల నైట్రేట్‌లు విడుదలవుతున్నాయి. ఇవి చెట్లు, పువ్వులపై పొరలా ఆవహించి, పూల స్వచ్ఛతను హరించి వేస్తున్నాయి. పరిశోధకులు మాత్‌ (సీతాకోకచిలుకల్లాంటివి) లను వినియోగించి, చేసిన అధ్యయనంలో పగటి సమయంలో కీటకాలు పుష్పాలను చేరటం యాభై శాతం ఉంటే, రాత్రుళ్ళు అసలు పుష్ప మూలాన్నే గుర్తించలేకపోయాయి. పగలు సూర్యరశ్మి నైట్రేట్‌ల ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. ఆహారంగా వినియోగించే పంటమొక్కల్లో డెబ్భై అయిదు నుంచి తొంభై శాతం మొక్కలు కీటకాల ద్వారా జరిగే పరాగసంపర్కంపైనే ఆధారపడ్డాయి. పరాగసంపర్క తగ్గుదలతో ఇప్పటికి డెబ్భై పుష్ప జాతులు అంతరించిపోయాయని, మరికొన్ని చేరువలో ఉన్నాయని పరిశోధకుల అంచనా. ‘పరాగ సంపర్కంపై జరిపే పరిశోధనలకు, దాని పర్యవసానాలెలా ఉంటాయనేందుకు భవిష్యత్తులో ఈ పరిశోధన కీలకంగా మారుతుంది’ అంటారు జోయెల్‌ థోర్నన్‌.ఇదిలాగే కొనసాగితే కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిస్థితి ఇప్పటికే ఉండటం వలన కొన్ని వృక్ష జాతులు అంతరించిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తేనెటీగలు తేనెను కనుగొనే సామర్ధ్యాన్ని కోల్పోతున్నాయి. ఇవి కొన్ని మీటర్ల దూరం నుంచే మకరంద పరిమళాన్ని గుర్తించే సామర్ధ్యం కలిగి ఉంటాయి. ఇప్పుడు ఆ శక్తి 90 శాతం తగ్గిపోయింది. రీడింగ్‌, సర్రే, బర్మింగ్‌హామ్‌, సదరన్‌ క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయాల పరిశోధనా బృందం ఈ విషయాన్ని విశదీకరించింది.పంట దిగుబడిపై ఓజోన్‌ వాయువు ప్రతికూల ప్రభావం చూపుతోంది. మొక్క పెరుగుదలను తగ్గిస్తుంది. మొక్కల నుండి మనకు లభ్యమయ్యే ఆహార పదార్థాలు, పత్తి, జీవ ఇంధనాలు, ఔషధాలు స్వచ్ఛంగా మనకు లభ్యమవడానికి ఈ పరిశోధనలు ఎంతగానో ఉపకరిస్తాయని, తమ నివేదిక అమలు జరిపి, మాకు సహకరిస్తే విపరీత పరిణామాల నుంచి జీవరాశిని కాపాడవచ్చని డాక్టర్‌ లాంగ్‌ఫోర్డ్‌ సూచన.

➡️