వెజ్‌తో చేపల కూర

May 19,2024 09:06

మనకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను రకరకాలుగా వండుకుని తింటాము. అయితే కొండలు, అడవుల్లో నివసిస్తున్న గిరిజనుల వంటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందులోనూ పచ్చి చేపల కూర వెరీ స్పెషల్‌. నాన్‌వెజ్‌ వండేటప్పుడు ఏదో ఒక కూరగాయ కలగలిపి కూర వండుతారు. దాంతో వీటిలో ఉన్న పోషకాలు మరింత అందుతాయి. కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం. ఏయే కూరగాయలతో పచ్చిచేపలు కూరలు ఎలా వండాలో తెలుసుకుందాం.

 


బీరకాయతో…
కావల్సినవి : శుభ్రం చేసుకున్న చేపముక్కలు- కేజీ, బీరకాయలు – 1/2 కేజీ, బంగాళదుంపలు- రెండు, టమోటాలు- నాలుగు, ఉల్లిపాయలు- రెండు, మిర్చి- నాలుగు, అల్లం-చిన్నముక్క, వెల్లుల్లి రెమ్మలు- 15, ఎండుమిర్చి- ఐదు, పసుపు-అరస్పూను, ఉప్పు-తగినంత, జీలకర్ర-స్పూను, గరం మసాల- స్పూను, నూనె-మూడు స్పూన్లు, కొత్తిమీర- గుప్పెడు, నీళ్లు-లీటరు.
తయారీ : బీరకాయ, బంగాళదుంప ముక్కలు పెద్దగా కట్‌ చేయాలి. ఉల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం కలిపి నూరుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి, కొద్దిగా నూనె పోసి, చేప ముక్కలు వేయించుకోవాలి. పది నిమిషాలు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాండీలో బీరకాయ, బంగాళదుంప ముక్కలను విడివిడిగా వేపి, వాటినీ ప్లేట్‌లోకి తీయాలి. ఆ బాండీలో మరికొద్దిగా నూనె పోసి వేడిచేయాలి. టమోటా, మిర్చి వేసి వేయించాలి. ఉల్లి-అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి, ఉప్పువేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత వేపిన బీరకాయ, బంగాళాదుంప ముక్కలు వేసి ఒకసారి కలిపి, ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత వేపిన చేప ముక్కలు వేయాలి. పది నిమిషాల తర్వాత గరంమసాలా వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర వేయాలి. అంతే బీరకాయ చేపల కూర రెడీ.

వంకాయతో..
కావల్సినవి : శుభ్రం చేసుకున్న పచ్చి చిన్నచేపలు- కప్పు, గుత్తి వంకాయలు – 1/4 కేజీ, బంగాళదుంపలు- రెండు, టమోటాలు- నాలుగు, ఉల్లిపాయలు- రెండు, మిర్చి- నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు స్పూన్లు, కారం- స్పూను, పసుపు-అరస్పూను, ఉప్పు-తగినంత, గరం మసాల- స్పూను, నూనె-మూడు స్పూన్లు, కొత్తిమీర- గుప్పెడు, నీళ్లు- అరలీటరు.
తయారీ : పొయ్యి మీద బాండీ పెట్టి, కొద్దిగా నూనె పోసి, చిన్న చేపలు వేయించుకోవాలి. పది నిమిషాలు వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాండీలో వంకాయముక్కల్ని వేపి, వాటినీ ప్లేట్‌లోకి తీయాలి. బాండీలో మరికొద్దిగా నూనె పోసి వేడిచేయాలి. ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. టమోటా ముక్కలు వేసి, వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్‌, కారం, పసుపు వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి, ఉప్పువేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత వేపిన వంకాయ, చేపలు వేసి ఉడకనివ్వాలి. దించబోయే ముందు గరం మసాలా, కొత్తిమీర వేయాలి. అంతే వంకాయ చేపకూర రెడీ!

 


సొరకాయతో…
కావల్సినవి : శుభ్రం చేసుకున్న చేప ముక్కలు- కేజీ, సొరకాయ – 1/2 కేజీ, టమోటాలు- నాలుగు, ఉల్లిపాయలు- రెండు, మిర్చి- నాలుగు, అల్లం-చిన్నముక్క, వెల్లుల్లి రెమ్మలు- 15, ఎండు మిర్చి- ఐదు, పసుపు-అరస్పూను, ఉప్పు-తగినంత, జీలకర్ర-స్పూను, గరం మసాల- స్పూను, నూనె-మూడు స్పూన్లు, కొత్తిమీర- గుప్పెడు, నీళ్లు-లీటరు.
తయారీ : సొరకాయ ముక్కలు పెద్దగా కట్‌ చేయాలి. ఉల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం మెత్తగా నూరుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి, కొద్దిగ నూనె పోసి, చేప ముక్కలు పది నిమిషాలు వేగాక, ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాండీలో నూనె పోసి వేడి చేయాలి. టమోటా, మిర్చి చీలికలు వేసి వేయించాలి. ఉల్లి-అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి, ఉప్పువేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి బాగా ఉడకనివ్వాలి. తర్వాత వేపిన చేప ముక్కలు వేసి కలపాలి. పది నిమిషాల తర్వాత గరంమసాలా వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర వేయాలి. అంతే సొరకాయ చేపల కూర రెడీ.

➡️