క్షమాగుణం అవసరం..

Dec 3,2023 13:12 #Sneha

క్షమించమని కోరడం గొప్ప సుగుణం. ఈ రోజుల్లో సారీ అనేయడం చాలా తేలిగ్గా అయిపోయింది. కానీ వాస్తవంగా తప్పు చేసినప్పుడు తప్పకుండా సారీ చెప్పడం మంచి అలవాటు. ఇది పిల్లలకు బాల్యంలోనే నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అయితే మనం అలాంటి గుణం కలిగి ఉన్నామా? అంటే.. చాలా సందర్భాల్లో లేదనే సమాధానం వస్తుంది. దీనికి అంతరాలు అసలు పాటించకూడదు. ఎవరు తప్పు చేసినా అందుకు బాధ్యత వహించాలి.

కొందరు చిన్నారులు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు గబుక్కున ‘నీకెందుకు? నువ్వెవరివి? ఏరు నువ్వు పో ఇక్కడ నుంచి’ వంటి మాటలు అనేస్తుంటారు. ‘అలా అనకూడదు.. సారీ చెప్పు!’ అంటే.. ఊహూ ఒక పట్టాన సారీ చెప్పడానికి ఒప్పుకోరు. కారణం తను చేసింది తప్పు అని ఒప్పుకోవాల్సి రావడమే. అందుకు ఆ చిన్న మనస్సు అంగీకరించకపోవడం ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవం. అయితే దీనికి మూలాలు ఉన్నాయనే నిజాన్ని కూడా నిర్భయంగా ఒప్పుకోవాలంటున్నారు నిపుణులు.

కుటుంబంలో..

భార్యాభర్తల మధ్య ఇంట్లో ఏదో విషయం మీద వివాదం జరుగుతుంది. ఎవరూ తగ్గేదేలేదు అన్నట్లు ఒకరిపై ఒకరు పరుషంగా మాటలు అనుకుంటారు. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో ఎవరికి వారికే తెలియని స్థితి. ఈ పరిస్థితి అంతా అక్కడే ఉన్న పిల్లలు వింటున్నారన్న స్పృహ కూడా ఉండదు. అలాగే ఎవరిది తప్పో వాళ్లు అంగీకరించడానికి సిద్ధపడరు. తప్పు ఒప్పుకోవడానికి ఎవరికి వారికి అహం అడ్డొస్తూ ఉంటుంది. ఇది ఎంత మాత్రం ఆహ్వానించదగిన పరిణామం కాదు. అసలు పిల్లల ముందు తగువాడుకోవడం వారి మీద వ్యతిరేక ప్రభావం కలిగిస్తుంది. అదే ఎవరి తప్పు వారు తెలుసుకుని, ఒకరినొకరు క్షమించమని కోరుకుంటూ వారి మధ్య సఖ్యత ఏర్పడడమే కాదు.. అది పిల్లల మీదా సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు నిపుణులు.నేర్చుకుంటారు..ఆధిపత్యం చూపించడం కుటుంబంలో పురుషుల లక్షణం అనీ.. వాటిని సహించాల్సిన బాధ్యత మహిళలకే ఉండాలనే భావజాలం బద్ధలు కొట్టాలి. ఇది కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. తండ్రిని చూసే పిల్లలు కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఒకరు ఆధిపత్యం చలాయిస్తుంటే దానికి సమాధానంగా తిరిగి ఆధిపత్యం ప్రదర్శించడం ఎప్పుడూ పరిష్కారం కాదని నిపుణులు చెప్తున్నారు. ఎవరూ ఎవరిపై ఆధిపత్యం చలాయించకూడదు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అది తప్పని ఒప్పుకుని, క్షమించమని అవతలివారిని కోరాలి. అది తప్పు అనేది అప్పుడు పిల్లలకూ తెలిసి వస్తుంది. అలాకాకుండా ఆధిపత్యం చలాయించడం సరైనదనే తప్పుడు అభిప్రాయం కలిగి, పిల్లలూ అలాంటి ఆలోచనతోనే ఎదుగుతారు. అలాగే వాళ్లూ ఆధిపత్యం ప్రదర్శిస్తారు.

చులకన అనుకోవద్దు..

తప్పు ఒప్పుకోవడం చులకన అనుకోవద్దు అంటున్నారు నిపుణులు. అలా అనుకోవడం వల్లే చాలా సందర్భాల్లో చేసింది తప్పని తెలిసినా.. క్షమించమని కోరడానికి మనసు అంగీకరించదు. అలా ఒప్పుకుంటే అవతలి వారి ముందు తక్కువైపోతామని భావిస్తారు. కానీ అది మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడమే కాక.. అవతలి వారి ముందు ఉన్నతంగా ఉండేలా చేస్తుందనేది నిపుణుల మాట.

చెప్పడం అలవాటు కావాలి..

తప్పు జరిగినప్పుడు క్షమించమని కోరడమనే గుణం బాల్యంలోనే అలవాటు కావాలి. అది పిల్లల్ని సుగుణశీలుల్ని చేస్తుంది. తప్పొప్పులను బేరీజు వేసుకునే సామర్ధ్యాన్నీ పెంపొందేలా చేస్తుందనేది నిపుణుల సూచన. స్నేహితులతో ఉన్నప్పుడు తప్పు చేస్తే కచ్చితంగా క్షమించమని కోరితే.. వాళ్ల మధ్య అనుబంధం మరింత పెంపొందుతుంది. తప్పు చేసినప్పుడు అవతలివారూ క్షమించమని కోరాలనే విషయం బోధపడుతుంది. కొందరైతే వాళ్లు చెప్పడమే కాకుండా.. అవతలి వారి నుంచి డిమాండ్‌ కూడా చేస్తుంటారు. అంగీకరించక పోయినా.. తప్పు ఒప్పుకోవడం.. క్షమించమని కోరడం.. మనల్ని మనం సరిచేసుకోవడమే అంటున్నారు నిపుణులు.ఇప్పటివరకూ మీరు ఎలా ఉన్నా.. నేటి నుండి అయినా.. ఈ లక్షణం అలవర్చుకోండి.. మీరు దీన్ని ఆచరణలో పెట్టాక.. కుటుంబంలోగానీ, పిల్లల్లోగానీ, చుట్టూ ఉన్న వారితోగానీ, బంధువుల్లోగానీ.. మీరు తప్పకుండా ఉన్నతంగా నిలుస్తారు. అంతేకాదు.. మనం తప్పు చేశామనే మానసిక వేదన నుంచి బయటపడేందుకు తోడ్పడుతుంది. ఆ గిల్ట్‌ను పోగొట్టుకునే చిట్కా సారీనే..!

➡️