పండుమిరప జోడించిన పచ్చళ్లు..

Mar 31,2024 08:56 #Cooking, #Sneha

ఎర్రగా నిగనిగలాడుతూ మండుతాయి అని తెలిసీ నోరూరించే ప్రత్యేక లక్షణం పండుమిరపది. దీని శాస్త్రీయ నామం క్యాప్సికమ్‌ యాన్యుమ్‌. ఇది సోలనేసి కుటుంబానికి చెందినది. దీనిలో విటమిన్‌ సి, కెరోటిన్‌ (ప్రోవిటమిన్‌ ఎ), పొటాషియం, మెగ్నీషియం, ఇనుము లాంటివి అధికంగా ఉంటాయి. మిరపలో ఉండే విటమిన్‌ సి, బీన్స్‌, ధాన్యాలలాంటి ఇతర పదార్థాల నుంచి లభ్యమయ్యే ఇనుముని శరీరం గ్రహించేలా చేస్తుంది. ఇవేకాక ఫ్లేవనాయిడ్స్‌, ఫినోలిక్స్‌, కెరోటినాయిడ్లు, ఆల్కలాయిడ్స్‌ కూడా పండుమిరపలో ఉంటాయి. ఇన్ని పోషకాలుండబట్టే మిరప మన ఆహారంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పండుమిరపతో నిలవ పచ్చడి, గోంగూర పండుమిర్చి, టమాటా పండుమిర్చి.. లాంటి ఊరగాయలు మనకు సుపరిచితమే. అలాగే మరికొన్ని నోరూరించే కొత్త పచ్చళ్లు తెలుసుకుందాం.


మామిడితో..
కావలసినవి : పచ్చిమామిడి కాయ – 5 కప్పులు, పండుమిర్చి – పావుకేజీ, తాలింపు దినుసులు – తగినన్ని, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి తరుగు – కప్పు, ఉప్పు – తగినంత, మెంతిపిండి – పావు కప్పు, నూనె – సరిపడా, కరివేపాకు – 2 రెమ్మలు.
తయారీ : మామిడికాయ ముక్కలను ఒక బేసిన్‌లోకి తీసుకోవాలి. పండుమిరపకాయలను శుభ్రం చేసుకుని, చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఉప్పు, మిరపకాయ ముక్కలను బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్టును, పొట్టు తీసిన వెల్లుల్లి, పసుపు, మెంతిపిండిని మామిడికాయ ముక్కల్లో వేసి కలపాలి. దీనికి నూనె వేడిచేసి పోపు పెట్టుకుని చల్లారాక కలుపుకోవాలి. కొందరు తాలింపు లేకుండా పచ్చినూనె కలుపుతారు. అంతే రుచులూరే పండుమిర్చి- మామిడి పచ్చడి రెడీ. ఈ పచ్చడి తడి తగలకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. ఫ్రిజ్‌లో భద్రపరచుకుంటే ఏడాదంతా తాజాగానే ఉంటుంది.


అల్లంతో..
కావలసినవి : పండుమిరప కాయలు – 1/2 కేజీ, అల్లం – 1/4 కేజీ, బెల్లం – 1/4 కేజీ, చింతపండు – 1/4 కేజీ, కల్లుప్పు – 150 గ్రా., వెల్లుల్లి – 2, నూనె – 300 ఎంఎల్‌ , వేయించిన మెంతిపొడి – 2 స్పూన్లు
పోపు : ఆవాలు- స్పూను, పచ్చి శనగపప్పు – స్పూను, జీలకర్ర – స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 6, కరివేపాకు రెబ్బలు – 2, ఎండుమర్చి – 4,
తయారీ : పండుమిరపకాయలు, అల్లం శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. అల్లం పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. బాండీలో నూనె వేడి చేసి, అల్లం ముక్కలు మీడియం ఫ్లేం మీద మంచి సువాసన వచ్చేలా, దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాండీలో మిగిలిన నూనె వేడిచేసి తాలింపు దినుసులు వేసి పోపు పెట్టుకుని పక్కనుంచుకోవాలి. మిక్సీ జార్‌లో పీచు, గింజలు తీసి, శుభ్రం చేసుకున్న చింతపండు, ఉప్పు కలిపి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో తురిమిన బెల్లం పొడిని వేసి మెత్తగా మిక్సీ పట్టి వెడల్పు గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్‌లో పండుమిర్చి, మిగిలిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. దీనికి ముందుగా గ్రైండ్‌ చేసుకున్న ఉప్పు, చింతపండు, బెల్లం మిశ్రమం, మెంతిపొడి వేసి బాగా కలపాలి. దీనికి చల్లారిన తాలింపు కలుపుకోవాలి. అంతే ఘుమఘుమలాడే పండుమిర్చి, అల్లం పచ్చడి రెడీ. తడి తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే ఏడాదంతా నిల్వ ఉంటుంది.

స్టఫ్డ్‌..
కావలసినవి : పండుమిరప కాయలు – 1/4 కేజీ, ఆవనూనె – 2 గరిటెలు, వెనిగర్‌ – 2 స్పూన్లు, వేయించిన ఆవ పొడి – 3 స్పూన్లు, సోంపు పొడి – 3 స్పూన్లు, వేయించిన మెంతి పొడి – 3 స్పూన్లు, ఉప్పు – తగినంత, పసుపు – కొద్దిగా, ఇంగువ – కొద్దిగా.
తయారీ : శుభ్రంగా కడిగి ఆరబెట్టిన పండుమిరపకాయలు తొడిమలు తీసి బజ్జీ మిరపకాయల్లా చీల్చుకోవాలి. లోపలి విత్తనాలు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిరప గింజలు, పైన చెప్పిన పొడులన్నీ బాగా కలిపి, ఆవనూనె తరువాత వెనిగర్‌ కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టాలి. కాస్త ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని చీల్చుకున్న పండుమిరపకాయల్లో కూర్చాలి. వీటన్నింటినీ శుభ్రమైన గాజు సీసాలో పెట్టి, మిగిలిన నూనె పోసి నిల్వ ఉంచుకోవచ్చు. ఈ యమ్మీయమ్మీ స్టఫ్డ్‌ పండు మిరపకాయలు రెండు నెలలు వరకూ తాజాగా ఉంటాయి.

➡️