కనురెప్పలవ్వండి..!

Mar 24,2024 07:48 #Children, #Parenting, #Sneha, #Summer

పిల్లల్ని సహజంగానే సురక్షితంగా చూసుకోవాలి. ఈ ఎండాకాలంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రత్యేకంగా పిల్లల విషయంలో.. పిల్లలకు ఏమీ తెలియదు. తెలిసీ తెలియక చేసే పనులే పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఎండాకాలంలో తాగే నీటి దగ్గర నుంచి తినే ఆహారం వరకూ తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.

వేసవి కాలంలో పిల్లలకు పరీక్షలు, మరోవైపు ఒంటిపూట బళ్లు.. వెరసి ఎక్కువ సేపు ఇంటివద్ద ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు ఎండ వేడిమిని లక్ష్య పెట్టక ఆటలకు బయటకు వచ్చేస్తారు. అసలు ఈ ఒంటిపూట బళ్లప్పుడు పిల్లలు మంచి ఎండలో ఇంటిముఖం పడుతుంటారు. ఈ వేడికి వారు అనారోగ్యం పాలవుతారంటున్నారు నిపుణులు.

తాగే నీరు..
పిల్లలకు ఈ వేసవిలో తాగే నీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవికి నీరంతా అడుగంటడంతో బ్యాక్టీరియా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ నీటి వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ముఖ్యంగా నీటి వల్ల బోలెడన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రధానంగా పిల్లల్లో అతిసార వ్యాధి నీటివల్లే కలుగుతుంది. అందుకే పిల్లలకు ఇచ్చే నీరు సురక్షితంగా ఉండేలా చూడాలి. కాచి, చల్లార్చిన నీటినే వాడాలి. అవసరమైతే మట్టి కుండల్లో ఈ నీటిని ఉంచి ఇవ్వడం వల్ల.. చల్లగానూ, ఆరోగ్యంగానూ ఉంటుందంటున్నారు నిపుణులు.

చిరుతిళ్లు..
సహజంగానే పిల్లలు ఇంట్లో ఆహారం కన్నా బళ్లపై, కొట్లల్లో అమ్మే రంగు రంగుల ఆహారపదార్థాలకు ఆకర్షితులవుతారు. దీనివల్ల పిల్లలకు జ్వరాలు, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయంటున్నారు నిపుణులు. బయట ఆహారాలపై ఈగలు వాలడం, దుమ్మూధూళీ పడటంతో ఆహారం కలుషితమవుతుంది. ఈ నేపథ్యంలో పిల్లలు తీసుకునే ఆహారంపై మరింత శ్రద్ధ ఈ కాలంలో తీసుకోవాలనేది నిపుణుల మాట. ఇంట్లోనే పిల్లలు ఇష్టంగానే తినే చిరుతిళ్లు చేసిపెట్టడంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే కర్బూజ, పుచ్చకాయ వంటి పళ్లను ఎక్కువగా పిల్లలకు పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.


ఆటలు..
పిల్లలు ఈ ఎండాకాలంలో బయట కెళ్లి ఆడాలంటే ఉదయం, సాయంత్రం వేళల్లో తల్లిదండ్రులే ఏదైనా స్టేడియంకి తీసుకొని వెళ్లాలి. లేదా దగ్గరలోని ఏదైనా ఖాళీ స్థలంలో పిల్లలు ఆడుకునేలా ఏర్పాటు చేయాలి. అంతేగానీ ఎండవేళ పిల్లలు ఆరుబయట ఆటలు ఆడేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ఈసారి ఎండలు అసలే మండుతున్నాయి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే, ఎండకు నీరసించిపోవడమే కాకుండా, ఆ సమయంలో ఆటల వల్ల మరింత నీరసించిపోతారు. అందుకే ఎక్కువగా పిల్లలు ఈ ఎండవేళ ఇండోర్‌ గేమ్స్‌ ఆడేలా చూడాలి.

నిద్ర..
పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర పోకుండా మొబైల్స్‌లో గేమ్స్‌ ఆడుతున్నా, షోలు చూస్తున్నా తల్లిదండ్రులు ఏమరుపాటుగా ఉండొద్దంటున్నారు నిపుణులు. పిల్లలు దీనివల్ల కంటికి విరామం లేకుండా అయిపోతుంది. అదీకాకుండా అదో అలవాటుగా మారిపోతుంది. పిల్లలకు సమయం కేటాయించి, ఆ నిర్ణీత సమయంలోనే మొబైల్‌ ఇచ్చేలా చూడాలంటున్నారు నిపుణులు. వేళకు నిద్రపోయేలా, ఆహారం తీసుకునేలా చూడాల్సింది తల్లిదండ్రులే.

ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూనే పిల్లలకు కథల పుస్తకాలు చదివించడమూ, కథలు చెప్పడమూ వంటివి చేయాలి. పెద్దవాళ్లు ఇంట్లో ఉంటే వారితో పిల్లలు గడిపేలా చూడాలి. వారికి సహాయపడేలా, చిన్న చిన్న పనులు చేసేలా ప్రోత్సహించాలి. మంచి పనులు చేస్తున్నప్పుడు పిల్లల్ని అభినందిస్తే ఎంతో ఆనందపడతారు. అలాగే చెడ్డ పనులు చేసినప్పుడు మాత్రమే కోప్పడటమో, దండిచడమో చేస్తే పిల్లల్లో వ్యతిరేక భావం పెరుగుతుంది. కానీ మంచికి మంచి, చెడుకు చెడు చెప్పినప్పుడు విచక్షణతో మెలగాలనేది వారికి బాల్యంలోనే అర్థమవుతుంది. ఇలాంటి బాల్యంలోనే పిల్లలకు అలవాటు కావాలనేది నిపుణులు చెప్తున్న మాట.

➡️