పాత హుషార్లు

Mar 31,2024 10:28 #Sneha, #Women

ఎప్పటిలాగే అరకేజీ సెల్ఫ్‌ డౌట్‌, బోలెడంత చిరాకు అయిన నా ఆస్తులను, జాగ్రత్తగా వెంట పెట్టుకుని ఆటోలో ఆఫీసుకు వెళుతున్నాను. దారంతా బోరు, అంతలో సడన్‌గా నిశబ్దం.. ఏంటా అని చూస్తే.. అంతా ఫ్రీజ్‌ అయిపోయారు! వాహనాలు, మనుషులు, అందరూ ఎక్కడికక్కడే ఆగిపోయి, నా శ్వాస నాకే వినపడేంత నిశ్శబ్దం. ఆశ్చర్యంగా, ఈ వింతైన దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయా. ఈ మాయా ప్రపంచంలో కదులుతూ కనపడింది ఒక వెలుగులు విరజిమ్ముతున్న జీవి.
ఆటో దిగి చూసి, దాని వేగాన్ని అందుకోలేక పరిగెడుతూ ఆయాసపడుతూ, తన వెంట వెళ్ళాను. చూసి కూడా, పట్టించుకోనట్టు నటించి వెళ్లిపోయింది. అది ఒక్కచోట ఆగి నిలకడగా ఉంటే ఒట్టు. మొత్తానికి ఏదోలా దాన్ని చేరుకుని, నువ్వెవరు అని అడిగా. ఏదో సెలెబ్రిటీలాగా ఫీల్‌ అయిపోయి, నా దగ్గరకు వచ్చి, నేనా? నేనెవరంటే అని మొదలుపెట్టింది..
‘నెమలిలోని అందం, రోజా పువ్వులోని సువాసన, చెట్టులోని ధైర్యం, వెన్నెల్లోని కమ్మదనం, సీతాకోకలోని మృదుత్వం, బుల్లి కళ్ళలోని సున్నితత్వం, ఈ ప్రపంచంలోని మొత్తం బలం, నా సొంతమే. నా గురించి అర్థమయిందా, ఇంకా ఏమైనా చెప్పనా?’ అంది. ప్రపంచంలోని పొగరంతా దాని మాటల్లోనే ఉంది.
అది సరేగాని, ఏం చేస్తుంటావు నువ్వు, అని అడిగా. ‘నేను చేయనిదీ, చెయ్యగలగనిదీ అంటూ ఏమీ లేవు, అన్నీ చేసెయ్యాలన్న తపన, చేసెయ్యగలనన్న నమ్మకం, చేసేటంత సత్తా ఉన్న దాన్ని.’ అంది.
సరిపోయింది, ఇది దేనికీ సమాధానం తిన్నగా ఇవ్వదేమో అనుకున్నా. అవును, నువ్వు ఇంత పొగరుగా ఉన్నావు, నిన్ను చూసి ఎవరైన ఏమైనా అనుకోరా, నీకు పర్లేదా అని అడిగాను. ‘ఎవరో ఎదో అనుకుంటే నాకేంటి, అయినా మహా అయితే నా గొప్పతనం తెలుసుకుంటారు. ‘World doesnt work on what others think about you, its just about you and YOU’ అంది.
మొదట తన తీరు నచ్చకపోయినా, తన మాటలు, ప్రవర్తనతో, నాకే తెలియకుండా నన్ను ఆకర్షించేసింది, నా మోకాలంత కూడా లేని ఆ బుడ్డి పాప.
అసలు ఇన్ని చెప్పావు గాని, నువ్వు ఎవరూ అన్న ప్రశ్నకు మాత్రం జవాబివ్వవేం, అనడిగా.
‘అదేంటే, ఒకప్పటి నిన్నే నువ్వు గుర్తుపట్టనంత ఎక్కువ ఎదిగిపోయావా? వయసు పెరిగేకొద్దీ, నీకు ఒకప్పుడుండే, నీవి అయిన, ఆ నమ్మకం, కూసంత పొగరు, ఎవ్వరినీ లెక్కచెయ్యని ధైర్యం, ఏ హీరోయిన్‌ నా ముందు పనికిరాదు అని నమ్మిన రోజులు, ఏ పాటైనా పాడేయగలనన్న అతి విశ్వాసం, ప్రతి స్టెప్పూ చేసెయ్యగలనన్న అతి పిచ్చి నమ్మకం, ఎవ్వరూ ఆనని నీ ధైర్యం, ఎవరినీ పట్టించుకోవడానికి సమయం లేని నీ పాత ఉత్సాహం, ప్రతి కుక్కపిల్లతో స్నేహం చేసేసే నీ హుషారుని, పదేళ్ల క్రితం తెలిసే పారేసుకున్నావు. ఇవి నీవే, నీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. మళ్లీ ఇంకెప్పుడూ పారేసుకోకు. పారేసుకున్నావనుకో, నేను ఇకపై ఊరుకోను, ఇలానే మళ్లీ మళ్లీ వాటిని దులిపి మరీ తెచ్చిస్తూనే ఉంటాను..

Girl remember, you cannot escape from aging, neither do anyone. But while in the long-far journey, dont fail to take along your so-called belongings that are your self-confidence, over-confidence.

➡️