ప్రముఖ మహిళా నేతలు

Mar 3,2024 08:59 #Sneha, #Women Stories
  • ప్రజాప్రతినిధులుగా మహిళలు ఎలా పనిచేస్తారో.. ఇక్కడ పేర్కొన్న మహిళా నేతల్ని, వారి పనిని పరిశీలిస్తే అర్థమవుతుంది. నేడు దేశంలో యువత కూడా అలాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు. ఆ విధంగా మహిళలు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సమర్థవంతంగా పనిచేశారు. వారిలో నాటి నుంచి నేటి వరకూ పనిచేసిన కొందరు మహిళల గురించి క్లుప్తంగా..

అనీ బిసెంట్‌

మహిళా హక్కుల పోరాట యోధురాలు, బ్రిటీష్‌ సామాజిక సంస్కర్త అయిన అనీ బిసెంట్‌ భారత జాతీయ స్వాతంత్య్రోద్యమానికి గట్టి మద్దతునిచ్చారు. కార్మికులకు మరింత మెరుగైన పని పరిస్థితులను కల్పించడం కోసం ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. మహిళల ఓటు హక్కు, జాతీయ విద్య, కార్మిక సంఘాలు వంటి అంశాలపై 1870ల్లో చార్లెస్‌ బ్రాడ్‌లాతో కలిసి అనీ బిసెంట్‌ నేషనల్‌ రిఫార్మర్‌ అనే మేగజైన్‌ను నిర్వహించారు. కుటుంబ నియంత్రణ కోసం పోరాడుతున్న వారిని నేరస్తులుగా పరిగణించి, ఆనాడు కోర్టు విచారణ కూడా జరిగింది. ఆ తర్వాత వారిని నిర్దోషులుగా విడిచిపెట్టారు. 1888లో తూర్పు లండన్‌లో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో మహిళా కార్మికులు సమ్మె నిర్వహించి, తమ డిమాండ్లు సాధించుకునేలా చేయడంలో ఆమె ఎంతో సహకారం అందించారు. తదనంతర కాలంలో సామాజిక, రాజకీయ రంగాల సంస్కరణల పథం నుండి ఆమె అడుగులు థియోసోఫికల్‌ సొసైటీ (దివ్యజ్ఞాన సమాజం) వైపునకు మళ్లాయి. మొదటిసారిగా 1893లో భారత్‌ను సందర్శించిన అనీ బిసెంట్‌ తర్వాత ఇక్కడే స్థిరపడ్డారు. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో సభ్యురాలు కూడా అయ్యారు. 1933 సెప్టెంబరు 20న ఆమె భారత్‌లోనే కన్నుమూశారు.

సరోజినీ నాయుడు

మహిళలకు ఓటు హక్కును కల్పించడంలో, భారత స్వాతంత్య్రోద్యమంలో సరోజినీ నాయుడు కీలకపాత్ర పోషించారు. ‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన ఆమె, లండన్‌లో విద్యార్థినిగా వున్న కాలంలోనే ప్రజా సమస్యలపై పోరుబాట చేపట్టారు. 1906 లోనే రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టినా 1917 నుండి క్రియాశీల రాజకీయాల్లో వున్నారు. భారతీయ మహిళలకు ఓటుహక్కు కల్పించడంపై బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఆమె విఫలమైనప్పటికి కూడా ఆనాటి బిల్లు తదనంతర కాలంలో ఈ అంశంపై నిర్ణయానికి మార్గం వేసింది. మహాత్మాగాంధీ, గోపాలకృష్ణ గోఖలే, అనీ బిసెంట్‌ వంటి స్వాతంత్య్ర ఉద్యమ నేతలతో కలిసి పనిచేసి, అనేకసార్లు జైలుకు వెళ్లారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఉమెన్స్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సామాజిక సంక్షేమంపై, మహిళా సాధికారతపై ప్రసంగాలు చేశారు.

ద్రౌపది ముర్ము

స్వతంత్ర భారతదేశంలో జన్మించి, రాష్ట్రపతి పదవిని అధిష్టించిన తొలి వ్యక్తిగా రికార్డు సాధించారు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒడిశ్శాలోని గిరిజన తెగకు చెందిన ఆమె ఇప్పటివరకు ఈ పదవిని అధిష్టించిన వారందరిలోకి పిన్న వయస్కురాలే కాదు, సమున్నత పదవిని చేపట్టిన తొలి ఆదివాసీ మహిళ కూడా. ఈ పదవిని స్వీకరించడానికి ముందు ఆమె ప్రభుత్వ ఉద్యోగినిగా, టీచర్‌గా పనిచేశారు. రెండుసార్లు ఎంఎల్‌ఎగా కూడా చేశారు. ఒడిశ్శా ప్రభుత్వంలో మంత్రిగా, జార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేసిన అనుభవమూ వుంది. సుఖోరు యుద్ధ విమానంలో ప్రయాణించిన మూడవ రాష్ట్రపతి ఆమె.

ఇందిరాగాంధీ

భారతదేశపు ప్రప్రథమ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ కుమార్తె, తొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తన అంగరక్షకుల చేతుల్లో హత్యకు గురై, పాతికేళ్లు గడిచిపోయినా ఇంకా ఆమెకు భారతీయుల హృదయాల్లో శాశ్వత స్థానం ఉంది. పదవి చేపట్టేనాటికి ఏమీ తెలియకపోయినా ఐదేళ్ళ వ్యవధిలోనే అమె అత్యంత శక్తివంతమై ప్రధానిగా ఎదిగారు. ‘గరీబీ హటావో’ వంటి నినాదాలతో ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఆమె పేదలకు, బడుగు వర్గాల జీవితాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత చీకటి కాలమైన ఎమర్జెన్సీని విధించి, ప్రత్యర్థులను జైలుకు పంపారు. దేశ ఆహార భద్రతకు హామీ కల్పించిన హరిత విప్లవానికి ఆమె హయాంలోనే నాంది పలికారు. బ్యాంకుల జాతీయకరణ చేపట్టారు. మంచి దౌత్యవేత్త అయిన ఇందిర అంతర్జాతీయంగానూ అనేక దేశాలతో సమర్ధవంతమైన సంబంధాలు నెలకొల్పారు. పేదలతో మమేకమవడం ఆమె ప్రధాన బలం.

కెకె శైలజ

నిఫా వైరస్‌పై కేరళ చేసిన పోరాటానికి నిశ్శబ్ద ప్రతిరూపమే సిపిఎం సీనియర్‌ నేత, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ. ప్రజారోగ్యానికి ఎదురైన సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కొని, విజయం సాధించారు. దీనిపై మలయాళంలో చిత్రం కూడా రూపొందింది. కేరళలోని కన్నూర్‌లో రాజకీయ కుటుంబంలో జన్మించిన శైలజ తాతలు కమ్యూనిస్టు కార్యకర్తలు, స్వాతంత్య్రయోధులు. అస్పృశ్యత, మూఢనమ్మకాలపై పోరు సల్పే సామాజిక సంస్కరణవాది అయిన అమ్మమ్మ నుండి స్ఫూర్తిని పొందిన శైలజ చిన్ననాటి నుండే ఆమెతో కలిసి రాజకీయ సభలకు హాజరయ్యేవారు. విద్యార్థిగానే రాజకీయాల్లో చేరిన శైలజ 15 ఏళ్ళ పాటు విద్యార్థి, మహిళా విభాగాల్లో పనిచేసిన తర్వాత 1996లో అసెంబ్లీకి పోటీ చేశారు. మూడు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచిన ఆమె 2016లో రాష్ట్ర ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు.

ఆర్య రాజేంద్రన్‌

తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికైన 21ఏళ్ళ కాలేజీ విద్యార్థిని ఆర్య రాజేంద్రన్‌. బిఎస్‌సి మేథ్స్‌ రెండో సంవత్సరం చదువుతున్న ఆమె కేరళ రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా రికార్డు సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అదే ప్రథమం. సిపిఎం కార్యకర్త కె.రాజేంద్రన్‌ కుమార్తె అయిన ఆర్య చిన్ననాటి నుండే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ధృఢమైన విశ్వాసం కలిగిన ఆ యువతి కుటుంబంలో అందరూ సిపిఎం మద్దతుదారులే. రాజధాని నగర మేయర్‌గా తన ప్రాధాన్యతల్లో వ్యర్థాల నిర్వహణా యాజమాన్యం ఒకటని ఆమె చెప్పారు. చెత్తను రోడ్ల పక్కన పడేసే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం వుందని ఆమె అభిప్రాయపడ్డారు.

  • పద్మలత
➡️