అక్షరాలు గుర్తుండేలా!

Apr 7,2024 09:17 #Children, #Sneha, #Stories

నేర్చుకుందాం..
బాల్యంలో బోర్డు మీద అక్షరాలు రాసి పలికిస్తూ, పిల్లల్ని చదవమని టీచర్లు చెబుతుంటారు. ఇవన్నీ కొంత సమయం వరకే వారి మెదడులో గుర్తుండిపోతాయి. మరసటి రోజు చూసి చెప్పమన్నా చెప్పలేరు. అందుకే అక్షరాలు గుర్తుండేలా ఓ ఆట ఆడిస్తే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. చదవడంలో ఆనందం పొందేలా చేయాలి. మరి అది ఎలాగో తెలుసుకుందాం.
ఎలా చేయాలి : పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టాలి. ప్రతి ఒక్కరికీ ప్లాష్‌కార్డులు ఇవ్వాలి. వారికి ఇష్టమైన జంతువు, పక్షి, మనుషులు, చెట్లు, వస్తువుల పేరును ఒకటి చెప్పమని అడగాలి. దాన్ని వారి చేతిలో ఉన్న ప్లాష్‌కార్డు మీద స్కెచ్‌ పెన్నుతో టీచర్‌ రాసి ఇవ్వాలి. ఎవరి కార్డు మీద ఉన్న పదాన్ని ఒకరి తర్వాత మరొకరు చదవాలి. అక్షరాలు గుర్తించడంలో ఇబ్బంది ఉన్నప్పటికీ తాను చెప్పిన పదమే కాబట్టి ఇష్టంగా చదువుతారు. తమ పేరైతే ఇంకా ఇష్టంగా చదువుతారు. గుర్తుండిపోతుంది కూడా. కార్డుకు ఒక వైపు బొమ్మ, మరొక వైపు పేరు వుండే ప్లాష్‌ కార్డులు ఇచ్చి అందరిచేత ప్రతిరోజూ చదివించవచ్చు. ఇలా చదవడంలో ఆనందం పొందితే.. పిల్లలు మాట్లాడే మాటకు అక్షర రూపం వుంటుందని తెలియజేస్తే.. అక్షరాలు బాగా గుర్తుపెట్టుకుంటారు.

➡️