మూఢనమ్మకాలు లేవని చెప్పా..

Apr 21,2024 11:42 #Sneha

చిత్రపరిశ్రమల్లో మహిళా దర్శకులు ఎంతమంది ఉన్నారంటే? వేళ్ల మీద లెక్కపెట్టి చెప్పొచ్చు. అటువంటి క్రమంలో మ్రితిక సంతోషిణి ముందుకు రావడం అభినందించాల్సిన విషయం. దర్శకురాలిగా తీసిన తొలి సినిమా ‘వళరి’. ఈ నెల 6న విడుదల అయ్యింది. ఏ ఇండిస్టీలోనైనా హర్రర్‌ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంటుంది. అదే బాటలో తన మొదటి సినిమా తీశారు మ్రితిక. చిన్నప్పటి నుంచి కంటున్న తన కలను నేరవేర్చుకున్నారు. అసలు ఈ సినిమా కథ ఏంటీ? ఈ సందర్భంగా ఆమె మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నారు.

మ్రితిక సంతోషిణిది తమిళనాడులో నివాసం ఉంటున్న తెలుగు మూలలున్న కుటుంబం. ఆమె కోయంబత్తూరులో పుట్టి పెరిగింది. కానీ తల్లిదండ్రుల ఇరు కుటుంబసభ్యులు తెలుగు రాష్ట్రానికి చెందిన వారు. దాంతో ఆమెకు బాల్యంలో తెలుగు కొంత తెలుసు. చిన్నతనంలో అమ్మమ్మ, ఇతర కుటుంబసభ్యులతో కలిసి విడుదలైన ప్రతి సినిమాకూ వెళ్లేది. దాంతో ఆమె సినిమాల పట్ల, ఆయా సన్నివేశాల పట్ల ఆకర్షణకు లోనయ్యేవారు. దాంతో ఆమెకు స్కూలు డేస్‌ నుంచే డైరెక్టర్‌ కావాలనే కోరిక బలంగా ఉండేది. కథలు, కవితలు రాయడం తన అభిరుచి. ఆ దిశగా ఆమె సాహిత్యరంగ దిశగా అడుగులు వేశారు. ఆంగ్ల సాహిత్యంలో ఎమ్‌.ఎ. పూర్తిచేశారు. WAW: What A Woman, Take A BOW: A Hindu Book For All Religions, Giggles, TGIF జెంటిల్‌మెన్‌ ఇన్‌ ఫారంతో సహా ఐదు పుస్తకాలను రచించారు. ఈ క్రమంలోనే తెలుగు మీద పట్టు వచ్చేలా అక్షరాలు రాయడం, పదాలు, వ్యాఖ్యలు నేర్చుకున్నారు. అలా తెలుగు, ఇంగ్లీషు, తమిళ భాషల మీద ఆమె పట్టు సాధించారు.
సినిమా రంగంలో రాణించాలంటే సాహిత్యం ఒక్కటే సరిపోదనీ.. చరిత్ర, ఇతివృత్తాలు, పురాణాల పుస్తకాలు చదివారు. పిల్లల రైమ్స్‌, వీరోచితంగా పోరాడిన నాయకుల ఆత్మకథలు, మహిళల సమస్యలు, రకరకాల పుస్తకాలను అధ్యయనం చేశారు. ఆ అనుభవంతో కథలను రాసుకునేవారు. అయితే ఆమెను నమ్మి పరిశ్రమలో ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. అయినా ఆమె ప్రయత్నాలు ఆపలేదు. అయినా పట్టు వదలకుండా పరిశ్రమలోనే పనిచేశారు.

పురుషులతో సమానంగా..
‘తప్పు చేస్తే ఎవరో వచ్చి శిక్ష వేస్తారని, దెయ్యాలు పగ తీర్చుకుంటాయని.. ఇలా రకరకాల భ్రమలు, ఎన్నో మూఢ నమ్మకాలు సమాజంలో ఉన్నాయి. వాటి పట్ల ప్రజలు బాగా ప్రభావితులవుతారు. మూఢ నమ్మకాలు లేవని సినిమా ద్వారా చెప్పాను. చరిత్రలో దాగి ఉన్న కొత్త విషయాలను ప్రేక్షకులకు సందేశాన్ని ఇచ్చేలా చిత్రీకరించాను. ఈ చిత్రాన్ని కుటుంబమంతా కలిసి చూడొచ్చు. భయభ్రాంతులకు గురి చేసే ఘటనలు, హింసాత్మక సన్నివేశాలు గానీ లేవు. కొత్త విషయాలు తెలుస్తాయి.
ఇంతకీ ‘వళరి’ అంటే రాజులకాలం నాటి ఓ ఆయుధం. తమిళులు ఎక్కువగా వాడేవారు. బ్రిటిష్‌కాలంలో వీటి వాడకం నిషేధించారు. దాన్నే సినిమా పేరుగా పెట్టాను. తమిళ నటీనటులతో తెలుగులో మొట్టమొదటి సినిమా తీశాను. పురుషుడికి ఏమాత్రం తీసిపోరని, వారితో సమానంగా ఓ మహిళ పాత్రను తీర్చిదిద్దాను. ఆ పాత్రలో హీరోయిన్‌ రితికా సింగ్‌ ఒదిగిపోయి నటించారు. ఆమె కర్రసాము చేసిన దృశ్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సందేశాత్మక చిత్రం. ఇందులో ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలనూ చూపించలేదు. సినిమాలో హీరోహీరోయిన్లు ఎలాంటి నమ్మకాలు, ఆచారాలు లేని ఒక హేతువాద జంట. కొన్ని ఆసక్తికర అంశాలు ప్రేక్షకులకు ఎంతో థ్రిల్‌ను పంచుతాయి.’ అని తాను తీసిన సినిమా గురించి చెప్పుకొచ్చారు మ్రితిక సంతోషిణి.
సినిమాలు అంటే ఆసక్తి ఉన్న మ్రితికా కృషి, పట్టుదలే ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆమెలో ఉన్న నైపుణ్యాలే పెట్టుబడిగా పెట్టి, ఈ రంగంలో ముందుకెళుతున్నారు. ఆలస్యమైనా సంకల్పం గట్టిగా ఉంటే.. భవిష్యత్తులో ఎప్పటికైనా లక్ష్యం చేరుకుంటారని ఆమె రుజువు చేశారు. మ్రితికా ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుందాం.

క్రిష్‌తో..
పన్నెండేళ్ల క్రితం తమిళ ప్రైమ్‌టైమ్‌ ఛానెల్‌ కలైంజర్‌ టీవీలో నాలయ్య ఇయక్కునార్‌ (రేపటి చిత్రనిర్మాతలు) రియాల్టీ షో నిర్వహించారు. అందులో మ్రితిక పాల్గొన్నారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌, నలన్‌ కుమారస్వామి వంటి వారితో కలిసి ఔత్సాహిక చిత్ర నిర్మాతగా, దర్శకురాలిగా పోటీపడ్డారు. ఆ షోకు దర్శకుడు క్రిష్‌ న్యాయనిర్ణేతగా హాజరయ్యారు. ప్రోగ్రాంలో మ్రితిక ప్రతిభను గుర్తించి, ‘వానం’ (వేదం తమిళ డబ్బింగ్‌) సినిమాకి మహిళా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా క్రిష్‌ అవకాశం ఇచ్చారు. ‘ఆయనతో వర్క్‌ చేయడం దర్శక రంగంలో ఎంతో అనుభవం కలిగింది’ అని గుర్తు చేసుకున్నారు.

➡️