నిర్ణయాత్మక శక్తితోనే రాణింపు..

Mar 3,2024 09:38 #Sneha, #Women Stories, #Women's Day
Success with decisive power..

సర్వ సాధారణంగా ఈ ప్రపంచం మహిళను రెండవ తరగతి పౌరురాలిగానే చూస్తుంది. నాటి నుండి నేటి వరకు మహిళకు అన్నింటా అణచివేత, అడుగడుగునా అవమానాలు. ఈనాడు మహిళలు ఉన్న ఆ మాత్రం స్థాయికి రావటానికి వందల ఏళ్ళే పట్టింది. మొదటగా ఈ భూమి మీద ప్రజల సామాన్యమైన అవసరాలు తీర్చటంలో స్త్రీ పాత్ర కీలకం. వ్యవసాయం, బుట్టలు, బట్టలు, ఇళ్లు సైతం కనిపెట్టింది స్త్రీనే. కుటుంబానికి గుర్తింపుగా నిలబడింది. ఆ తర్వాత మాతృస్వామిక వ్యవస్థ ప్రారంభమైంది. ఆనాడూ కుటుంబవ్యవస్థలో స్త్రీనే కీలకమైంది. కానీ నిర్ణయాత్మకశక్తిగా, పాలకశక్తిగా ఆమెకు స్థానం లేదు.

కాలానుగుణంగా వ్యవసాయంలో అధునాతన పద్ధతులు వచ్చాయి. మహిళలు పునరుత్పత్తి కేంద్రంగా మారారు. ఉత్పత్తి పురుషుని చేతికి పోయింది. బహు భర్తృత్వం.. ఆ స్థానే ఒకే పురుషునితో జత కట్టే పద్ధతికి మహిళలు పరిమితమయ్యారు. క్రమంగా గృహ పెద్దగా వ్యవహరించిన పురుషుడు, పాలకస్థానం ఏర్పరచుకున్నాడు. పురుషాధిపత్య సమాజానికి నాంది పలికాడు. ఇకపోతే మనిషి సృష్టించిన అన్ని మత గ్రంథాలలోనూ పురుషుడు దేవుని ప్రతినిధి అని.. స్త్రీ ఆ పురుషుని ప్రతినిధి అని.. కావునా గృహ యజమాని అయిన పురుషుడు చెప్పినట్లే స్త్రీ నడుచుకోవాలని సూచించాయి. అదే ఈ నాటికీ కొనసాగుతోంది.

వందల ఏళ్ల కాలంలో స్త్రీల మనుగడ కోసం, నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం కోసం ఎనలేని కృషి చేశారు. నేటికీ ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది. ఆయా దేశాలలో మహిళలు పదిహేను దేశాలలో రాజ్యాధినేతలుగాను, పదహారు దేశాలలో ప్రభుత్వాధినేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ స్థితికి రావటానికి నాటి మహిళలకు విద్య, ఉద్యోగం, రాజకీయాలలో భాగస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. మరెన్నో మరణాలు సంభవించిన అనంతరం ఈ మాత్రం స్థాయిని చేరుకోగలిగారు. అయినా నేటికీ ప్రపంచ మహిళలు రాజకీయ భాగస్వామ్య ప్రజాప్రతినిధులుగా ఇరవై రెండు శాతాన్ని మించలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు.. సమాన స్థాయికి చేరుకోవటానికి ఇంకెంత కాలం పడుతుందో.

ఇకపోతే మనదేశం మనువాద ప్రభావిత దేశం. నేటికీి మహిళలపై కొనసాగుతున్న ఈ అణచివేతలు మన సంస్కృతిలో భాగమని, సాంప్రదాయమని భావిస్తున్నారు. అణచివేతల నుండి బయటపడేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎదిరించి, పోరాడిన వారిని బరితెగించారు అని నిందిస్తారు. గతకాలంతో పోల్చుకుంటే స్త్రీల స్థానం కొంత మెరుగుపడింది అనేది వాస్తవం. నాడు విద్య కోసం పోరాడారు. నేడు విద్యలో 2011 జనాభా లెక్కల ప్రకారం 65.46 శాతంగా ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే తక్కువే.

స్త్రీలు బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు చెంత బతకమని మనువు ఉపదేశం. దీనిని తు.చ. తప్పకుండా పాటించింది సమాజం. అంతేకాదు స్త్రీకి ఆలోచించే అవకాశం ఇవ్వకూడదని, ఇంటిల్లిపాదికీ సేవ చేయటమే పరమావధి తప్పితే.. మరో కర్తవ్యం ఉండకూడదని బోధించింది మనువాదం.

వందల ఏళ్ల తరువాత మాకూ రాజకీయ భాగస్వామ్యం కావాలని బ్రిటిష్‌ వారిని అడిగింది సరోజినినాయుడు బృందం. ఇప్పటికీ స్త్రీల రాజకీయ భాగస్వామ్యం నిర్ణయాత్మక అధికారం పదిహేను శాతం మించలేదు. 17వ లోక్‌సభలో 542 మంది ఎంపిలలో కేవలం 78 మంది మాత్రమే మహిళా సభ్యులున్నారు. వీరిలో కూడా స్వతంత్రంగా వ్యవహరించటానికి అవకాశమున్నవారు కొద్దిమంది మాత్రమే.

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం మహిళలు దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. అయితే 2029 ఎన్నికల నుండి అమలు అని నిర్ణయం తీసుకోవటం వెనుక ఆంతర్యం అర్థమయ్యే ఉంటుంది. మహిళలకు ఇచ్చే, వచ్చే అవకాశాల అమలుకు ఎందుకంత ఆలస్యం..! మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగనీయకుండా ఉండేందుకే కదా! పాలకవర్గం కుతంత్రాలు ఆ మాత్రం మనకు అర్థం కావా!

ఇదిలా ఉండగా 73, 74వ రాజ్యాంగ సవరణల ఆధారంగా మహిళలకు స్థానికసంస్థల్లో, రాజకీయాలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అది నేటికీ 50 శాతమే ఉంది. పరిపాలన, పదవి మాత్రం పురుషుని చేతిలోనే కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మహిళా సమావేశాల చర్చల అనంతరం ఐక్యరాజ్య సమితి ఒత్తిడి మేరకు వివిధ సంస్థలు మహిళలకు నిర్ణయాధికార స్థానాలు కేటాయించారు. స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు.. ఎదుగుతున్నారు. అవసరమైతే ఎదురు తిరుగుతున్నారు.. నిలదీస్తున్నారు.. ప్రశ్నిస్తున్నారు. స్త్రీలకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Success with decisive power..

– డా. ప్రియాంక గంగరాపు, ఫ్యాకల్టీ ఇన్‌ పొలిటికల్‌ సైన్స్‌, ఇండియన్‌ సొసైటీ, 83745 37181

➡️