వేసవి ఆనందాలు

May 12,2024 11:19 #Sneha

ఈ ఎండ వేడిలతో వచ్చే ఉక్క సరిపోనట్టు వాటితోపాటు ఉచితంగా వచ్చే ఈ చిరాకులు. ఎన్నున్నా లేనివి వెతుక్కుని మరీ లోట్లుగా భావించి బాధపడనిదే, రోజు గడవదు కదా! అలా అనుకున్న లోట్లన్నీ తీరిపోగా, మళ్లీ కొత్తవి వెతుక్కుని మరీ బాధపడాలి. అలా అన్ని లోట్లలో నుండి ఈ మధ్య దొరికినది, కాలుకి అయిన చిన్న గాయం, దానికి వేసిన పెద్ద సిమెంట్‌ కట్టు. నాకు మామూలుగానే వేసవి కాలం నచ్చదు. అందులో ఇదొకటి అనుకుంటూ, అప్పుడే అమ్మ చేసి, చేతికిచ్చిన ఈవినింగ్‌ స్నాక్‌ తినేసి, చల్లటి ఏ.సీ రూంలో కూర్చుని మరీ దిగులుపడుతోంది పింకీ.
అంతలో, ఒక చిన్ని హమ్మింగ్‌ బర్డ్‌ ఎలానో తన గదిలోకి వచ్చేసింది. అటు ఎగిరి ఇటు ఎగిరి, ఎటు వెళ్ళాలో తెలీక ఒక్క నిమిషంలో బోలెడంత హడావిడి చేసేసింది. దాన్ని చూస్తూ దానికోసం వాలేందుకై వేలు చాచింది పింకీ. అలసి ఓపిక అయిపోయిన బుల్లి పిట్ట, గాలిలో ఓ రెండు నిమిషాలు ఊగిసలాడి తన వేలుపై వాలింది. తను నీళ్ళు తాగుతూ, ఎండలో వచ్చిందని, పింకీ తన బాటిల్‌ మూతలో కొన్ని నీళ్ళు పోసి పెడితే, దాని బుజ్జి మూతితో రెండు చుక్కలు తాగేసింది.
తరువాత, ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ‘ఓరు ఏంటలా చూస్తున్నావ్‌’ అని ఓ శబ్ధం వినపడింది. నేను నోరిప్పలేదు, మరెవరు మాట్లాడారు అనుకుంది పింకీ. నా కాలుని నలిపేస్తున్నావ్‌, ఓరు, అని మళ్లీ అరుపు. పింకీ ఒక్కసారి ఉలిక్కిపడి పిట్టను వదిలేసింది. అది ఎదురుగా ఉన్న పింకీ స్టడీ టేబుల్‌ మీద వాలింది. ‘ఓరు పక్షి పిల్ల, నువ్వేనా ఏంటి ఆ పలుకు?’ అని సరదాగా అడిగింది పింకీ, పిట్ట వైపు చూస్తూ. ‘మరి నేను కాకపోతే ఇంకెవరు?’ అంటూ సూటిగా పింకీ కళ్ళలోకి చూసింది బుజ్జి పిట్ట. పింకీ ఒక్కసారిగా ఏం జరుగుతోందో నమ్మలేకపోయింది. కల అయితే కాదుగా అని సందేహంగా చూస్తూ ఉంది.
‘దేనికో చింతిస్తున్నావు కదా, ఏమిటా అని కనుక్కోమని పంపారు నన్ను’ అందా పిట్ట. ‘ఎవరు పంపారు ఎందుకు పంపారు?’ అనడిగింది పింకీ.
‘నీ బాధేంటో చెప్పు ముందు, ఆ వివరాలన్నీ తరువాత చెప్తాను. నీకెన్ని బాధలున్నాయో నాకు తెలీదుగాని, నన్ను పంపిన ఒకామె నీతో ఇది చెప్పమందిలా..
”నా మాట నమ్ము, నేను 50 ఏళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూస్తే, నువ్వు ఏదో లేదనుకుని, దిగులుగా గడిపేస్తున్న నీ ఈ రోజుల్లో, నాకు మాత్రం నీ సొంతమైన, ఎండ వెలుగులోని తళుకుకున్నంత అందం,
వేసవిలో దొరికే పాత జ్ఞాపకాలంత అమూల్యం, వేసవికాలం హఠాత్తు వర్షపు జల్లు తెచ్చే హాయి, మామిడి చెట్టులో ఉన్నంత నిస్వార్థం, బుల్లి మొక్కపిల్లకు నీళ్ళు పోస్తే, అది నవ్వితే దానిలో ఉన్నంత స్వచ్ఛదనం, ఎండలో చల్ల చల్లని పుల్లైసు ఇచ్చే తృప్తి, రాత్రులు మెడపై పడుకుని చెప్పుకున్న కబుర్లలో ఉన్నంత ఉల్లాసం, అప్పుడే తీసిచ్చిన చెరుకురసంలో ఉన్నంత తాజా యవ్వనం, వేసవి సాయంత్రం వచ్చిన మొదటి వర్షపు చుక్క పుట్టించే మట్టిలో ఉన్న సువాసనంత వెలకట్టలేని నువ్వు, కనిపించాయి.
నీ ఈ అందమైన జీవితంలో ఒక్క క్షణం కాదు కదా, అందులో వందో, వెయ్యో, లక్షో ఏ వొంతూ నువ్వు నిరాశగా ఉండడానికి వీల్లేదు. నువ్వెలా ఉన్నావో.. అలాగే సరిగ్గానే ఉన్నావు. ఇంకెప్పుడూ ఇంతకన్నా అందంగా, ఆనందంగా ఉండలేవు.So oh dear, appreciate the summers while they last, as when seen from afar they are just the shiny days full of brightness, lightnings, and rainbows. Dont forget to embrace and identify the beautiful things you have been travelling with, all along. I have done the job of delivering the message from your future-self, now is your part live to the full of fullest!”
యాభై ఏళ్ళ పింకీ, నీ ఈ ఇరవై ఏళ్ళ బుల్లి పింకీనీ చూసి ఎంతో మురిసిపోతూ నాతో పంపిన ఈ సందేశం చేర్చేసా!
ఇక జీవితంలో ఉన్న ఆందాల్ని వెతుక్కుని, లేని ఆనందాల్ని తయారు చేసుకుంటూ, ఎండల్లో కూడా తరచుగా దొరికే అందమైన నీడా హాయిల్ని పట్టుకుని ఆస్వాదించడం, నీ వంతు.’ అని చెప్పి, వెళ్ళేముందు సరదాగా బాటిల్‌ మూతలోని నీళ్ళు గబుక్కున తీసి, పింకీపై చల్లేసి నవ్వించేసి, వచ్చిన దారిన వెళ్లిపోయింది, ఆ బుజ్జి పిట్ట..

– సాయి మల్లిక పులగుర్త

mallika.quill@gmail.com

➡️