దొంగ దొరికింది!

Apr 28,2024 08:25 #chirumuvallu, #Sneha

ఎలుగుబంటి చెట్టుకింద కూర్చుని సూర్యుని వైపు చూస్తూ అలానే ఉండిపోయింది. అటుగా పోతున్న నక్క, తోడేలు ఆగి ‘ఎలుగుమామా! అలా ఎండలో కూర్చున్నావు. ఏమిటి సంగతి?’ అని అడిగాయి.
ఎలుగుబంటి ఊ అనలేదు, ఆ అనలేదు.
‘తపస్సు చేస్తున్నావా?’ అడిగింది తోడేలు.
అవునని తలూపింది ఎలుగుబంటి.
‘దేనికోసం ఈ తపస్సు?’ అడిగింది నక్క.
మాట్లాడలేదు కాని అక్కడ నుండి వెళ్ళిపొమ్మని సైగ చేసింది ఎలుగుబంటి.
‘మంచిపనిలో ఉన్నవారిని ఇబ్బందిపెట్టడం మంచివాళ్ళ లక్షణం కాదని మా అమ్మ చెప్పింది’ అంది నక్క.
‘నిజమే, మంచి విషయాలు అందరికీ తెలియజేస్తే మంచిదని మా అమ్మ కూడా చెప్పింది. ఈ విషయం మృగరాజుకి చెబితే చాలా సంతోషిస్తుంది. ఎలుగుమామ తపోబలం అడవికి ఉపయోగించమని కోరుతుంది. అందరూ బాగుంటే, అందులో మనమూ బాగుంటాము’ అంది తోడేలు.
నక్క, తోడేలు మృగరాజు దగ్గరకు వెళ్ళాయి. అప్పటికే గుహ వద్ద కోతి ఫిర్యాదుపై విచారణ జరుపుతుంది మృగరాజు.
‘నువ్వు తొర్రలో దాచుకుంటున్న పళ్ళు మాయమౌతున్నాయంటున్నావు. నీకు ఎవరిమీదన్నా అనుమానం ఉందా?’ అంది మృగరాజు కోతితో.
‘తెలియకుండా ఎవరిమీదా ఆరోపణ చేయలేను’ సమాధానం ఇచ్చింది కోతి.
‘మృగరాజా! ఫిర్యాదు సారాంశం విన్నాము. మన ఎలుగుబంటి మామ తపస్సుకు కూర్చున్నాడు. తపోశక్తుల వలన భూతవర్తమాన కాలాలను తెలుసుకొనే శక్తి వస్తుందని మా అమ్మమ్మ చెప్పింది. ఎలుగుబంటి మామ దగ్గరకు వెళ్తే నిజాలన్నీ బయటపడతాయి’ చెప్పింది నక్క.
ఎలుగు మామ తపస్సా? ఆశ్చర్యపోతూ అడిగింది సింహం. ఇప్పుడు మేము చూసి వస్తున్నాం నమ్మకంగా చెప్పాయి నక్క, తోడేలు. మృగరాజుకు నమ్మకం కుదిరి సరే నంది.
‘మృగరాజా! మంత్రాలకు చింతకాయలు రాలవని మీకు తెలియంది కాదు. శాస్త్రీయ విధానం మాత్రమే నిజాలను నిర్ధారణ చేస్తుంది. ఎలుగుబంటి తపోశక్తిని నేను నమ్మలేను’ చెప్పింది కోతి.
‘ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు, తపోధనుల దివ్యదృష్టిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎలుగుబంటిని కలిసి దొంగ ఎవరో కనిపెడదాం పదండి’ అంది మృగరాజు.
ఎండవైపు చూస్తూ కూర్చున్న ఎలుగుబంటిని ‘ఎలుగు మిత్రమా! అభినందనలు’ అంటూ పలకరించింది మృగరాజు.
ఎలుగుబంటి మృగరాజును భయంగా చూసింది కానీ మాట్లాడలేదు.
‘ఎలుగు మామా, మృగరాజుకి నీతో పనిపడింది. కోతిబావ తొర్రలో దాచుకున్న పళ్ళు ఎవరో దొంగలిస్తున్నారట. అది తెలుసుకోడానికి వచ్చింది. ఆ విషయం నీ దివ్యదృష్టితో తెలియజేయి’ అడిగింది నక్క.
ఎలుగుబంటి సైగలు చేస్తుంది తప్ప నోరు విప్పడం లేదు. అక్కడున్న జంతువులకు అర్థం కాలేదు.
‘మృగరాజా! దొంగ దొరికింది’ అంది కోతి.
‘దొరికిందా.. ఎవరు?’ ఆశ్చర్యపోతూ అడిగింది సింహం.
‘ఈ ఎలుగుమామే’ అంది కోతి.
‘తపశ్శాలిని అనుమానించడం తగదు’ అని కోతిని వారించింది సింహం.
‘ఈ మధ్యకాలంలో నేను తెచ్చి దాచుకుంటున్న పళ్ళు, కేరట్‌, బీట్రూట్‌ దుంపలతోపాటు తుమ్మ చెట్టున ఉన్న జిగురు ఉండలను తొర్రలో ఉంచాను. అలవాటు కొద్దీ పళ్ళతో పాటు జిగురు ఉండలను కూడా తిని ఉంటుంది. దంతాలు అతుక్కుపోయి ఉంటాయి. కావలిస్తే ఓసారి చూడండి’ అంది కోతి.
నక్క, తోడేలు ఎలుగు నోటిని పరీక్షించాయి.
‘కోతి చెప్పిన మాట నిజమే. నోటి లోపల జిగురు. కరిగించుకోడానికే ఎలుగు ఎండలో ఉన్న సత్యం ఇప్పుడు రుజువైంది’ అంది నక్క.
మృగరాజు అదిచూసి గర్జించింది. ఎలుగు తప్పు ఒప్పుకొని కోతిని క్షమించమని కోరింది.
‘దొంగతనం అనేది ఏదోఒక సమయంలో బయటపడుతుంది. ఇకనైనా బుద్ధిగా మసలుకో ఎలుగుమామా’ అంటూ కోతి హితవు పలికింది.

బి.వి.పట్నాయక్‌.
8309872913

➡️