రేపటి సూరీడు

Apr 21,2024 11:37 #Sneha, #storys

‘గాలికి కదులుతున్న ధాన్యపు కంకుల సవ్వడి వింటుంటే అది నా గుండె చప్పుడులా అనిపిస్తుంది. ఈ పొలంలో ఆ సవ్వడి వినబడనినాడు నా గుండె కూడా ఆగిపోతుంది’ అనుకున్నాడు శరభయ్య.

సూరీడు నల్లని మబ్బులను చీల్చుకుని లేలేత కిరణాలతో జగతి వైపు దృష్టిని సారించినప్పుడు పొలం గట్టు మీదకు వచ్చి కూర్చున్నాడు శరభయ్య. మండుతున్న అగ్నిగోళంలా ప్రకాశవంతమైన కిరణాలతో వొంటిని చురుక్కుమనిపిస్తున్నా అతడు పట్టించుకోకుండా తదేకంగా వరి చేలవైపు చూస్తున్నాడు.

‘ఏమయ్యా! ఇక్కడున్నావా? నీ కోసం ఎక్కడని వెతకను? పొద్దు పొడవక ముందే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయావు. కాసిన్ని టీ నీళ్లు కూడా తాగపోతివి. అన్నం తినే వేళయ్యింది.. ఇంకా రావు! ఊరంతా ఎతుక్కుంటా వొచ్చా… ఇదుగో మావా వినబడుతుందా?’ అతని భుజాలు కుదుపుతూ అన్నది మల్లి.

‘ఆ… వినబడింది లేవే! నువ్వెందుకు వచ్చావు ఇక్కడకు? కాసేపాగి నేనే వస్తా కదా?’ నీరసంగా అన్నాడు శరభయ్య.

‘ఎప్పుడొస్తావు మావా? ఇప్పుడు సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. ఇలా తిండీ తిప్పలూ మానేస్తే నీ ఆరోగ్యం ఏం కానూ? పిల్లలు కూడా నీ వాలకం చూసి బిక్కు బిక్కుమంటున్నారు. నువ్వు దిగాలు పడి ప్రాణం మీదకు తెచ్చుకుంటే ఎట్లా మావా?’ జీరవోయిన స్వరంతో అన్నది మల్లి.

‘నాకు దిగులు కాకపోతే ఇంకా ఏమి మిగిలిందే? మడి నిండా పండాల్సిన పంట ఎలితిగా అక్కడోటి అక్కడోటి మొలిచింది. అట్లా చూస్తుంటే నా కళ్ళకు నేల తల్లి చిరుగుల చీర కట్టుకున్నట్లు కనిపిస్తుంది.. నా గుండెకు చిల్లులు పడ్డట్లనిపిస్తుంది. బోరు బోరున ఏడవాలనిపిస్తుందే మల్లి!’ గొంతంతా ద్ణుఖం తన్నుకొస్తుంటే జీరబోయింది.

‘మావా! ఏడవమాకు.. ఊరుకో మావా!’ తను కూడా ఏడుస్తూ సముదాయింపుగా అన్నది మల్లి.

‘మల్లి! రూపాయి ఎక్కువైనా దిగుబడి బాగా వస్తుందన్న ఆశతో పట్నం వెళ్ళి విత్తనాలు కొనుక్కొచ్చాను. వాళ్ళు కూడా మోసం చేసి కల్తీ విత్తనాలు, నాసిరకానివి అమ్మారు. సగానికి సగం దిగుబడి తగ్గిపోయింది. కొన్న విత్తనాలు అప్పు చేసి కొన్నవే, పంట ఎరువులు అప్పు జేసి కొన్నవే.. ఇప్పుడు ఈ పంట అమ్మితే నాకు వచ్చే డబ్బులతో అసలు తీర్చడం మాటటుంచి వడ్డీలు కూడా కట్టలేను’… వెక్కుతూ ఆగాడు శరభయ్య.

‘ఏదో దారి ఆ భగమంతుడే చూపిస్తాడు లే మావా’ అంది మల్లి.

‘మన పొట్ట నిండే దారి కూడా కనబడటం లేదు. పిల్లలిద్దరూ డబ్బుల ఖర్చు లేకుండా ఆళ్ళ తెలివితేటలతోనే ఆళ్లు చదువుకుంటున్నారు. కనీసం తినడానికి తిండయినా పెట్టాలి కదా!’ వెక్కుతూ అన్నాడు శరభయ్య.

‘నేల తల్లికి మనకు ఉన్న సంబంధం తల్లీబిడ్డల సంబంధం. ఆ తల్లికి మన మీద కనికరం రావడం లేదు. ఇట్టా ఏడుస్తూ కూకుంటే పంట పెరిగిపోతుందా మావా? నువ్వే అట్టా దిగులు పెట్టుకుంటే నిన్ను నమ్ముకున్న నేనేం కావాలి? పిల్లలేం కావాలి?’ అన్నది మల్లి.

‘పోయిన ఏడాది సార్వాలో మిరప పంట మన రాష్ట్రం మొత్తంలో మన గుంటూరు జిల్లాలోనే ఎక్కువ పంట పండింది. మన పంట మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాను. పిల్ల పెళ్లి చేయడానికి డబ్బు నిలువ చేయాలని కలలు కన్నాను. కానీ అప్పుడు కూడా ఎడతెగని వర్షాల వల్ల నల్ల తామర, వైరస్‌ తెగుళ్లు వచ్చాయి. దిగుబడులు దారుణంగా పడిపోయాయి. ఎకరానికి ఏడెనిమిది క్వింటాళ్లు కూడా రాలేదు. భారీగా నష్టం వచ్చింది. ప్రభుత్వం బీమా పరిహారం ఇస్తుందన్నారు. కానీ పైసా కూడా రాలేదు. నెత్తీ నోరూ కొట్టుకొని, ఉన్నవి అమ్ముకున్నాం. తినో తినకో రోజులు ఎళ్ళదీశాం. మారు పంట పత్తి సాగు చేస్తేనన్నా లాభం కళ్ళజూస్తామని రెక్కలు ముక్కలు చేసుకున్నాను. ఎకరానికి పది క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని ఆశిస్తే ఒకటి, రెండు క్వింటాళ్లకే పరిమితమయింది.’ తన బాధనంతా వెళ్లగక్కాడు.
‘అప్పుడూ నకిలీ, నాసిరకం విత్తనాలే దెబ్బతీశాయి కదా మావ!’ అంది మల్లి.

‘పోనీ చేతికొచ్చిన పంటకైనా గిట్టుబాటు ధరైనా దక్కిందా అంటే.. అదీ లేదు. క్వింటాలుకు ఆరేడు వేలకు మించి ధర పలుకలేదు. విత్తనాల కారణంగా నష్టపోయామని మనలాంటి రైతులు రోడ్లెక్కి సమ్మె చేస్తే న్యాయం జరగలేదు. వాతావరణం కారణంగానే దిగుబడి రాలేదు, విత్తనాల శుద్ధిలో తేడా లేదని పెద్ద పెద్దోళ్ళు సెలవిచ్చారు. ఇక ఈ ఏడాది కూడా బీమా పరిహారం దక్కుతుందా? ఏమో! అదీ నమ్మకం లేదు.’ అన్నాడు శరభయ్య.

‘రైతు గొప్పవాడయ్యాడని చరిత్రలో ఎక్కడైనా ఉందా మావా? రాజు కొడుకు రాజవ్వాలనుకుంటాడు. డాక్టర్‌ కొడుకు డాక్టరవ్వాలనుకుంటాడు కానీ ఒక రైతు కొడుకు మళ్ళీ రైతు కావాలనుకోడు. తండ్రి పడుతున్న బాధలు చూసి బెదురుతాడు. మన బిడ్డ కూడా మనలాగా కాకుండా చదువుకుని, ఉద్యోగస్తుడయితే నెలకిన్ని జీతం రాళ్ళు వొస్తాయి. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండయినా దొరుకుతుంది. ఇక్కడ కూర్చుని నువ్వెంత బాధపడ్డా ఇంతే మావా! పద ఇంటికి పోదాం’ అని ఓదార్పుగా శరభయ్య చెయ్యి పట్టుకొని లేపింది మల్లి.

‘విజయ్  ఇంజినీరింగ్‌ పూర్తయి పోవచ్చింది. జానకి ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతోంది. సర్కార్‌ బళ్ళో చదివినా మార్కులను బట్టి ప్రవేటు కాలేజీల్లో ఉచితంగా జాయిన్‌ చేసుకున్నారు. తండ్రి కష్టం తెలిసిన పిల్లలు కాబట్టి ఉన్నదాంట్లోనే సర్దుకుని, చదువుకుంటు న్నారు. మన కష్టాలు ఎంతోకాలం ఉండవులే మావా’ అంది.
శరభయ్య ఓ పెద్ద నిట్టూర్పు విడిచాడు. పంట నూర్పులు అయ్యాయి. నూర్చిన వడ్లు కల్లంలో పోసి, పరదాలు కప్పారు. కాపలాగా శరభయ్య అక్కడే పడుకున్నాడు. తోటి రైతులందరూ అదే విధంగా కల్లంలో ప్రకృతికి కోపం రాకూడదని దండం పెట్టుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. కానీ వారి మొర ఆలకించని మేఘాలు నల్లగా కమ్ముకు వచ్చాయి.

అందరూ లబ లబలాడుతున్న గుండెలతో పరదాల మీద మళ్ళీ పరదాలు కప్పారు. చిన్నగా మొదలయిన వాన కుంభవృష్టిగా మారింది. సన్నకారు రైతుల కన్నీరు కూడా ఆ వానలో కలిసిపోయి వరదగా మారింది.

శరభయ్య మనసులోని కడపటి ఆశ కూడా పూర్తిగా పోయింది. అప్పు కళ్ళముందు భూతంలాగా భయపెట్టింది. ఐదు రోజులు ఆగకుండా పడిన వానకి ధాన్యానికి మొక్కలు వచ్చేస్తాయని అతడికి తెలుసు. వార్తల్లో ప్రభుత్వం వారు పంట నష్టపరిహారం ఇస్తామని, పంటంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ జరిగేవి కాదని శరభయ్యకు తెలుసు. గాలిలో దీపం వెలిగించి పెట్టినట్లేనని కూడా తెలుసు. అతడి కళ్ళ ముందు భార్యాపిల్లలు దీనమైన ముఖాలతో కనిపిస్తున్నారు. వారికి తను ఉండగా న్యాయం చేయలేడు. కనీసం తను చచ్చిపోతేనైనా ప్రభుత్వం నుండి తన కుటుంబానికి ఎంతో కొంత డబ్బు వస్తుంది.. అవును తను చచ్చిపోయైనా కుటుంబానికి ఆసరా కావాలి.. అంతే! గట్టిగా నిర్ణయించుకున్నాడు.

గదిలో పడుకున్న భార్యాపిల్లలను కన్నీళ్ళతో ఒకసారి ఆపేక్షగా చూశాడు. తరువాత తలుపు చేరేసి, అటక మీద ఉన్న పురుగుల మందు తీసుకొని పెరట్లోకి వెళ్ళాడు. డబ్బా మూత తీసి కళ్ళు మూసుకుని, ఒకసారి దేవుడిని తలచుకున్నాడు. నోటిలో పోసుకోవడానికి డబ్బా పైకి ఎత్తగానే చేతిలో డబ్బా ఎగిరిపడింది. గబుక్కున కళ్ళు తెరిచి చూసాడు శరభయ్య.

‘విజయ్… నువ్వా?’ అన్నాడు శరభయ్య.

‘నాన్నా! ఏంటి మీరు చేస్తున్న పని? మమ్మల్ని అనాథలను చేసి వెళ్ళిపోతారా? చావు దేనికీ పరిష్కారం కాదు నాన్నా? ఎంతటి కోటీశ్వరుడికైనా అన్నదాత రైతే. అలాంటిది మనం పిరికిగా తప్పుకుంటే అన్నదాత అనరు.. ఆనవాలు లేకుండా పోయేవాడు అంటారు. మీ బాధ్యత నేను తీసుకుంటాను. మీ అనుభవం నేర్పిన పాఠాలతో నేను వ్యవసాయం చేస్తాను’ అన్నాడు విజయ్  ధీమాగా.

ఈ అలికిడికి లేచిన మల్లి, జానకి జరిగింది విని, బావురుమన్నారు.
—-
ప్రభుత్వం సహకార కేంద్రంలో రైతులకు నష్టపరిహారం కింద కొంత డబ్బు ఇచ్చి, చేతులు దులుపుకొంది. విజయ్  చదువు పూర్తికాగానే ఊళ్ళోని విదేశాల్లో స్థిరపడిన మిత్రుల దగ్గర ఇరవై ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు. కూలీ పని, రైతు పని కూడా తానే చేస్తున్నాడు. అరఎకరంకైనా అదే తిరగడం, అరవై ఎకరాలకైన అదే తిరగడం అని గ్రహించాడు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంటలో లాభం రావడంతో స్వంతంగా ఐదు ఎకరాల భూమి తండ్రి పేరు మీద కొన్నాడు.
—-
‘ఒక ఉద్యోగస్తుడు నెలకు లక్ష సంపాదించినా, కొన్ని వేలు సంపాదించినా ఆ సంపాదన అతడి కుటుంబానికే పరిమితం అవుతుంది. కానీ ఒక రైతు ఏడాది మొత్తం సంపాదించినా లక్ష కూడబెట్టడం కష్టం. కానీ అతడు పండించిన ధాన్యం కొన్ని వేల మంది ప్రజలు తింటారు. అన్నం పెట్టే రైతన్నకు కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండదనే చేదు నిజం మనం ఒప్పుకోక తప్పదు. అతడి లక్ష్యం ఆకలి తీర్చడమే! నేల సాగు చేసి విత్తనం నాటి అది పెరిగి, పంట చేతికి వచ్చేదాకా రైతుకి దినదిన గండమే! ఎప్పుడు ప్రకృతి విలయతాండవం చేస్తుందోనని కాపలా కాస్తూ ఉంటాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సగర్వంగా ఇంజినీరింగ్‌ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విజయ్  ఏ సాఫ్టువేర్‌ ఉద్యోగానికో పోకుండా తండ్రికి సహాయం చేస్తూ వ్యవసాయ రంగంలో ఆధునీకరణ చూపిస్తూ, సాంకేతికతను అందిపుచ్చుకున్నాడు. మంచి ఫలితాలను పొందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. ఇది కర్షకులందరికీ గర్వకారణం. యువ రైతు విజరుకి హృదయ పూర్వకమైన అభినందనలు. అన్నదాత సుఖీభవ అని వేనోళ్ళ కొనియాడుతూ మరోసారి రైతన్నలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను’ ఉపన్యాసం ముగించారు వ్యవసాయ శాఖ మంత్రి గారు.
స్టేజీ ఎదురుగా కూర్చున్న గ్రామ ప్రజలందరూ చప్పట్లతో జయ జయ ధ్వానాలు చేశారు.

‘ఇప్పుడు విజయ్‌కి  మన మంత్రి గారి చేతుల మీదుగా ”ఉత్తమ రైతు” అవార్డు బహుమతి ప్రధానం జరుగుతుంది’ అన్నాడు గ్రామ సర్పంచ్‌.

స్టేజీ మీద ఉన్న కుర్చీల్లో కూర్చుని ఉన్న విజయ్  లేచి మైక్‌ దగ్గరకు వచ్చాడు. ‘సభా ప్రాంగణంలో కూర్చుని ఉన్న నా గ్రామ ప్రజలకు, సభకు విచ్చేసిన మన మంత్రిగారికి నమస్కారాలు! నేను వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టడానికి కారణం మా నాన్న శరభయ్య. ఇది ఆయన కలలు కన్న విజయం. నేను ఆయన కన్నా గొప్పవాడిని కాను. ఆయన అనుభవం నేర్పిన పాఠాలు, నా మొండితనం పట్టుదల వల్ల ఈ రోజు మీ ముందు నిలబడ్డాను. రైతు అంటేనే నాగలి పట్టుకొని పోరాటానికి సిద్ధపడేవాడు. అలాంటి యుద్ధంలో అన్ని సార్లు విజయం లభించదు. అందుకు కుంగిపోకుండా మళ్ళీ ప్రయత్నం చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధ్దతులు తెలుసుకోవాలి. ఆర్థికపరమైన అండ లేని నాడు రైతు పంట పురుగుల కోసం తెచ్చిన మందు తానే తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. అండగా నిలవాలి. నా ఈ విజయం మా నాన్న విజయం కాబట్టి ఈ అవార్డ్‌ మా నాన్నకి ఇవ్వవలసినదిగా మనవి చేస్తున్నాను’ వినయంగా అన్నాడు విజయ్ . మళ్ళీ ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మారు మోగింది.

‘ఇంత మంచి కొడుకును కన్న గొప్ప తండ్రి శరభయ్యని వేదిక మీదకు రావలసినదిగా కోరుతున్నాం’ అన్నాడు గ్రామ సర్పంచ్‌.

ఆ మాటలకు శరభయ్యకు ఆనందంతో కళ్ళు చెమర్చాయి.

‘మావా! ఎల్లు మావా! నిన్నే పిలుస్తున్నారు.’ ఆనంద బాష్పాలతో చూపు మసకబారుతుండగా చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అన్నది మల్లి.

భుజం మీద వేసుకున్న తువ్వాలు అంచుతో కళ్ళు తుడుచుకుంటూ లేచి స్టేజీ వైపుకు నడిచాడు శరభయ్య.

‘రావయ్యా శరభయ్యా! నీకు నిజమైన పుత్రోత్సాహము ఇదే.. అన్నదాతగా ఎంతోమందికి అన్నం పెట్టే కొడుకును కన్నావు. నీ జన్మ ధన్యమయింది’ నవ్వుతూ అన్నాడు మంత్రి గారు. ఆ మాటలకు చేతులెత్తి దండం పెట్టాడు శరభయ్య. ఆ తరువాత మంత్రి గారి చేతుల మీదుగా ”ఉత్తమ రైతు” అవార్డును శరభయ్య అందుకున్నాడు.
అది చూసి మల్లి కళ్ళల్లో మతాబుల వెలుగులు విరజిమ్మాయి. విజయ్ ముఖంలో తను అనుకున్నది సాధించిన తృప్తి కనిపిస్తోంది. శరభయ్య కళ్ళకు పుడమి తల్లి సస్యశ్యామలంగా నవ్వుతూ కనిపించింది.

– కె.వి. సుమలత
9492656255

➡️