ట్రోలింగ్‌… ఓ మూకదాడి!

  • వర్తమానంలో బాగా చర్చకి వస్తున్న అంశం ట్రోలింగ్‌. ఇది ఎంత విస్తృతంగా వ్యాపించి ఉన్నా దాని గురించిన అవగాహన మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. 1992 నాటికి ట్రోల్‌ పదం వాడుకలోకి వచ్చినా దీనికి మూలాలు మానవ స్వభావంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. సామాజిక మాధ్యమాల వినియోగం మొదలయ్యాక ఇదొక సాంకేతిక పదంగా స్థిరపడింది. వినోదం, వ్యాపార ప్రయోజనాలు, భిన్నాభిప్రాయాన్ని వ్యతిరేకించడం వంటివాటి కోసం ఏర్పడిన ‘ట్రోలింగ్‌’ ఇపుడు అదుపు తప్పి తిట్లు, బెదిరింపులు, దాడులు, అభిప్రాయాల నిర్మూలన రూపంలోకి మారింది.

భద్రజీవులు, సామాజిక జీవితం పెద్దగా లేనివారు అనుకునేట్లు ‘ట్రోలింగ్‌’ చిన్న విషయం కాదు. ప్రజాభిప్రాయాన్ని విస్తృతస్థాయిలో ప్రభావితం చేయగల అతి పెద్ద వనరు ‘ట్రోలింగ్‌’. అందుకే ఈనాడు ప్రతి రాజకీయపార్టీకి, మతతత్వ శక్తులకు, అప్రజాస్వామికంగానైనా తమ భావాలే నెగ్గించుకునే వ్యవస్థలకి ‘పెయిడ్‌ ట్రోల్‌’ పద్ధతి అంది వచ్చింది. సైకోపాథలాజికల్‌ శాడిజం, డార్క్‌ టెట్రాడ్‌ వంటి మానసిక సమస్యలు ఉన్నవారే ట్రోలర్లుగా ఉంటారనే వాదనని పూర్వపక్షం చేస్తూ, బాగా చదువుకున్నవారు, తెలివితేటలు ఉన్నవారు కూడా, చీకటి మొహాలతో పెయిడ్‌ ట్రోలర్లుగా మారి, ఆదాయాన్ని పొందుతున్నారు. భౌతికదాడుల వంటివి తక్కువ కనుక ట్రోలింగ్‌ అపాయకరం కాదనే వాళ్ళున్నారు. కానీ గౌరీ లంకేష్‌ని చంపడం, బైరి నరేష్‌ మీద జరుగుతున్న భౌతికదాడులకి ట్రోలింగ్‌ ప్రభావవంతమైన కారణంగా ఉంది.

ట్రోలింగ్‌కి ఎవరూ అతీతం కాకున్నా స్త్రీల మీద జరిగే ట్రోలింగ్‌ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. తమ అభిప్రాయాలను, భావాలను స్వేచ్ఛగా వెల్లడించుకోడానికి ఇన్నాళ్ళకి స్త్రీలకి స్పేస్‌ దొరికింది. సంకోచాలను, బిడియాలను, సంకెళ్లను విదిలించుకుని రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. సహజంగానే ఈ మార్పు పితృస్వామ్య సమాజానికి గిట్టదు.. కనుక వారి మీద నిర్బంధాన్ని ట్రోలింగ్‌ రూపంలో చూపిస్తుంది. స్త్రీలను అదుపు చేయాలంటే వారి లైంగికత మీద దాడి చేయడం సాధనంగా మారింది. స్త్రీలు ఆధునికంగా ఏమి చేసినా ప్రతికూలత వస్తూనే ఉంటుంది. బూతులు తిట్టడం, వ్యభిచారి అనడం, రేప్‌ చేస్తామని బెదిరించడం, ఏవిధంగా వారితో లైంగిక కార్యం చేస్తారో చెప్పడం, హింసాత్మక లైంగిక కార్యాన్ని చేస్తామని బెదిరించడం వంటి వేధింపులు ఎన్నెన్నో. అసభ్యత, అశ్లీలత ఎంత చివరివరకూ వెళ్లవచ్చో ట్రోలింగ్‌లో చూస్తాము.

అనామకంగా ఉంటూ ట్రోల్‌ చేయడం ఒక రకం అయితే, తమకి గిట్టని అభిప్రాయం, భావజాలం ఉన్నవారిని అవమానపరచడం, అసహ్యించుకోవడం, వెలివేతకి పిలుపునివ్వడం, వెక్కిరింతలు, వెటకారాలతో అగౌరవపరచడం సర్వ సాధారణంగా మారిపోయాయి. చర్చించడం, గౌరవంగా విభేదించడం వంటివి భవిష్యత్తులో అనాగరిక వైఖరులుగా మారి, తమ బానిసలుగా మార్చుకోవడం కోసం మనుషుల్ని హింసించడమనే మధ్యయుగాల ఆధిపత్యం అంతర్జాలంలో ప్రత్యక్షమవుతుంది. మనుషులను సమూహంగా కాక మూకగా, మందలుగా మార్చే శక్తి ట్రోలింగ్‌కి ఉంది. తప్పు చేసినవారిని పదిమంది తిడుతుంటే ‘మీలో పాపం చేయనివారు ముందుగా రాయి విసరండి’ అన్న పాతకాలపు తాత్విక ఔచిత్యం మాయమయ్యింది. ఎవరో ముందుగా సాఫ్ట్‌ టార్గెట్‌ని ఎంచుకుని తమలోని ప్రకోపాలను చూపినపుడు మిగతావారు తమకేమీ తెలీకున్నా వచ్చి, మూకదాడి మొదలు పెడతారు.

ట్రోలింగ్‌ మీద తెలుగునాట పెద్దగా అధ్యయనాలు లేవు. మలుపు ప్రచురణలు, ప్రరవే సంయుక్తంగా వేసిన ‘ట్రోల్‌’ పుస్తకం మొదటిసారిగా దీనిని సైద్ధాంతికంగా చర్చకి పెట్టింది. మతతత్వ శక్తులు పోలరైజ్‌ కావడానికి గత దశాబ్దంన్నర కాలంలో కీలకపాత్ర పోషించినవి ట్రోల్‌ ముఠాలు అన్న సంగతి గ్రహించగలిగితే, దానికి వ్యతిరేకంగా ఎలా నిలబడి పనిచేయాలన్నది అవగాహనలోకి వస్తుంది.

  • కె ఎన్‌ మల్లీశ్వరి, జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక
➡️