జలమే జగతికి మూలం..

Mar 17,2024 13:00 #Sneha, #water

నీరు.. నీరు..నీరు..
బొట్టు జాడ లేని ఎడారులు..
అంగలారుస్తున్న పుడమితల్లి..
నీటి చుక్క కరువై..
బీడువారుతున్న పంట చేలు..
జల జగడాలు.. నీటి యుద్ధాలు..
జల ప్రళయాలు..
ఆనక ఖండాంతరాలు దాటిన నీటి దందా
‘ఇందు కలడు అందులేడు.. ఎందెందు వెతికినా..’ అన్నట్లు ప్రపంచంలో ఏ మూలన చూసినా నీటి ఇతివృత్తమే కథా వస్తువు. పంచ భూతాల్లో నీటికి రెండవ ప్రాధాన్యమిచ్చారెప్పుడో మన పూర్వీకులు. ఎంతటి అవసరం లేకపోతే నీటి గురించి అంతగా చెబుతారు? మానవులకే కాదు భూమిపై సమస్త జంతుజాలం, ఆ మాటకొస్తే జీవకోటికి జలమే ప్రాణాధారం. నీరు లేకుండా ఏమీ లేదు. నీరు లేని భూమిని ఊహించటం కష్టం. ఆధునిక సమాజం నీటికి ఎనలేని గుర్తింపునిచ్చింది. నీటిని పొందడం అనేది ప్రాథమిక హక్కుగా నొక్కి వక్కాణించింది. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, భూతాపం, మితం లేని పట్టణీకరణ, విచ్చలవిడి నీటి వాణిజ్యం.. అందుకోసం గడచిన నాలుగు దశాబ్దాల్లో ప్రపంచానికి పరిచయమైన అతి పెద్ద సవాల్‌ నీరు. ఈ నెల 22వ తేదీన ‘ప్రపంచ నీటి దినోత్సవం’ ఆ సందర్భంగా ప్రత్యేక కథనం..

సమస్యకు మూలమెక్కడో, కారకులెవరో, లబ్ధి పొందుతున్నదెవరో, బాధితులెవరో గిరిగీసి చెప్పొచ్చు. సామ్రాజ్యవాద, సంపన్న దేశాలు ఒకవైపున కొలువుదీరగా.. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు మరోవైపున ఉన్నాయి. ‘తాగిన వాడే తాళ్ల పన్ను కట్టాలన్న’ సామెత తెలుగునాట ఎప్పుడో పుట్టింది. హద్దులేని పెట్టుబడిదారీ పారిశ్రామికీకరణకు, పట్టణీకరణకు ఒడిగట్టి వాతావరణాన్ని కబళించి, ఇంతకాలం నీటిని దోపిడీ చేసిన, రెండు చేతులా సంపద పోగేసుకున్న దేశాలే నీటిని సంరక్షించాలి. వారిదే బాధ్యత. అదే సహజ న్యాయం. ప్రాయశ్చిత్తంగా నష్టపోయిన దేశాలకు ధనిక దేశాలు పరిహారం ఇవ్వాలి. మానవాళి ప్రాణాధారమైన జల సంరక్షణకు సాంకేతికంగా, నిధుల పరంగా పూచీ పడాల్సింది సంపన్న దేశాలే. అదే ధర్మం.


ప్రమాద ఘంటికలు..
ప్రపంచంలో నయా-ఉదారవాద ఆర్థిక విధానాలు పురుడు పోసుకున్నాక నీటి ఆవశ్యకతపై చర్చ మొదలైంది. భవిష్యత్తు తరాలకు సురక్షిత నీటిని అందించాలన్న లక్ష్యం బయలుదేరింది. నీటిని సంరక్షించుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవవుతుందన్న భయాందోళనలు అలముకున్నాయి. జీవకోటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రమాద ఘంటికలే ‘వరల్డ్‌ వాటర్‌ డే’కి ప్రేరణయ్యాయి. 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో పర్యావరణం-అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం ఎజెండాలో 21వ అంశంగా ‘ప్రపంచ జల దినోత్సవం’ ప్రతిపాదన ప్రముఖంగా ముందుకొచ్చింది. తొలి వరల్డ్‌ వాటర్‌ డే 1993లో జరిగింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాదీ మార్చి 22న ‘వరల్డ్‌ వాటర్‌ డే’ ని జరుపుతున్నారు. ఐరాస సభ్యదేశాలు అన్నింటిలో అత్యంత ప్రాధాన్యమిచ్చి నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవ టార్గెట్‌ మంచినీటి సంరక్షణ. మంచి నీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు. ఆ ఇతివృత్తంగా పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రతలకు సంబంధించిన విషయాలపై దృష్టి సారించారు. ఇది సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌లోని ఆరవ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.


శాంతి కోసం జలం..
ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఐరాస ప్రపంచ నీటి అభివృద్ధి నివేదికను విడుదల చేస్తుంది. ప్రతి ఏడాదీ ఐరాస ఒక థీమ్‌ను ప్రకటిస్తుంది. థీమ్‌ గురించి ఐరాస సభ్యదేశాలతో సంప్రదిస్తుంది. నీటికి – వాతావరణ మార్పులకు మధ్య విడదీయరాని బంధం ఉందని ఐరాస ఎప్పుడో స్పష్టమైన అంచనాకి వచ్చింది. ప్రస్తుత 2024 సంవత్సర థీమ్‌ ‘శాంతి కోసం జలం’. ప్రపంచ జల దినోత్సవాన్ని వివిధ రకాల కార్యక్రమాలతో జరుపుకుంటారు. నాటకాలు, మ్యూజిక్‌, ర్యాలీలు, ప్రకృతి, జల సంరక్షణపై అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌, విరాళాల సేకరణ ఇత్యాది ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు నిర్వహించి నీటి ప్రాధాన్యతపై ప్రచారం చేస్తారు. నీటిని పొదుపుగా వాడాలని, వృధా చేయొద్దని చెపుతారు. ప్రపంచాన్ని కోవిడ్‌ మహమ్మారి అతలాకుతలం చేశాక నీటి ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ఆ సమయంలో ప్రజలు పరిశుభ్రం పాటించాల్సి వచ్చింది. చేతులు, ఉపయోగించే వస్తువులను నీటితో ఒకటికి పదిసార్లు శుభ్రం చేసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. కోవిడ్‌ మహమ్మారి నీరు అత్యవసర వస్తువు అని ప్రపంచానికి హితోపదేశం చేసింది.


పాలకులే దోషులు..
అత్యంత విలువైన ప్రకృతి వనరులలో నీరు ఒకటి. సామాజిక ఆర్థిక వృద్ధి ఎక్కువగా నీటిపైనే ఆధారపడి ఉంది. రక్షిత తాగునీరు మానవ ఆరోగ్యానికి, శ్రేయస్సుకు చాలా అవసరం. నాణ్యమైన గాలి, పోషకాహారం మానవజాతి బతకడానికి అవసరమైనవి. అవే జీవనోపాధిని ఇస్తాయి. అవి లేకుండా మనిషి జీవించడం అసాధ్యం. మంచినీటి విషయానికొస్తే భూగ్రహం మొత్తం వైశాల్యంలో కొద్దిభాగం నీరు మాత్రమే మానవ ఉపయోగానికి అనుకూలంగా ఉంది. అందుకే అత్యంత విలువైన వనరులలో నీరు ఒకటి. అనునిత్యం ప్రజలు తాగు, వ్యవసాయం, పరిశ్రమలు, వినోదం, పరిశుభ్రత, పారిశుధ్యం ఆరోగ్య సంరక్షణ కోసం నీటిని ఉపయోగిస్తారు. నీటి వనరులు అమూల్యమైనవి పరిమితమైనవి. అధిక ఉష్ణోగ్రతలు, భూమి వేడెక్కడం, వాతావరణ మార్పులు, ఇతర సహజ, మానవ నిర్మిత ఒత్తిళ్లు, ప్రకృతి విపత్తులు, నీటి పరిమాణం, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. సురక్షితమైన నీరు, తగినంత పారిశుధ్యం, పరిశుభ్రతను కాపాడుకుంటేనే ప్రపంచంలో వచ్చే వివిధ రకాల అంటువ్యాధుల నుండి జనం రక్షించబడతారు. మరణాలు తగ్గుతాయి. టైఫాయిడ్‌, పలు జ్వరాలు, కలరా, అతిసార, డయేరా వంటి వ్యాధులు అపరిశుభ్రమైన నీటి వలనే వ్యాపిస్తాయి. జనాల, స్త్రీల, ముఖ్యంగా చిన్నారుల మరణాలకు అపరిశుభ్రమైన నీరు కారణమవుతోంది. మనలాంటి పేద, అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో అతిసార, డయేరా, పలు రకాల జ్వరాల వలన ప్రతి ఏడాదీ లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. క్షతగాత్రులవుతున్నారు. ఆదివాసీలు, దళితులు, ఇతర పేద తరగతుల ప్రజలకు రక్షిత మంచినీరు అందక చనిపోతున్నారు. అంగవైకల్యానికి కూడా గురవుతున్నారు. మన రాష్ట్రంలో అత్యధిక ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతం ప్రకాశం జిల్లా. పోలియో బాధితులు ఆ ప్రాంతంలోనే ఎక్కుగా కనిపిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ఎన్‌టిఆర్‌ జిల్లా ఎ.కొండూరు ప్రాంతంలో రక్షిత తాగునీరు అందక కిడ్నీ వ్యాధులతో వేలాది మంది బాధలు పడుతున్నారు.. మరణిస్తున్నారు. సురక్షిత నీరు అందకపోవడం వలన చనిపోతున్న వారితో పోల్చితే సునామీలు, భూకంపాలు, ఉగ్రవాదం, తీవ్రవాదం వలన చనిపోయేవారి సంఖ్య నామమాత్రం. రక్షిత తాగునీరు అందించలేని ప్రభుత్వాలదే బాధ్యత. తాగునీరు లేక చనిపోయే వారి మరణాలకు పాలకులదే బాధ్యత. అందుకే బాధ్యతాయుతమైన నీటి వినియోగాన్ని, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నీటి అందుబాటును ప్రోత్సహించడానికి పాలకులను, ప్రభుత్వాలను నిలదీసేందుకు ప్రజలు వరల్డ్‌ వాటర్‌ డే రోజు కంకణధారులు కావాలి.

జల రహస్యాలు..
జీవ మనుగడకు ఆధారమైన నీటి గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండదని తెలిసిందే. అయితే అన్ని పదార్థాల మాదిరిగా సాధారణ రసాయన నియమాలను నీళ్లు పాటించవు. ఆ విరుద్ధ స్వభావం వల్లే భూమ్మీద జీవ మనుగడ సాధ్యమైంది. మన భూగోళం మీద నీరు మొదట వాయు రూపంలో ఉండేది. తేలికైన ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ అణువులతో అది రూపొందింది. చల్లబడితే అన్ని రసాయన పదార్థాల మాదిరిగా కాకుండా నీరు విస్తరిస్తుంది. అందువల్లనే మంచుగడ్డలు నీటిపై ప్రవహిస్తాయి. అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలిరంగులో కనిపించడానికి కారణం నీరే. భూమిపై 75 శాతం వరకూ నీటి వనరులున్నాయి. భూమి మీద నీటి వనరుల్లో 99 శాతం ఉప్పునీరే. అందులో 97 శాతం సముద్రాల్లో ఉండగా మిగతావి నదులు, చెరువుల్లో ఉన్నాయి. తాగడానికి ఉపయోగపడే జలాలు ఒక శాతం మాత్రమే ఉన్నాయి. అందులోనూ 0.86 శాతం చెరువులు, 0.02 శాతం నదులు, మిగతా 0.12 శాతం భూగర్భ జలాలు. అంటే ప్రపంచ వ్యాప్తంగా కేవలం 0.3 శాతం ఉపయోగపడే నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వనరులే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 750 కోట్ల మంది దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తున్నాయి. ‘వరల్డ్‌ వాటర్‌ డే డాట్‌ ఆర్గ్‌’ వివరాల ప్రకారం ప్రపంచంలోని మంచినీళ్లు దాదాపు భూగర్భ జలాలే. ఐరాస అంచనా ప్రకారం ప్రపంచంలోని 2.2 బిలియన్ల మంది ప్రజలు సురక్షితమైన నీరు అందుబాటులో లేకుండానే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రతి ఒక్కరికీ రక్షిత నీటిని అందజేయడమనే లక్ష్యాన్ని ఐరాస పెట్టుకుంది.


సైన్యం కాపలా కాయాలి!
ఔచిత్యంతోనే ఐరాస ఈ ఏడాది థీమ్‌ను ఎంపిక చేసినట్లు కనిపిస్తుంది. నీటి కొరత, నీటి కాలుష్యం, తగినంత నీటి సరఫరా లేకపోవడం, పారిశుధ్య లోపం, వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచానికి సరికొత్త సవాళ్లు. ఈ తరుణంలో ప్రజలకు నీరు అందుబాటులో లేనప్పుడు దేశాలు, ప్రాంతాలు, సమూహాల మధ్య వివాదాలు తలెత్తవచ్చు. ఘర్షణలకు దారి తీయవచ్చు. ఆదిమ సమాజంలో ఆహారం కోసం, మనుగడ కోసం పోరాటాలు జరిగేవి. ఆ తర్వాత రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు వాటర్‌ వార్‌లు ముందుకొచ్చాయి. పలు దేశాల్లో అంతర్గతంగా, దేశాల మధ్య, ప్రాంతాల నడుమ జల జగడాలు చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు గ్రామాల్లో పొలాల వద్ద నీటి సరఫరా కోసం కాల్వలకు గండ్లు పెట్టుకొనేవారు. పెత్తందార్లు నీటినంతా తమ పొలాలకు పారించేవారు. నిమ్న తరగతుల, పేదల చేలను ఎండబెట్టేవారు. ఘర్షణలు తలెత్తేవి. ఇప్పుడు అలా కాదు దేశాల మధ్య గొడవలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఉదాహరణకు పాకిస్తాన్‌, ఇండియా మధ్య గొడవలు, ఒప్పందాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకుపైగా ప్రజలు జాతీయ సరిహద్దులను దాటిన నీటిపై ఆధారపడి ఉన్నారు. అయినప్పటికీ నదులు, సరస్సులు, జలాశయాలను తమ పొరుగువారితో పంచుకునే 153 దేశాల్లో కేవలం 24 దేశాలు మాత్రమే తమ భాగస్వామ్య నీటి కోసం సహకార ఒప్పందాలను కలిగి ఉన్నాయని నివేదించాయి. వాతావరణ మార్పుల ప్రభావాలు, ప్రపంచ జనాభా పెరుగుతున్నప్పుడు మన అత్యంత విలువైన నీటిని సంరక్షించడంలో ఐక్యంగా ఉండాలి. కానీ జల జగడాలు తీవ్రమవుతున్నాయి. మన దేశంలో కావేరి నదీ జలాల వివాదం తమిళనాడు, కర్ణాటక మధ్య తరచు తలెత్తుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉండగా కర్ణాటక, మహారాష్ట్ర, ఎ.పి. మధ్య కృష్ణా జలాల విషయంలో వివాదాలొచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు పొడసూపుతున్నాయి. రాజకీయాలకు కథా వస్తువులుగా మారుతున్నాయి. మన దేశంలో చూసుకుంటే వాతావరణ మార్పులతో హిమానీనదాలు కరుగుతున్నాయి. హిమాలయ సానువులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. అకాల భారీ వర్షాలకు, వరదలకు కారణం వాతావరణ మార్పులు ఒకటైతే కార్పొరేట్ల విచ్చలవిడి వ్యాపార, లాభాపేక్ష ప్రకృతి వనరుల చెర మరొక కారణం. ఉత్తరాఖండ్‌లో నదులపై అడ్డంగా నిర్మిస్తున్న ప్రైవేటు పవర్‌ ప్లాంట్లు విధ్వంసానికి హేతువులని అధ్యయనాలు ఉన్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లున్నాయి. చర్యలు తీసుకునే బదులు కార్పొరేట్లకు దాసోహం అంటున్నాయి. జోషీమఠ్‌ కుంగడమూ చూశాం. అసోంలో బ్రహ్మపుత్ర నది వరదలకు ప్రకృతి విధ్వంసం ఒక కారణం. ఢిల్లీ, ఆగ్రాలో యమున, హైదరాబాద్‌లో మూసీ కాలుష్య కాసారాలుగా తయారయ్యాయి. మత క్రతువులతో గబ్బు పట్టిన గంగా నది ప్రక్షాళన అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇటువంటివి చాలానే ఉన్నాయి. జల సంక్షరణ చర్యలు చేపట్టకపోతే కొన్నేళ్లల్లో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ సహా దేశంలో మరో 20 నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటుతాయని నీతీ ఆయోగ్‌ హెచ్చరించింది. పట్టణీకరణలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వలన ఎక్కడెక్కడి చెరువులు, కుంటలు దురాక్రమణలకు లోనవుతున్నాయి. 2000 సంవత్సరంలో, ఆ తర్వాతా హైదరాబాద్‌లో వచ్చిన వరదలు నీటి వనరుల విచ్చలవిడి ఆక్రమణల వల్లనే సంభవించాయి. వర్షాలకు తరచు ఆర్థిక రాజధాని ముంబయి మునిగేది రియల్‌ అక్రమ దందాతోనే.

కాసుల పంట..
దేశంలో, రాష్ట్రంలో మెట్రో నగరాలే కాదు చిన్న పల్లెటూర్లలోనూ తాగునీటి కొరత ఉంటోంది. ప్రభుత్వం నీటి సరఫరా చేయలేకపోతోంది. పక్కనే చెరువులు, నదులు పారుతున్నా గుక్కెడు తాగు నీరు దొరకని దుర్భర పరిస్థితులున్నాయి. ప్రభుత్వాలే వాటర్‌ పాలసీలను వ్యాపారమయం చేశాయి. తాగు నీరు ప్రజల హక్కు కాగా, వాటినీ కొనుక్కోవాలంటున్నాయి. గతంలో ఎవరో డబ్బున్న మారాజులు వాటల్‌ బాటిళ్లు కొనుక్కొనేవారు. ఇప్పుడు నీటి వ్యాపారం రూ.వేల కోట్లకు ఎగబాకింది. బిస్లరీ, కిన్లే, టాటా వంటి అనేక కార్పొరేట్‌ కంపెనీలు లాభాలు పోగేసుకుంటున్నాయి. ఇంటింటికీ మినరల్‌ వాటర్‌ వ్యాపారం సాగుతోంది. ఎప్పుడో కరువొస్తే వాటర్‌ ట్యాంకర్లతో నీటిని రవాణా చేసేవారు. ఇప్పుడు డబ్బు పెడితే టిన్స్‌లో ఇంటింటికీ రవాణా చేస్తున్నారు. దాంతో నీటి వనరులు దోపిడీకి గురవుతున్నాయి. విచ్చలవిడిగా భూగర్భ జలాలు దోచేసి డబ్బు గడిస్తున్నారు. నీటిని కొనుక్కోలేని పేదలకు ప్రభుత్వ పథకాలే దిక్కయ్యాయి. ప్రస్తుతం పబ్లిక్‌ నల్లాలు ఎత్తేస్తున్నారు. స్థానిక సంస్థలు మీటర్లు పెట్టి, కొలిచి నీళ్లు అమ్ముతామంటున్నాయి.

బెంబేలెత్తిస్తున్న ఐరాస నివేదికలు..
ఐరాస నివేదికలు హడలెత్తిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పదిమందిలో నలుగురికి అవసరమైన సురక్షిత మంచినీరు అందుబాటులో లేదు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగానికిపైగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని అంచనా వేశారు. అందుబాటులో ఉన్న నీటి వనరులకు మించి జనాభా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంది. నీటి సమస్యను ఎదుర్కొంటున్న దేశాల్లో 200 కోట్లకుపైగా ప్రజలు నివశిస్తున్నారు. సంవత్సరానికి కనీసం ఒక నెల పాటు తీవ్రమైన నీటి కొరతతో బాధ పడుతున్న ప్రాంతాల్లో 400 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు పిల్లల్లో ఒకరికి వారి రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి తగినంత నీరు అందుబాటులో ఉండటం లేదు. ఇంకా 80 కంటే ఎక్కువ దేశాల్లో పిల్లలు అధిక నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నివశిస్తున్నారు. తూర్పు, దక్షిణ ఆఫ్రికాలో అటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లలు అత్యధికంగా ఉన్నారు. 58 శాతం మంది ప్రతిరోజూ తగినంత నీటి లభ్యత పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురిలో ఇద్దరు లేక 300 కోట్ల మందికి ఇంట్లో సబ్బుతో చేతులు కడుక్కోడానికి నీటి సౌకర్యం లేదు. అందులో పేద దేశాల్లో మూడొంతుల మంది ఉన్నారు. 140 తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో సురక్షిత తాగునీరు, పారిశుధ్యం కల్పించడానికి సంవత్సరానికి 9,34,800 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.

గత వందేళ్లల్లో ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి వాడకం ఆరు రెట్లు పెరిగింది. 1980ల నుంచి ఏడాదికి ఒక శాతం పెరుగుతూనే ఉంది. ప్రపంచ నీటి వాడకంలో వ్యవసాయం 70 శాతంగా ఉంది. సాగుకే కాకుండా పశువులు, ఆక్వా కల్చర్‌ కోసం కూడా నీటిని ఉపయోగిస్తున్నారు. వాతావరణంలో జరిగే మార్పుల ప్రభావం నీటి లభ్యతపై తీవ్రంగా పడుతుంది. ఐస్‌ కవర్లు, హిమానీనదాలు కరగడం, ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో లక్షల వేల మందికి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చు. ఎక్కడో చంద్రుడిపైనా, అంగారక గ్రహంపైనా నీటి జాడల కోసం రాకెట్లు పంపి మరీ అన్వేషిస్తున్నాం. మన చెంతనే ఉన్న నీటిని మాత్రం రక్షించుకోలేకపోతున్నాం. వరల్డ్‌ వాటర్‌ డే రోజున ఈ దిశగా కార్యోన్ముఖులైతే నీరు రక్షించబడుతుంది. మానవాళి మనుగడకు భరోసా కల్గిస్తుంది.

కె.ఎస్‌.వి. ప్రసాద్‌
9490099019

➡️