నువ్వు ఎవరంటే..!?

May 5,2024 08:47 #kavithalu

నీ బంధుత్వానికి
బాంధవ్యానికి మధ్య
ఊగిసలాడే
అదృశ్య ఉచ్ఛ్వాసవు
చినుకు చినుకు
సూర్యోదయాల మధ్య
గగనంపై పొడిచిన
ఇంద్రధనుస్సులో
ఏడవ రంగువు
నీ వాళ్ళను
నిలబెట్టే క్రతువులో
క్షణం క్షణం మరణించైనా
బతుకు సంగీతంలో
పాటై పల్లవించే కోయిలవు
ఊల నిచ్చెన ఎక్కి
వాస్తవ నేలపై
తచ్చాడే శ్రమ జీవన
స్వేదానివి
మనసును
ప్రేమకు ముడేసుకుని
నీలో నువ్వే
గిరగిరా తిరిగే
రంగుల రాట్నానివి..!
ఆటుపోటుల
సంద్రంలో
కెరటమై తాకే జ్ఞాపకానివి
నిశ్శబ్దంగా కదిలిపోయే
సైకత చిత్రానివి

డా. కటుకోఝ్వల రమేష్‌
9949083327

➡️