మనకెందుకులే అనుకునే ..

May 5,2024 08:43 #Kavitha

మనకెందుకులే అనుకునే
మానవ సమూహాల్ని..!!
నా హృదయాంతరాళంలోని
భావోద్వేగపు మంటల సాక్షిగా..
ఎన్నో సార్లు..నేను చూశాను!
నేను విన్నాను!
నేను చలించాను!
నవసమాజపు ప్రగతిపథంలో
ఎన్నో ‘కన్నీటిధారల్ని’..!
నాగరికపు నా దేశంలో
నడిరోడ్డుపై పేదరికాన్ని దర్శించే
నగమైన చిదిమిన బ్రతుకుల్ని..!
ఆకలిని తీర్చుకోవడం కోసం
అన్నం మెతుకులకై ఆరాటపడే
మనుషుల వ్యథల్ని..!
అర్థరాత్రి చీకటిలో అస్తమించిన
అబలల ఏడుపుల్ని..!
వృద్ధాప్యంలో అమ్మ నాన్నల్ని
మానసికంగా చంపేస్తున్న ద్రోహుల్ని..!
ప్రజాస్వామ్య ఆలయంలో
ప్రజల్నే బానిసలను చేస్తున్న
రాజకీయ నాయకుల్ని..!
చదువు ‘కొనలేక’
‘కొని’ రాయలేక
తనువుల్ని వదిలేస్తున్న
భావి భారత పౌరుల్ని..!
తమ మనుగడ తప్ప
ఏమీ తమకు పట్టదనుకునే
కొన్ని కుల, మత, ప్రాంత
రాజకీయ పార్టీల్ని..!
ఇలాంటివి ఎన్నో చూస్తూ
మనకెందుకులే అనుకునే
మానవ సమూహాల్ని..!
ఇలాంటి దృశ్యాల దృష్టి కోణాన్ని
రాయలేక.. రాతరాక..
ఉషోదయంలాంటి నా కలం
ఈ కన్నీటిధారపు ఆనవాల్ని
భవిష్యత్‌ తరాలకు
తారాప్రకాశంగా ప్రభవించింది..!!
మార్పును కాంక్షించే
అరుణవర్ణమై ప్రసవించింది..!!

అరుణ్‌ కుమార్‌
9394749536

➡️