ఎండు చేపలతో.. రుచులు

Jan 7,2024 10:50 #ruchi, #Sneha

మెండు జలపుష్పాలంటే మక్కువ చూపేవారే ఎక్కువ. అదేనండీ చేపలు, ఎండు చేపలంటే కొందరు మహా ఇష్టపడతారు. పూర్వపు రోజుల్లో కట్టెల పొయ్యి మీద వంటంతా అయిపోయిన తర్వాత ఎండు చేపలకు బూడిద అంటకుండా కాటన్‌ గుడ్డ చుట్టి వేడిగా ఉన్న బూడిదలోపల ఉంచితే.. ఉదయానికి చక్కగా ఉడికి చాలా బాగుండేవి. వాటిని పప్పు, పప్పుచారు, పులుసు కూరల్లో నంజుకుంటే ఆ రుచే వేరు. ఇప్పుడా సౌలభ్యం లేదు కాబట్టి, ప్రస్తుత పద్ధతుల్లోనే కొన్ని రుచులను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

మెత్తళ్ళతో ఇగురు..

కావలసినవి : మెత్తళ్ళు (నెత్తళ్ళు) – 100 గ్రా, నూనె – 50 గ్రా, ఆవాలు – స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 6, కరివేపాకు – 2 రెబ్బలు, ఉల్లిపాయ – ఒకటి, టమాటాలు – 2, ధనియాల పొడి – 3 స్పూన్లు, కారం – 2 స్పూన్లు,

తయారీ : బాండీలో నూనె వేడిచేసి ఆవాలు, వెల్లుల్లి తరుగు, కరివేపాకు దోరగా వేయించాలి. ఉల్లిపాయ తరుగు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసి తిప్పుతూ ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. కూరలో కారం, ధనియాల పొడి వేసి తిప్పి నూనె కూర అంచుల్లో కనిపించేంత వరకూ ఉడికించాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న నెత్తళ్ళను వేసి అవి చితికి పోకుండా తిప్పి, సిమ్‌లో మాత్రమే మూతపెట్టి ఉడికించాలి. అంతే నోరూరించే మెత్తళ్ళ కూర రెడీ.

పులుసు..

కావలసినవి : ఎండు చేపలు (చీలికలు) – 1/4 కేజీ, నూనె – 5 గరిటెలు, ఆవాలు – స్పూను, మెంతులు – 1/2 స్పూను, కరివేపాకు – 2 రెబ్బలు, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి పాయలు – 12, అల్లం తరుగు – స్పూను, చిక్కుడు గింజలు – 1/4 కప్పు, కంద ముక్కలు – 15, పసుపు – 1/2 స్పూను, ములక్కాయ ముక్కలు – 6, వంకాయలు – 2, ముల్లంగి ముక్కలు-8, టమోటాలు – 2, పచ్చిమిర్చి – 3, ధనియాల పొడి – 2 స్పూన్లు, కారం – 21/2 స్పూన్లు, చింతపండు – 50 గ్రా., తోటకూర కాడలు – 15 ముక్కలు, నీళ్ళు -1/2 లీ.,

తయారీ : మట్టి పాత్రలో నూనె వేడిచేసి ఆవాలు, మెంతులు దోరగా వేయించాలి. తర్వాత కరివేపాకు, ఉలిపాయ ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం తరుగు వేసి, ఒకసారి కలిపి మూతపెట్టి ఉల్లిపాయ మెత్తబడే వరకూ ఉడికించాలి. చిక్కుడు గింజలు, అరంగుళం సైజు కందముక్కలు, పసుపు వేసి, కూరంతా తిప్పి మూతపెట్టి ఏడెనిమిది నిమిషాలు ఉడికించాలి. ములక్కాయ, వంకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, టమాటాల సన్నని తరుగు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి, ముక్కలు చెదిరిపోకుండా కూరను తిప్పి, మరో ఏడెనిమిది నిమిషాలు ఉడికించాలి. ధనియాల పొడి, కారం, చింతపండు పులుసు, ఒకటిన్నర అంగుళాల తోటకూర కాడలు, నీళ్ళుపోసి పదిహేను నిమిషాలపాటు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు దానిలో శుభ్రం చేసుకున్న ఎండు చేపల ముక్కలు, రాళ్ళ ఉప్పు, కొత్తిమీర వేసి ముక్క చెదరకుండా తిప్పాలి. కూరను నూనె పైకి తేలేంతవరకూ మీడియం ఫ్లేం మీద ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే ఎండు చేపల పులుసు రెడీ. ఈ కూర మరుసటి రోజుకు మరింత రుచిగా ఉంటుంది.

ఫ్రై ..

కావలసినవి : ఉప్పు చేపలు – 100 గ్రా, కారం – 2 స్పూన్లు, ధనియాల పొడి – 2 స్పూన్లు, కరివేపాకు – 2 రెబ్బలు

తయారీ : వెడల్పు గిన్నెలో కారం, ధనియాల పొడి, పసుపు, నూనె పేస్ట్‌లా కలపాలి. చేప ముక్కలకు ఆ పేస్ట్‌ను పట్టించాలి. బాండీలో నూనె వేడిచేసి ఈ ముక్కలను రెండువైపులా తిప్పుతూ వేయించాలి. అంతే యమ్మీయమ్మీ చేపల ఫ్రై రెడీ.

 

➡️