స్త్రీ భాగస్వామ్యం.. అభివృద్ధికి సోపానం..

Mar 8,2024 08:44 #Women Stories, #Women's Day
Women's participation is a step towards development.

ప్రజాశక్తి ”ప్రతి అక్షరం ప్రజల పక్షం” నినాదంతో అనేక ప్రత్యేక సంచికలను విజ్ఞానదాయకంగా వెలువరిస్తోంది. ఏ ప్రత్యేక సంచిక అయినా ఆయా రంగాల్లో నిపుణులతో అందుకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని అందిస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఇటీవల పిల్లల ప్రత్యేక సంచికను వారిచేతే రాయించి ‘చిరుమువ్వల’ సందడి చేసింది. ”అంతర్జాతీయ మహిళా దినోత్సవం” సందర్భంగా ”ధీర” పేరుతో మహిళల కోసం రంగుల్లో ప్రత్యేక సంచికతో మీ ముందుకు వచ్చింది. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎలాంటి భేద భావాలు లేకుండా జరుపుకునేది. ‘ఎక్కడమ్మా నీవు లేనిది? ఏమిటీ నీవు చేయలేనిది?’ అన్నట్లు.. ఈ రోజు అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో మహిళలు ముందుకు వెళుతున్నారు. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకూ సకల రంగాల్లోనూ స్త్రీలు సమున్నత స్థానాల్లో విశేష కృషి చేస్తున్నారు. ఉత్పత్తి రంగంలో భాగస్వామ్యంతో మహిళా సాధికారతను సాధించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. సరైన అవకాశాలు ఇస్తే మహిళలు మరింత అభివృద్ధిని సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్పత్తిలో స్త్రీల సమాన భాగస్వామ్యంతోనే దేశం అభివృద్ధి పథంలో పురోగమిస్తుంది. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం నేటికీ లభించడం లేదు. రిజర్వేషన్‌ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయే తప్ప, మహిళలకు న్యాయం చేయాలనే ఆలోచనలు ఇప్పటి వరకూ పాలించిన, పాలిస్తున్న పార్టీలు చేయలేదు. ”నస్త్రీ స్వాతంత్య్రమర్హతీ..” అన్న మనువాదాన్ని రాజ్యాంగంగా రూపొందించాలంటున్న శక్తులు రాజ్యమేలుతున్న సమయమిది. స్త్రీని వాణిజ్య సరుకుగా మాత్రమే చూసే కార్పొరేట్‌ శక్తులు పెత్తనం చేస్తున్న రోజులివి. కార్పొరేట్‌-మతతత్వ కూటమి పాలన అంతమైతేనే అభివృద్ధి.. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలను మనం ఈ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అభినందించుకోవాలి.. గౌరవించుకోవాలి. వారి భాగస్వామ్యంతోనే ప్రపంచాభివృద్ధి సాధ్యమనే వాస్తవాన్ని గుర్తించాలి. అప్పుడే మరింతగా ప్రపంచం, దేశం, రాష్ట్రం, జిల్లా, గ్రామం అభివృద్ధి చెందేది. ఈ నేపథ్యంలో అనేకాంశాలపై వ్యాసాలు, కథలు, కవితలు ఈ ప్రత్యేక సంచికలో ప్రచురించాం. ప్రజాశక్తి తీసుకువచ్చే ప్రత్యేక సంచికలను ఆదరించినట్లే.. ఈ ”ధీర” అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక సంచికనూ తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

  • బి.తులసీదాస్‌, సంపాదకుడు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక సంచికలో ప్రచురించిన అన్ని వ్యాసాలు ఈ లింక్ లో చదవగలరు.

ప్రత్యేక సంచిక పేపర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు 

➡️