ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా : కేజ్రీవాల్‌

May 13,2024 07:31 #AAP leader Kejriwal, #speech
  • 10 గ్యారంటీలను ప్రకటించిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘దేశానికి 10 గ్యారంటీలు’ను ఆదివారం ప్రకటించారు. నిరంతర విద్యుత్‌, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వంటి గ్యారంటీలు ఇందులో కీలకమైనవి. తనకు ప్రధానమంత్రి కావాలని లేదని, అయితే ఇండియా వేదిక ప్రభుత్వాన్ని ఏర్పాటవ్వగానే ఈ గ్యారంటీలు నెరవేరాలా చూస్తామని తెలిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఆప్‌ సీనియర్‌ నాయకులతో కలిసి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పది గ్యారంటీలను ఇప్పటికే ప్రకటించాలనుకున్నా, తన అరెస్టు కారణంగా ఆలస్యమైందని కేజ్రీవాల్‌ చెప్పారు. ఈ గ్యారంటీల గురించి ఇండియా వేదిక నాయకులతో చర్చించలేదని, తనకు అంత సమయం లేదని, అయితే వారు భావసారుప్యత ఉన్నందున వారెవ్వరూ అభ్యంతరం చెప్పరనే నమ్మకం తనకుందని కేజ్రీవాల్‌ తెలిపారు. ‘ఈ పది గ్యారెంటీలు భారత దేశ విజన్‌ లాంటివి. ఏ దేశానికైనా పునాది వంటివి. ఇవి లేకుండా దేశం ముందుకు సాగదు. వచ్చే ఐదేళ్లలో ఈ గ్యారెంటీలు అమలు చేస్తాం’ అని కేజ్రీవాల్‌ అన్నారు. బిజెపిలో 75 ఏళ్లకే పదవీ విరమణ నిబంధనను తీసుకొచ్చిందని గుర్తు చేస్తూ త్వరలోనే 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్న మోడీ స్థానంలో ప్రధాని అభ్యర్థి ఎవ్వరో చెప్పకుండా బిజెపి దాటవేస్తోందని చెప్పారు. దీనిపై మోడీ కూడా మౌనంగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. 2014లో ఇదే నిబంధనతో అద్వానీని పదవీ విరమణ చేయించిన మోడీ బృందానికి ఇప్పుడు ఆ నిబంధన గుర్తుకురావడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
ఆమాద్మీ పది గ్యారెంటీలు ఇవే..
1. 24 గంటలూ నిరంత విద్యుత్‌
2. అందరికీ నాణ్యమైన విద్య
3. అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య సదుపాయాలు
4. జాతీయ భద్రతకు మొదటి ప్రాధాన్యత
5. అగ్ని వీర్‌ పథకం రద్దు
6. రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర
7. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా
8. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్సన
9. అవినీతి నిర్మూలన
10. జిఎస్‌టి సరళీకరణ

➡️