ఇకనైనా సైన్స్‌కు…?

Jan 3,2024 08:07 #Articles, #Science
space science importance

గత సంవత్సరం చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 మిషన్లను విజయవంతంగా ప్రయోగించి భారత్‌ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు చూపింది ఇస్రో. అదే ఉత్సాహంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన సంవత్సరం రోజున సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్‌ఎల్‌వి-సి58 రాకెట్‌ను విజయవంతంగా ప్రయో గించింది. కాంతి ధ్రువణాన్ని కొలిచే ఎక్స్‌-పోశాట్‌ అనేది భారత్‌ మొదటి, ప్రపంచంలో రెండో అంతరిక్ష మిషన్‌. ఈ మిషన్‌ ప్రత్యేకమైనది, కీలకమైంది. ఎందుకంటే సవాల్‌తో కూడుకున్న బ్లాక్‌ హోల్స్‌, న్యూట్రాన్‌ స్టార్స్‌, యాక్టివ్‌ గెలాక్సీ న్యూక్లియైలు, పల్సర్‌ విండ్‌ నెబ్యులా వంటి వివిధ ఖగోళ మూలాల ఉద్గారాలను అర్థం చేసుకోవడానికి, కొలవడానికి సహాయ పడుతుంది. వివిధ ప్రసార మాధ్యమాలు ఇస్రో ప్రయోగాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తుండటం వల్ల సామాన్య ప్రజలకు కూడా వీటి పట్ల ఆసక్తి పెరుగుతున్నది. సైన్స్‌ను నమ్ముకున్న అనేక దేశాలు వివిధ రంగాల్లో అగ్ర పథంలో దూసుకుపోతున్నాయి. ఉదాహరణకు స్విట్జర్లాండ్‌. గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ తాజాగా ఇచ్చిన నివేదికలో స్విస్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో కేవలం 90 లక్షల జనాభా మాత్రమే ఉంది. కానీ ప్రపంచంలో గొప్ప విశ్వ విద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు ఈ దేశంలోనే వున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయోగశాల సెర్న్‌ జెనీవాలో ఉంది. మరొక ముఖ్యమైన పరిశోధన కేంద్రం పాల్‌ స్చెర్రెర్‌ సంస్థ కూడా ఈ దేశంలోనే ఉంది. మొత్తంగా 114 మంది నోబెల్‌ విజేతలు స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. నోబెల్‌ శాంతి బహుమతి కూడా పలుసార్లు స్విట్జర్లాండ్‌లో ఉండే సంస్థలకే వచ్చాయి. ఈ దేశ జనాభాలో దాదాపు మూడవ వంతు ప్రజలు ఏ మతాన్ని అనుసరించరు. స్విస్‌ తర్వాత గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో రెండవ స్థానంలో స్వీడన్‌ ఉంది. ఏ దేశానికైనా విద్య, ఆరోగ్య రంగాలు కీలకం. ఈ రెండు రంగాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన క్యూబా కరోనా మహమ్మారిని సమర్ధవతంగా ఎదుర్కొంది. భారత దేశ రాజ్యాంగం ప్రకారం మతం వ్యక్తిగత అంశం. కానీ పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించు కుంటున్నారు. రక్షణ, అంతరిక్ష రంగంలో మన దేశం కొంత ప్రగతిని సాధించింది. అయితే ఆవిష్కరణల విషయంలో ఇంకా వెనుకబడే ఉంది. కొత్త ఏడాదిలోనైనా ఇస్రో అందిస్తున్న సేవల స్ఫూర్తితో పాలకులు సైన్స్‌ పరిశోధనలకు అధిక నిధులు మంజూరు చేయాలి. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలి. విశ్వ విద్యాలయాలను పటిష్టం చేయాలి. సైన్స్‌ గురించి ప్రచారం చేసేవారిపై జరిగే దాడులను అరికట్టాలి. అప్పుడే మన దేశం నూతన ఆవిష్కరణలలో ముందుండే అవకాశం వుంది.

 

– యం. రాంప్రదీప్‌,జన విజ్ఞాన వేదిక ప్రతినిధి,సెల్‌ : 9492712836

➡️