బి- ఫారమ్‌ గుబులు

  •  ఎవరి సీటుకు గండి పడుతుందోనని అభ్యర్థుల ఆందోళన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల్లో బి-ఫారమ్‌ గుబులు రేపుతోంది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో గెలుపే ప్రామాణికంగా తీసుకుని ఆయా స్థానాల్లో మార్పులు చేసేందుకు ఫ్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. దీంతో పోటీ చేయాలనుకునే సీటును ఎవరు తన్నుకుపోతారో అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఎన్నికల కమిషన్‌ ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ గెజిట్‌ విడుదల చేయబోతోంది. అదేరోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. గడువు దగ్గర పడే కొద్ది అభ్యర్థుల్లో తమ భవితవ్యం ఎటువైపు మరలుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వైసిపి రెబల్‌ ఎంపి రఘురామకృష్ణరాజు ఇటీవల టిడిపిలో చేరారు. కచ్ఛితంగా ఈ దఫా ఎన్నికల్లో ఎంపిగా గానీ, ఎమ్మెల్యేగా గానీ పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. దీంతో ఆయన కోసం ఉండి స్థానాన్ని ఖాళీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టిడిపి తొలి జాబితాలో సీటు పొందిన ఉండి సిట్టింగు ఎమ్మెల్యే, ప్రస్తుత టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మంతెన రామరాజును పోటీ నుంచి తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది. రామరాజుకు మద్దతుగా నియోజకవర్గంలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రామరాజుకు టిడిపి బి- ఫారమ్‌ ఇస్తుందా లేదా అనే ఆందోళన ఆయనను వెంటాడుతోంది. అలాగే నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావుకు టిడిపి టికెట్‌ ఖరారు చేసింది. ఇటీవల నియోజకవర్గంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనను కూడా తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్రలో మాడుగుల నియోజకవర్గ టికెట్‌ ఇప్పటికే ఎన్‌ఆర్‌ఐకు కేటాయించింది. ఇదే స్థానంలో టిడిపి సీనియర్‌ నేత బండారు సత్యనారాయణకు టికెట్‌ ఇవ్వొచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అలాగే అనపర్తి టికెట్‌ పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. ఇటీవల బిజెపి అగ్రనేతలతో జరిగిన చర్చల్లో ఆ స్థానాన్ని టిడిపికి కేటాయించి అందుకు బదులుగా తంబళ్లపల్లె స్థానాన్ని బిజెపికి టిడిపి ఆఫర్‌ ఇచ్చింది. దీంతో రాజకీయ వాతావరణం ఎలా మారుతుందోననే ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది.

నాలుగైదు స్థానాల్లో వైసిపి అభ్యర్థుల మార్పు..!
వైసిపిలో నాలుగైదు స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం లేకపోలేదని చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రానున్న ఎన్నికల్లో మండపేట నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈయనకు విశాఖ ఎస్‌సి, ఎస్‌టి కోర్టు దళితుల శిరోముండనం కేసులో 18 నెలల జైలుశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో త్రిమూర్తులును తప్పించి మరొకరికి సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అలాగే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, గుంటూరు-2, రాయలసీమ జిల్లాలో ఓ పార్లమెంటు అభ్యర్థిని మార్చే అవకాశం ఉంది. వీటితోపాటు మరో రెండు, మూడు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులుండొచ్చని సమాచారం. ఈ దఫా ఎన్నికలు వైసిపి, టిడిపికి చావో రేవో అనే పరిస్థితి నెలకొంది.

➡️