ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం పేరిట కేంద్రం మరో మోసం!

Apr 12,2024 07:53 #ap government, #Rajadhani, #RBI
  • విశాఖలో ఏర్పాటు చేస్తామంటూ గతంలోనే లేఖ
  • రాజధాని ఎక్కడంటూ నేడు ప్రశ్న శ్రీ ఎన్నికల వేళ వంచనా విన్యాసం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల అమలులో రాష్ట్ర ప్రజలను దగా చేసిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం మరోసారి అదే తరహా విన్యాసానికి తెరతీసింది. రాష్ట్ర రాజధాని ఎక్కడో తేలిన తరువాతే ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆర్‌బిఐ తాజాగా రాసిన లేఖే దీనికి నిదర్శనం. నిజానికి మూడు రాజధానుల పేరిట రాష్ట్ర పాలనా రాజధానిని విశాఖపట్నంకు తరలిస్తామంటూ వైసిపి ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా తప్పు పట్టలేదు. గతంలో రాష్ట్రంలో పర్యటించిన ప్రధానితో పాటు, కేంద్ర మంత్రులు కూడా ఈ విషయాన్ని నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే రిజర్వుబ్యాంకు విశాఖలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సన్నద్దమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపింది. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరి 18న ‘ప్రజాశక్తి’లో వార్తా కథనం కూడా ప్రచురితమైంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతికి సమీపంలోనే పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటకు వచ్చిన ప్రధాని మోడీ రాజధాని అంశంపై పెదవివిప్పలేదు. అయితే, అనూహ్యం గా రిజర్వుబ్యాంకు రాజధాని ఏదో ఖరారైతేనే ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామంటూ అఖిలభారత పంచాయతీ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షునికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాయలం ఏర్పాటుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆయన చేసిన విజ్ఞప్తికి సమాధానం ఆర్‌బిఐ నుండి అందింది. దీంతో ఆర్‌బిఐ వైఖరి ఒక్కసారిగా మారిన తీరు చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు జవాబు ఇవ్వకుండా వ్యూహాత్మకంగానే ఆర్‌బిఐ చేత సమాధానం ఇప్పించారని, ఈ లేఖ వెనుక బిజెపి, ఎన్‌డిఎ కూటమి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్‌బిఐ గతంలో ఇలా…!
ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు 2022వ సంవత్సరంలోనే ప్రారంభమైనాయి. ఆ ఏడాది ఆగస్టు 22న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని మూడు డిపార్ట్‌మెంట్లతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన చిరునామా, అధికారుల ఫోన్‌ నంబర్లను కూడా ఆ లేఖలో ఇచ్చారు.2023 జనవరి 31న రాసిన లేఖలో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు గురించిన ప్రస్తావన చేశారు. అపాయింట్‌మెంట్‌ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్‌ కార్యదర్శితో కలిసి ఇదే అంశంపై చర్చిస్తామని కూడా తెలిపారు. అక్టోబర్‌ 31,2023న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌ జవహర్‌రెడ్డికి మరో లేఖ రాశారు. ఈ లేఖలో గతంలో రాసిన రెండు లేఖల అంశాన్ని ప్రస్తావించారు. విశాఖలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని కోరారు. 30,000- 35,000 చదరపు అడుగుల మధ్య కార్యాలయం ఏర్పాటుకు అనువుగా ఉండాలని, నీటి సరఫరా, వాష్‌ రూమ్‌లు, రెండు లిఫ్ట్‌లు, విద్యుత్‌ కనెక్షన్‌, ఇంటర్నల్‌ పార్కింగ్‌, పబ్లిక్‌ కౌంటర్ల ఏర్పాటుకోసం గ్రౌండ్‌ లెవల్‌ హాలు, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ తదితర ప్రాథమిక సౌకర్యాలు ఉన్న భవనాన్ని ఐదు సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని కోరారు. ఆర్‌బిఐ నుండి వరుసగా వస్తున్న లేఖల నేపధ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్‌కు ఈ దిశలో అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 31వ తేదిన (31.01.24) ఈ మేరకు రాతపూర్వక ఆదేశాలు కూడా విశాఖ కలెక్టర్‌కు అందాయి. ఆర్‌బిఐ కోరిన మేరకు విశాఖలో భవనాన్ని కూడా సిద్ధం చేశారంటూ వార్తలు వచ్చాయి.

ఇప్పుడెందుకు ఇలా…?
రాష్ట్రంలో రాజధాని అంశంపై జరుగుతున్న వివాదం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంకు పాలనా రాజధానిని తరలించి, అమరావతిని అసెంబ్లీ సమావేశాలకే పరిమితం చేయాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని వైసిపి మినహా అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారి ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తామంటూ ఆర్‌బిఐ వరుసగా లేఖలు రాసింది.ఇప్పుడు రాజధాని వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. ఎన్నికల వేళ ఆర్‌బిఐ తీసుకున్న ఈ చర్య ఎవరికి ఉపయోగపడుతుందో, ఎవరికి ఇబ్బందిగా మారుతుందో ప్రత్యేంగా చెప్పనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి లేకుండా ఆర్‌బిఐ ఈ తరహా నిర్ణయం తీసుకుంటుందా…ఆలోచించాల్సిందే!

➡️