బాండ్లతో విమర్శలు బంద్‌

Mar 31,2024 00:32 #Criticism with Bonds

– టిడిపికి షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ రూ.40 కోట్ల బాండ్లు
– వైసిపికి పలు కంపెనీల నుంచి రూ.133 కోట్లు
-జనసేనకు రూ.10 కోట్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :షీర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీపై విరుచుకుపడ్డ టిడిపి ఇప్పుడు మౌనంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల ప్రాజెక్టులను ప్రభుత్వం అడ్డగోలుగా షీర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టిందని టిడిపి నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడయితే ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి ముడుపులు అందాయో అప్పటి నుంచి ఆ కంపెనీని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రివ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం(ఆర్‌డిఎస్‌ఎస్‌) ప్రాజెక్టు కింద వ్యవసాయ పంపుసెట్లకు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహ వినియోగదారులకు స్మార్ట్‌, ప్రిపెయిడ్‌ మీటర్లను రాష్ట్ర ప్రభుత్వం అమరుస్తున్న విషయం తెలిసిందే. ప్రజలపై భారాలు మోపే ఈ ప్రాజెక్టులను అధిక ధరకు విద్యుత్‌ పంపిణీ షీర్డిసాయికి ప్రభుత్వం కట్టబెట్టింది. అదేవిధంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ ప్రాజెక్టులను కూడా పంపిణీ సంస్థలు ఇదే కంపెనీకి కట్టబెట్టాయి. మీటర్ల టెండర్లలో పెద్ద కుంభకోణం జరిగిందని టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆ పార్టీ నేతలు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, దీపక్‌ రెడ్డి, జివి రెడ్డితో పాటు పలువురు నాయకులు పదే పదే మీడియా ముందు విమర్శలు చేశారు. ఈ విమర్శలను షీర్డిసాయి కంపెనీ ఎన్నికల బాండ్ల రూపంలో టిడిపి నోరు మూయించింది. ఈ ఏడాది జనవరి 12వ తేదీన రూ.40 కోట్ల విలువైన బాండ్లను ఒక్కొక్కటి కోటి చొప్పున 40 బాండ్లను కొనుగోలు చేసి టిడిపికి సమర్పించింది. దీంతో అప్పటి నుంచి టిడిపి ఈ కంపెనీని పల్లెత్తి మాట కూడా అనడం లేదు.
ఈ కంపెనీతో పాటు మరో మూడు విద్యుత్‌ కంపెనీలు టిడిపికి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయి. వెస్టర్న్‌ యపి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.20 కోట్లు, ఎస్‌ఇపిసి పవర్‌ కంపెనీ, రూ.5 కోట్లు, సోమశిల సోలార్‌ పవర్‌ కంపెనీ రూ.2 కోట్లు చొప్పున టిడిపికి కట్టబెట్టాయి. యుపి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ జనసేనకు కూడా రూ.10 కోట్లతో బాండ్లు కొనుగోలు చేసింది.
క్విడ్‌ ప్రోకోలో వైసిపి
అధికార పార్టీ వైసిపి క్విడ్‌ ప్రోకోలో విద్యుత్‌ కంపెనీల నుంచి బాండ్ల రూపంలో ముడుపులు తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా పలు కంపెనీలకు ప్రభుత్వం భూములు కేటాయింపులు చేసింది. గ్రీన్‌కో విండ్‌ సంస్థకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1500 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు వైసిపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికోసం 4,766 ఎకరాలను ఈ సంస్థకు అప్పగించింది. దీనికి గాను గ్రీన్‌కో రూ.10 కోట్లను బాండ్ల రూపంలో వైసిపికి అప్పగించింది. గ్రీన్‌కో సంస్థ సిఇఒ సోదరుడు కాకినాడ లోక్‌సభ నుంచి వైసిపి తరపున పోటీ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు 960 మెగావాట్ల పోలవరం విద్యుత్‌ ప్రాజెక్టు దక్కించుకున్న మేఘా కంపెనీ వైసిపికి రూ.37 కోట్ల రూపంలో బాండ్లు కొనుగోలు చేసింది. అదేవిధంగా రూ.12,264 కోట్ల విలువైన ఎగువ సీలేరు పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ప్రభుత్వం కట్టబెట్టింది. అస్ట్రో మధ్య విండ్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌ కంపెనీ 2023 నవంబర్‌లో రూ.17 కోట్ల విలువైన బాండ్లను వైసిపికి కొనుగోలు చేసింది. అస్ట్రోజై సల్మార్‌ ప్రైవేట్‌ కంపెనీ కూడా ఇదే తేదీలో మరో రూ.17 కోట్లు వైసిపికి బాండ్ల రూపంలో అప్పగించింది.
తెలుగు కంపెనీలే ఇతర రాష్ట్రాల్లో..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యుపి వెస్టర్న్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీకి తెలుగు వారే డైరెక్టర్లుగా ఉన్నారు. రాష్ట్రానికి చెందిన వారే అక్కడ కంపెనీలు పెట్టారు. ఒక కంపెనీలో ఉన్న డైరెక్టర్‌ పలు కంపెనీల్లో కూడా డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. మేఘా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్న పమిరెడ్డి పిచ్చిరెడ్డి వెస్ట్రన్‌ యుపి పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. తానోత్‌ విండ్‌ కంపెనీకి చెందిన డైరెక్టర్‌ కె హరికృష్ణ, రామానుజం వెంకట సీత, గ్రీన్‌కో, అచ్యింత కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఎస్‌ఇపిసి కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న బంతు శ్రీనివాస్‌, కొత్తురు గోవర్ధన్‌రెడ్డి మేఘాతో పలు ప్రైవేట్‌ విద్యుత్‌ కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

విద్యుత్‌ కంపెనీలు – బాండ్ల వివరాలు
వైసిపికి ఇచ్చిన కంపెనీలు
కంపెనీ పేరు           ఇచ్చిన నగదు       తేదీ
మేఘా                    37కోట్లు                2023
గ్రీన్‌కో విండ్‌              10కోట్లు                2023 ఏప్రిల్‌ 11
స్కిరాన్‌ రెన్యువబుల్‌  ఎనర్జీ 7కోట్లు     2023 ఏప్రిల్‌11, 15 నవంబర్‌ 2023
తానోత్‌ విండ్‌ పవర్‌,
తాడాస్‌ విండ్‌ ఎనర్జీ    4కోట్లు              2022 ఏప్రిల్‌
స్నేహ కైనెటిక్‌ పవర్‌  10కోట్లు           2023 నవంబర్‌
అస్ట్రోమధ్య విండ్‌        17కోట్లు         2023 నవంబర్‌
ఖండ్కే విండ్‌        ఎనర్జీ కోట్లు            2023 ఏప్రిల్‌
ఆరిష్‌ సోలార్‌        2 కోట్లు               2023 ఏప్రిల్‌
ఆష్మాన్‌ ఎనర్జీ         కోటి                  2023 ఏప్రిల్‌
అనిమల విండ్‌      2కోట్లు              2023 ఏప్రిల్‌
అచింత్య సోలార్‌      కోటి               2022 ఏప్రిల్‌
జెఎస్‌డబ్ల్యూ       4కోట్లు
దివ్యేశ్‌ పవర్‌      3కోట్లు             ఏప్రిల్‌2022 2కోట్లు,

23యాక్సిస్‌ విండ్‌   3కోట్లు         2023 ఏప్రిల్‌
ఎలెనా రెన్యువబుల్‌  3కోట్లు        2022 ఏప్రిల్‌ 8వ 2కోట్లు, 2023, ఏప్రిల్‌ 15 కోటి
ఎన్‌ఎస్‌ఎల్‌ రెన్యుబుల్‌ పవర్‌ కోటి  2023 ఏప్రిల్‌ 10
దేవర విండ్‌           2కోట్లు           2023 నవంబర్‌
శ్రేయాస్‌ రెన్యుబల్‌ ఎనర్జీ  కోటి      2023 ఏప్రిల్‌ 15

మొత్తం : రూ.133 కోట్లు

టిడిపికి ఇచ్చిన కంపెనీలు

షిర్డి ఎలక్ట్రికల్స్‌          40కోట్లు    2024 జనవరి
వెస్టర్న్‌ యుపి పవర్‌ 20కోట్లు     2024 జనవరి
ఎస్‌ఇపిసి పవర్‌       5కోట్లు        2023 నవంబర్‌
మేఘా                 4కోట్లు            2022 అక్టోబర్‌
సోమశిల సోలార్‌ పవర్‌ 2కోట్లు     2023 నవంబర్‌
మొత్తం: 71 కోట్లు

➡️