ఖరారు సీట్లలో తకరారు – వైసిపిలో పెరుగుతున్న అసంతృప్తి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు ‘సిద్ధం’ అని సమరశంఖం పూరించిన వైసిపి.. అభ్యర్థుల విషయంలో సరైన కసరత్తు చేసినట్లు కనిపించడం లేదు. పోటీ చేసే స్థానాల మార్పుపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన జాబితాలకు కూడా సవరణలు చేయాలని వైసిపి కసరత్తు చేస్తుండటం చర్చనీయాశమవుతోంది. కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించిన కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ పోటీకి ససేమిరా అంటూ పార్టీని వీడేందుకు సన్నహాలు చేసుకుంటున్న ఘటన కళ్లముందు వుండగానే తిరుపతి పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించిన సత్యవేడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను సత్యవేడు అసెంబ్లీ నుండి పోటీ చేయకుండా మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి కుట్ర పన్నారని, పార్టీలో బిసిలకు, ఎస్‌సిలకు గౌరవం లేదంటూ ప్రకటన చేశారు. వైసిపి అధిష్టానం తీరుతో కోనేటి ఆదిమూలం టిడిపి టచ్‌లోకి పోయినట్లు చెబుతున్నారు.

అలాగే ఒంగోలు, నర్సారావుపేట పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపిక వైసిపికి సవాల్‌గా మారింది. నర్సా రావుపేట నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పి స్తారనే ఆశతో ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడు పార్టీలో చేరిన పది రోజులకే పార్టీని వీడిన సంగతి తెలిసిందే. సిట్టింగ్‌ ఎంపి తను వుండగా మరొకరి పేరు పరిశీలించడంతో కినుక వహించిన ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు వైసిపికి, ఎంపి పదవికి గుడ్‌బై చెప్పేశారు. అంబటి జనసేన పంచన చేరారు.

మచిలీపట్నం ఎంపి బాలశౌరి కూడా వైసిపికి గుడ్‌బై చెప్పేశారు. ఎమ్మిగనూరు అసెంబ్లీకి ప్రకటించిన మాచాని వెంకటేష్‌ స్థానంలో నెల తిరక్కుండానే మరో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు కసరత్తును చేపట్టారు. కోడుమూరు, నందికొట్కూరులలో స్థానికేతరులకు టికెట్‌లు ఇవ్వడాన్ని స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడే నిలేస్తుండటం, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రకటించిన వెలంపల్లి శ్రీనివాస్‌కు స్థానిక నాయకత్వం చేస్తున్న సహాయనిరాకరణతో పార్టీ పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది.

రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితను కూడా స్థానిక నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలా అధికారపార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో ఖరారు అయిన సీట్లలో వస్తున్న తీవ్రమైన అసంతృప్తిని ఎలా సర్దుబాటు చేస్తుందనేది చర్చనీయాంశమైన అంశంగా మారింది.

➡️