1967 ఎన్నికల్లో భారీగా ఇండిపెండెంట్ల ఎన్నిక

Apr 12,2024 06:56 #2024 elections, #andrapradesh

1952 నుంచి 1966 వరకూ ప్రభుత్వాలు రకరకాల ఒడుదుడుకులతో నడిచినా.. పెద్ద సంచలనాత్మకమైన సంఘటనలు మాత్రం 1967 ఎన్నికలకు కొద్దికాలం ముందు జరిగాయి. విశాఖ ఉక్కు ఉద్యమం రాష్ట్రంలో ఎంతో సంచలనం కలిగించింది. ఐదేళ్ల పదవీ కాలానికి ప్రతిసారీ ముఖ్యమంత్రులు మారడం, లేదా రాష్ట్ర భౌగోళిక స్వరూపాల్లో మార్పులు జరగడం (రాష్ట్ర విభజనలు, కొత్త కలయికల)తో అన్నీ సంచలనాలకు దారితీశాయి. విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని.. 1967లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం రాజుకుంది. ఈ ఉద్యమంలో సుమారు 32 మంది పోలీసు కాల్పుల్లో ఆహుతి అయ్యారు. దాదాపు 70 మంది శాసనసభ్యులు రాజీనామా చేయడం అప్పటివరకూ జరిగిన రాజకీయ చరిత్రలో సంచలనం. సిపిఐకి చెందిన 30 మంది శాసనసభ్యులు, సిపిఐ(ఎం)కు చెందిన 21 మంది శాససనభ్యులు, స్వతంత్ర పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, నేషనల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన ఇద్దరు, కమ్యూనిస్టు సానుభూతిపరులైన నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంకురార్పణ ఏర్పడింది.

రికార్డు స్థాయిలో 68 మంది ఇండిపెండెంట్ల ఎన్నిక
ఈ నేపథ్యంలో.. 1967 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ సారి శాసనసభ సీట్ల సంఖ్య తగ్గింది. 1962 నాటి శాసనసభలో 300 స్థానాలుండగా.. ఈ ఎన్నికలకు 287కు సీట్లు తగ్గాయి. అధికార కాంగ్రెస్‌ మొత్తం 287 స్థానాలకూ పోటీ చేసింది. 165 స్థానాలు గెలుచుకుంది. 62,92,649 (45.42 శాతం) ఓట్లు సాధించింది. స్వతంత్ర పార్టీ 90 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించింది. 13,63,382 (9.84 శాతం) ఓట్లు సంపాదించింది. 104 స్థానాలకు పోటీ చేసిన సిపిఐ 11 స్థానాల్లో గెలుపొందింది. 10,77,499 (7.78 శాతం) ఓట్లు సంపాదించింది. సిపిఐ(ఎం) 83 స్థానాలకు పోటీ చేసి 9 స్థానాల్లో విజయం సాధించింది. 10,53,855 (7.61 శాతం) ఓట్లు సాధించింది. ఇండిపెండెంట్లు కనీవినీ ఎరుగని రీతిలో 68 మంది గెలిచారు. దాదాపు 25 శాతం ఓట్లు సంపాదించారు. ఒక విధంగా కాంగ్రెస్‌ తరువాత అత్యధిక సీట్లు సంపాదించినవారు ఇండిపెండెంట్లే. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంత మంది ఇండిపెండెంట్లు శాసనసభ్యులుగా గెలుపొందడం ఇప్పటివరకూ ఇదే మొదటిసారి.

ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి, ప్రతిపక్ష నేతగా గౌతు లచ్చన్న
కాంగ్రెస్‌ నేత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా స్వతంత్ర పార్టీ నేత గౌతు లచ్చన్న ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పక్షాన కాసు బ్రహ్మానందరెడ్డితోపాటు, పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు వంటివారు ఎన్నికకాగా, స్వతంత్ర పార్టీ పక్షాన ప్రధాన నాయకుడుగా గౌతు లచ్చన్న ఎన్నికయ్యారు. సిపిఐ పక్షాన పూల సుబ్బయ్య, చిట్టూరు ప్రభాకర చౌదరి వంటి వారు విజయం సాధించగా, సిపిఐ(ఎం) పక్షాన టి.నాగిరెడ్డి, రజబ్‌అలీ వంటి నేతలు గెలుపొందారు. అలాగే రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పిఐ) పక్షాన జె.ఈశ్వరీబాయి శాసనసభకు ఎన్నికయ్యారు.
కాంగ్రెస్‌ పక్షాన బ్రహ్మానందరెడ్డి 1970 సెప్టెంబరు 30 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే తేదీ నుంచి ఆయన స్థానంలో పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1952 నుంచి ప్రతి పదవీ కాలపరిమితిలో ఇద్దరు ముఖ్యమంత్రులు మారడం పరిపాటిగా మారింది. 1952 -55 మధ్య చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ), టంగుటూరి ప్రకాశం పంతులు, 1955-62 మధ్య బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, 1962-67 మధ్య నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, 1967-72 మధ్య కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రులుగా కొనసాగారు.

– యు. రామకృష్ణ

➡️