ఇసి నోటీసులిచ్చినా.. ఆగని విద్వేష జాఢ్యం

Apr 29,2024 09:05 #EC notices
  • తీరు మారని బిజెపి
  • స్టార్‌ క్యాంపెయినర్లు
  • నడ్డా, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, యోగి ప్రసంగాల్లో స్పష్టం

న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులిచ్చినా….బిజెపి నాయకుల నోటి దురుసు మాత్రం ఆగడం లేదు. మైనార్టీలతో పాటు సమాజంలో అణగారిన సామాజిక తరగుతలపైనా, వారికి రాజ్యాంగ కల్పించిన రిజర్వేషన్లపైనా కాషాయ నేతలు కుటిల వ్యాఖ్యలు చేస్తున్నారు. విద్వేష మోతాదు మరింతగా పెంచి ప్రజలను చీల్చే కుట్రలు సాగిస్తున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాతో సహా స్టార్‌ క్యాంపెయినర్లుగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరింతగా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను దట్టిస్తున్నారు. ముస్లింలకు కాంగ్రెస్‌ సంపదను తిరిగి పంచుతుందని ఆరోపిస్తూ బిజెపి సీనియర్‌ నేత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా మత విద్వేష వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. వాస్తవానికి కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఎక్కడా దేశంలో సంపద పునర్విభజన గురించి ప్రస్తావించలేదు. ఉద్యోగాలు, రిజర్వేషన్లు, సచార్‌ కమిటీ నివేదిక అమలు, ట్రిపుల్‌ తలాక్‌ను తిరిగి తీసుకురావటంలోనూ ముస్లింల గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదు. కానీ ‘ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల హక్కులను లాక్కొని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరుకుంటున్నది’ అని మోడీ మతపరమైన వ్యాఖ్యలు చేశారు. వీటిని ప్రతిధ్వనించేలా జెపి నడ్డా సైతం రెండ్రోజుల క్రితం మత విద్వేష జాఢ్యాన్ని వెల్లగక్కారు. ‘ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల హక్కులను లాక్కొని ముస్లింలకు ఇవ్వటమే కాంగ్రెస్‌, ఇండియా బ్లాక్‌ రహస్య అజెండా. దేశంలోని వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉందని కాంగ్రెస్‌ చెప్తున్నది. అయితే వనరులపై మొదటి హక్కు ఈ దేశంలోని పేదలదేనని ప్రధాని మోడీ అన్నారు’ అని ఆయన సెలవిచ్చారు. మోడీలాగే.. నడ్డా కూడా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రసంగాన్ని తప్పుదారి పట్టించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ”మన్మోహన్‌ సింగ్‌ పొరపాటున ఈ ప్రసంగం చేయలేదు. తెలిసే అలా చేశారు. ఎందుకంటే 2009 ఏప్రిల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. సచార్‌ కమిటీ నివేదిక ద్వారా తప్పుడు ప్రకటనలు చేశారు. దళితుల కంటే ముస్లింలు అధ్వానంగా ఉన్నారన్నారు. ముస్లింలను ఎస్‌సిలుగా ప్రకటించాలనీ, దీంతో దళితులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ పెద్దపీట వేస్తున్నది” అని నడ్డా అన్నారు.
రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో జరిగిన ర్యాలీలో మోడీ తొలిసారిగా వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తర్వాత ఎన్నికల సంఘం బిజెపి, కాంగ్రెస్‌ల స్టార్‌ క్యాంపెయినర్ల మోడల్‌ ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) ఉల్లంఘనలకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షులు నడ్డా, మల్లికార్జున్‌ ఖర్గేలను ఉద్దేశించి లేఖలను పంపింది. ఆ లేఖలో ఉల్లంఘించిన వారి పేర్లను మాత్రం పేర్కొనలేదు.
ఈనెల 21న బాన్స్‌వారాలో.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ర్యాలీకి హాజరైన వారి తల్లులు, సోదరీమణుల సంపదను ”చొరబాటుదారులు”, ”ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి” పంపిణీ చేస్తుందని ఒక వర్గం వారిని టార్గెట్‌ చేస్తూ మోడీ అన్నారు. ఆ తర్వాత జరిగిన ర్యాలీల్లోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేయటం గమనార్హం. ఈ ప్రసంగం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు కారణమైంది. గ్లోబల్‌ ప్రెస్‌లో అపూర్వమైన ద్వేషపూరిత ప్రసంగంగా ఇది అభివర్ణించబడింది.
నడ్డా మాత్రమే కాదు.. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, యోగి ఆదిత్యనాధ్‌ సహా బిజెపి ఇతర స్టార్‌ క్యాంపెయినర్లు విద్వేషాలను రెచ్చగొట్టడమే ఏకైక కార్యక్రమంగా పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల యూపీలోని దాద్రీలో జరిగిన ర్యాలీలో రాజ్‌నాథ్‌ కూడా మన్మోహన్‌ ప్రసంగాన్ని ప్రస్తావించారని చెప్పారు. ”2006లో, జాతీయ రక్షణ మండలి సమావేశంలో దేశ వనరులపై మొదటి హక్కు మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలదేనని అన్నారు. దేశ వనరులు ప్రతి ఒక్కరికీ చెందుతాయి. ప్రధాని ఈ విషయం చెప్పినప్పుడు వారు (ప్రతిపక్షాలు) హంగామా (రక్కస్‌) చేస్తున్నారు”అని ఆయన అన్నారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలో జరిగిన ర్యాలీలో.. ముస్లిం వ్యక్తిగత చట్టాలను తీసుకువస్తామనీ, దేశాన్ని ”షరియా చట్టం” ప్రకారం నడుపుతామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నదని అమిత్‌ షా ఆరోపించారు. ”కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోను జాగ్రత్తగా చదవండి. మళ్లీ వ్యక్తిగత చట్టాలు తీసుకువస్తామని ఆ పార్టీ చెప్పింది. ముస్లిం వ్యక్తిగత చట్టాలను తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? షరియా చట్టం ప్రకారం ఈ దేశం నడుస్తుందా? మీరు ట్రిపుల్‌ తలాక్‌ను వెనక్కి తీసుకురాగలరా? కాంగ్రెస్‌ పార్టీ ముస్లిం లీగ్‌ అజెండాను తీసుకుంటున్నది. కానీ రాహుల్‌ బాబా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోరు. ట్రిపుల్‌ తలాక్‌ను వెనక్కి తీసుకురారు. సిఎఎ, ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370లను తాకలేరు” అని అమిత్‌ షా అన్నారు. అదే రోజు జరిగిన మరో ర్యాలీలోనూ ఆయన ఆ వాదనను మళ్లీ వినిపించటం గమనార్హం.
ఉత్తర ప్రదేశ్‌లోని ఇటావాలో శనివారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి)లు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా దేశాన్ని ఇస్లామీకరిస్తారని ఆదిత్యనాథ్‌ విషంగక్కారు. ”వెనుకబడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్లలో వారు ముస్లింలను చేర్చుతారు. మీరు దీన్ని అంగీకరిస్తారా? భారత్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవచ్చా? మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అంబేద్కర్‌ వ్యతిరేకించారు. ఇప్పుడు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రజలు తమకు నచ్చినవి తినకుండా ఆపకూడదని సూచించడం ద్వారా ఆవులను వధించడాన్ని సూచిస్తున్నదనీ, అది విశ్వాసాలతో ఆడుకోవటమేనని ఆయన అన్నారు. బిజెపి నాయకుల వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నదనీ, ఇది ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో ఆ పార్టీకే నష్టమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

➡️