గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పేరిట గట్టు గుటకాయస్వాహా..!

Feb 11,2024 10:25
  • చింతలపూడి ఎత్తిపోతల కాల్వగట్టుపై యథేచ్ఛగా తవ్వకాలు
  • కొండలు, గుట్టలు సైతం మాయం
  • పట్టించుకోని అధికారులు
  • స్థానిక అవసరాలకు తవ్వితే కేసులు
  • లబోదిబోమంటున్న ప్రజలు

ప్రజాశక్తి – టి.నరసాపురం : గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం పేరుతో ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో ఎక్కడబడితే అక్కడ అడ్డూఅదుపు లేకుండా కాంట్రాక్టుదారులు యథేచ్చగా తవ్వకాలు సాగిస్తూ మట్టిని తరలిస్తున్నారు. హైవే రోడ్డు నిర్మాణం పేరుతో కొండలను పిండి చేస్తున్నారు. గుట్టలను తొలిచేస్తున్నారు. అవి చాలదన్నట్లు చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టు మట్టిని ఏకంగా నెల రోజుల్లో మాయం చేశారు. ఇదేమని స్థానికులు అడిగితే అనుమతులున్నాయని చెబుతుండటం గమనార్హం. కాలువ గట్టు మట్టి తవ్వకం, తరలింపనకు అనుమతులు ఇస్తారా, ఇస్తే ఎవరిచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొండలు, గుట్టలతోపాటు చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టు మట్టి తవ్వకాలు చేయడం వల్ల స్థానిక అవసరాలకు రానున్న రోజుల్లో మట్టి దొరికే పరిస్థితి లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

మండలంలోని ముత్యాలమ్మపేట నుండి టి.నరసాపురం సమీపం నుండి బొర్రంపాలెం మీదుగా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ హైవే నిర్మాణానికి మట్టి తవ్వకాలకు జిల్లా అధికారులు అనుమతులు ఇచ్చారంటూ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కాంట్రాక్టర్లు జెసిబిలతో కొండలు, గుట్టలు, చెరువులు ఇలా ఒకటేమిటీ, ఎక్కబడితే అక్కడ తవ్వకాలు సాగించేశారు. ఇప్పుడు ఏకంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టు మట్టి కూడా తవ్వేస్తున్నారు. దీంతో క్రమంగా గట్టు మాయమవుతోంది. ఇలా తవ్వకాలు చేస్తూ పోతే చివరకు గ్రామాల్లో ఇంటి అవసరాలకు మట్టి దొరికే అవకాశం ఉండదని పలువురు వాపోతున్నారు.స్థానికులు తవ్వితే కేసులు.. కాంట్రాక్టర్లకు అనుమతులు..!

ప్రస్తుతం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనుల కోసం తవ్వకాలు చేస్తున్న కొండలు గుట్టలు, చెరువుల్లో స్థానికులు ఇంటి అవసరాలకు పునాదిలోకి, స్థలం అభివృద్ధికి మట్టి తోలుకుంటే వారిపై అధి కారులు కేసులు పెట్టేవారని, ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులకు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టు మట్టి కూడా తవ్వేస్తే ఎలాగని, దీనికి అనుమతులు ఎలా ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి మట్టి తవ్వకాలు నివారించాలని, స్థానిక అవసరాలకు అనుగుణంగా మట్టి దొరికే విధంగా చూడాలని, గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకు ఎక్కడో ఒకచోట మాత్రమే అనుమతులు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

➡️