80 శాతానికి పైగా నియోజకవర్గాల తలసరి ఆదాయం రాష్ట్ర సగటు కన్నా తక్కువే ..

అమరావతి :    ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో శత కోటీశ్వరులు ఉన్నారేమో కానీ నియోజకవర్గాలు మాత్రం పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. పలు ఉత్పత్తుల్లో ఎపి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినా… ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు మాత్రం నిరుపేదలుగానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 80 శాతానికి పైగా నియోజకవర్గాలు రాష్ట్ర సగటు ఆదాయం కన్నా తక్కువ తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి (జిఎస్‌డిపి) కలిగి ఉన్నాయి. అభివృద్ధి కొరవడటం, పరిశ్రమలు లేకపోవడం, ప్రకృతి వనరులను సరిగా వినియోగించకపోవడంతో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర జిఎస్‌డిపిని పెంచేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే కొన్ని నియోజకవర్గాలు మాత్రం రాష్ట్ర జిఎస్‌డిపిలో దాదాపు 50 శాతం పొందేందుకు దోహదం చేస్తున్నాయి.

మూడు సంవత్సరాల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా జిఎస్‌డిపి, అభివృద్ధి పరిమితులు, ఉపాధి అవకాశాల సమతుల్యతను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రణాళికా విభాగం కసరత్తు చేస్తోంది. అధికార పార్టీ శాసనసభ్యులు సహా వివిధ వర్గాల నుండి డిమాండ్లు ఉన్నప్పటికీ.. వారి అభ్యర్థనలు, డిమాండ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం జిల్లాలను విభజించింది. ఇవి ప్రధానంగా మొత్తం వృద్ధి పారామితులను కూడా పరిగణనలోకి తీసుకోలేదు.

ఉదాహరణకు… ప్రకాశం జిల్లా (ఒంగోలు)లోని అద్దంకి నియోజకవర్గాన్ని కొనసాగించాలని డిమాండ్‌ ఉన్నప్పటికీ.. బాపట్ల లోక్‌సభలో భాగం చేసేందుకు దానిని బాపట్ల జిల్లాలోకి తీసుకువచ్చారు. అయితే అద్దంకిలో ఖనిజవనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి లేకుండా ఈ జిల్లాను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పెద్దగా ఆదాయాలు లేవు. ఈ విధంగా జిల్లాల విభజనతో పలు నియోజకవర్గాల ఆర్థిక ఆదాయం కుంటుపడింది.

మొత్తంగా పది అసెంబ్లీ నియోజకవర్గాలు రాష్ట్ర జిఎస్‌డిపిని పెంచేందుకు అధిక సహకారం అందిస్తున్నాయి. మొదటి సవరించిన అంచనా ప్రకారం జిఎస్‌డిపి 2023-24 సంవత్సరానికి రూ.15,90,242 కోట్లుగా ఉంది. 11.43 శాతం వృద్ధి రేటుతో స్థిరమైన ధరలతో జిఎస్‌డిపి వృద్ధి పరంగా (2021-22 ) గతేడాది ఎపి దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.

ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర తలసరి ఆదాయం 2023-24 సంవత్సరంలో రూ.2,70,295 కోట్లకు పెరిగింది. 2022-23లో రూ.2,45,582గా ఉండగా 24,713 అదనంగా లభించింది. ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయంలో ఎపి రూ.1,69,519తో 18వ స్థానంలో నిలిచింది. అయితే దాదాపు 148 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలసరి ఆదాయం కేవలం 1.8 నుండి 2 లక్షలుగా ఉంది. అంటే రాష్ట్ర సగటు కంటే దాదాపు 25 శాతం తక్కువగా ఉంది.

జిడిపి ప్రకారం ధనిక నియోజకవర్గాలు :
గాజువాక, కైకలూరు, కాకినాడ సిటీ, విశాఖపట్నం నార్త్‌, విశాఖ పట్నం సౌత్‌, యలమంచలి, గుంటూరు వెస్ట్‌, తిరుపతి, గుంటూరు ఈస్ట్‌, ఉండి.

సేవారంగం నుండి 50 శాతం కంటే ఎక్కువ జిడిపి సహకారాన్ని కలిగి ఉన్న నియోజకవర్గాలు :
నెల్లూరు సిటీ, తిరుపతి, విజయవాడ ఈస్ట్‌, విజయవాడ వెస్ట్‌, విజయవాడ సెంట్రల్‌, విశాఖపట్నం వెస్ట్‌, అనంతపురం, విశాఖపట్నం నార్త్‌, విశాఖ పట్నం ఈస్ట్‌, గుంటూరు వెస్ట్‌.

జిడిపి ప్రకారం తక్కువ ఆదాయం కలిగిన పది నియోజకవర్గాలు :
మడకశిర, పాలకొండ, పార్వతిపురం, ఆమదాలవలస, మంత్రాలయం, పిఠాపురం, గజపతినగరం, ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట.

వ్యవసాయ రంగం నుండి అధిక ఆదాయం కలిగిన నియోజకవర్గాలు :
కైకలూరు, యర్రగొండపాలెం, సింగనమల, దెందులూరు, ఉంగుటూరు, ఉండి, పెడన, కొడుమూరు, తంబల్లపల్లె, ఆలూరు.

అత్యధిక పారిశ్రామిక నియోజకవర్గాలు :
గాజువాక, రాజోలు, యలమంచి, పెందుర్తి, చిలకలూరిపేట సూళ్లురుపేట, శ్రీకాళహస్తి, సంతనూతల పాడు, ప్రత్తిపాడు, పెద్దాపురం.
30శాతం కంటే అధిక జిడిపి పైన పేర్కొన్న నియోజకవర్గాల్లోని పరిశ్రమల నుండి వస్తుంది. అదేవిధంగా 50 శాతం కంటే ఎక్కువ జిడిపి వ్యవసాయ నియోజకవర్గాల నుండి వస్తోంది.

పలు ఉత్పత్తుల్లో ఎపి దేశంలోనే ప్రధమ స్థానం :
అంతేకాకుండా పలు ఉత్పత్తులలో దేశంలోని ఎపి ఉన్నత స్థానంలో నిలిచింది. ఆక్వా, పండ్లు, గుడ్లు, పామాయిల్‌, కొకొవా, మిరప, పొగాకు ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉండగా, సిల్క్‌, జీడిపప్పు ఉత్పత్తుల్లో రెండో స్థానంలో నిలిచింది. కాటన్‌, కూరగాయలు, పూల ఉత్పత్తుల్లో మూడవ స్థానం కాగా, కొబ్బరికాయలు, కాఫీ, వేరుశనగ ఉత్పత్తిలో నాలుగో స్థానం, చెరకు ఉత్పత్తిలో ఐదో స్థానంలో నిలిచింది.

➡️