రైతులు నో చెప్పినా నానో

Jan 25,2024 06:54 #farmers
  • ఈ ఏడాది 5.94 లక్షల బాటిల్స్‌
  • 3 లక్షల టన్నుల సాధారణ ఎరువుకు కోత
  • బలవంతపు పిఎం ప్రణామ్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఏమాత్రం శాస్త్రీయత రుజువుకాని నానో యూరియాను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రైతులకు బలవంతంగా అంటగట్టింది. రైతులు పంటల సాగుకు సాధారణంగా ఉపయోగించే యూరియా కేటాయింపులను దిగ్గోసి ఆ మేరకు నానో యూరియాతో భర్తీ చేసింది. 2023-24లో ఘన రూపంలో బస్తాల్లో సరఫరా చేసే యూరియా కేటాయింపుల్లో సుమారు మూడు లక్షల టన్నులకు కోత పెట్టి అందుకు బదులుగా 5.94 లక్షల లిక్విడ్‌ యూరియా బాటిల్స్‌ను ప్రతిపాదించింది. రైతుల్లో ఆదరణ లేనందున ప్రైవేట్‌ డీలర్లు, దుకాణదారులు నానో యూరియాను తిరస్కరిస్తున్నారు. బలవంతంగా రుద్దిన యూరియా బాటిల్స్‌ సేల్‌ కావట్లేదని అసహనం చెందుతున్నారు. పెద్ద ఎత్తున సీసాలు పేరుకుపోయాయని ఆందోళన చెందుతున్నారు. కాగా కేంద్రం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో నానో ఎరువులను రైతులకు అంటగట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర సర్కారు ఆర్‌బికెలకు పంపిన నానో యూరియా సేల్‌ కాక మూలన పడేసినట్లు తెలుస్తోంది. కేంద్రం కోతలతో ఆనవాయితీగా వాడుతున్న యూరియా అదనుకు దొరక్క ఈ ఏడాది ఖరీఫ్‌, రబీలలో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

కేంద్రం బలవంతం

ఎరువుల సబ్సిడీని తగ్గించుకునేందుకు మోడీ ప్రభుత్వం ‘పిఎం ప్రణామ్‌’ ప్రాజెక్టును దేశ వ్యాప్తంగా అమలు చేస్తోంది. పిఎం ప్రణామ్‌ అంటే… ప్రధానమంత్రి ప్రోగ్రాం ఫర్‌ రిస్టోరేషన్‌, అవేర్‌నెస్‌ జనరేషన్‌, న్యూట్రియంట్‌ అండ్‌ ఎమోలియరేషన్‌ ఆఫ్‌ మోనిటర్‌ ఎర్త్‌. రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం ద్వారా భూమి తల్లిని, పర్యావరణాన్ని రక్షిస్తామంటోంది కేంద్ర సర్కారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ, జీవ, పచ్చిరొట్ట, నానో ఎరువులను ప్రోత్సహిస్తామంది. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు అలవాటు చేస్తామంది. అందులో భాగంగా 2023-24 నుంచి 2025-26 మూడేళ్ల కాలానికి ఎపిలో రైతుల చేత రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు టార్గెట్లు విధించింది. అందుకు తలొగ్గిన రాష్ట్ర సర్కారు ఈ సంవత్సరం ఖరీఫ్‌, రబీలలో 5,94,000 నానో యూరియా బాటిల్స్‌ అమ్మకాలకు ప్రణాళిక వేసింది. కేంద్ర సూచనలకనుగుణంగా రాష్ట్రంలో మూడు సంవత్సరాల యూరియా వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని సగటు గణించి, దానిలో 3.69 శాతం తగ్గించాలని లక్ష్యాలు రూపొందించింది. ఆ మేరకు రాష్ట్రానికి కేటాయించే ఘన యూరియా కేటాయింపుల్లో 3 లక్షల టన్నుల వరకు కోత పెట్టింది.

అశాస్త్రీయం

మామూలుగా రైతులు ఉపయోగించే 45 కిలోల బస్తా యూరియాకు బదులు ద్రవ రూపంలో ఉండే 500 మిల్లీలీటర్ల నానో యూరియా సీసా సరిపోతుందని, ఘన రూపంలో ఉండే ఎరువు కంటే ద్రవ రూపంలో ఉండే ఎరువు మొక్కలు గ్రహించడానికి వీలుగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఇది అశాస్త్రీయమని,శాస్త్రీయంగా నిరూపణ కాలేదని ప్రతిష్టాత్మక కొపెన్‌ హగెన్‌ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులు ఇటీవల పరిశోధనా పత్రాలు ప్రకటించారు. రైతులు నానో యూరియాను తిరస్కరిస్తున్నారు. అయినప్పటికీ నానో డిఎపిని కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. ఇదంతా ఎరువుల సబ్సిడీని తగ్గించుకోవడానికేనని పిఎం ప్రణామ్‌లో స్పష్టం చేసింది. శాస్త్రీయం కాని నానో ఎరువులను రైతులు వద్దన్నా అంటగడుతోంది. మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మాట జవదాటకుండా ఆర్‌బికెలలో అమ్మిస్తోంది.

➡️