కమలంతో వుంటే కేసు లేదు!

కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి…విపక్షాలపై వేటు వేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు సిద్ధంగా వుంటున్నాయి. అయితే, బిజెపితో పాటు బిజెపికి సన్నిహితంగా ఉండేవారు చేసిన నేరాలను, అవినీతిని ఏ దర్యాప్తు సంస్థా గుర్తించదు! ఇతర పార్టీలలో వున్నవారు కమలంవైపు వచ్చినా కేసులు మాయమైపోతాయి!!

అజిత్‌ పవార్‌
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిన, ప్రస్తుతం ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఉన్న తొమ్మిది మంది ఎన్‌సిపి మంత్రుల్లో ముగ్గురు ఇ.డి విచారణలు ఎదుర్కొన్నవారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అజిత్‌ పవార్‌, మంత్రులు ఛగన్‌ భుజబల్‌, హసన్‌ ముష్రిఫ్‌లు ఇ.డి కి భయపడి ఏకంగా రూటే మార్చేశారు.
అజిత్‌ పవార్‌ గతంలో విదర్భ నీటిపారుదల అభివృద్ధి పథకం ఛైర్మన్‌గా ఉన్నప్పుడు మహారాష్ట్ర స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ మంజూరు చేసిన రుణాలలో అవకతవకలు, నీటిపారుదల పథకాలలో అవకతవకల ఆరోపణలపై ‘ఆర్థిక నేరాల విభాగం’ విచారణను ఎదుర్కొన్నారు. దీని ఆధారంగా మనీ లాండరింగ్‌కి సంబంధించి దర్యాప్తు చేసేందుకు ఇ.డి కూడా కేసు నమోదు చేసింది. ఇ.డి ఛార్జిషీట్‌లో అజిత్‌ పాత్రను వివరంగా ప్రస్తావించారు. అయితే అజిత్‌ బిజెపి ప్రభుత్వంలో భాగమైన తర్వాత, కేసు గురించి అంతటా మౌనమే.

బిఎస్‌ ఎడియూరప్ప
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత బిఎస్‌ ఎడియూరప్పపై భూ, మైనింగ్‌ అవినీతి కేసులు ఉన్నాయి. అవినీతిని రుజువు చేసే డైరీలను స్వాధీనం చేసుకున్నారు. బిజెపి నేతలు, న్యాయమూర్తులు, లాయర్లకు ముడుపులు ముట్టజెప్పినట్లు వెల్లడైనప్పటికీ చెప్పుకోదగ్గ విచారణ జరగలేదు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన ఆధారాలు సేకరించకుండానే కేసు నుంచి తప్పించేందుకు సిబిఐ ప్రయత్నించింది.

జ్యోతిరాదిత్య సింధియా
జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్న సమయంలో భూమి విక్రయం సందర్భంగా నకిలీ పత్రాలను సృష్టించారని మధ్యప్రదేశ్‌ ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఇ.డి కూడా ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి బిజెపిలో చేరడంతో సింధియా కేసు మూతపడింది.

సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్‌ను కుదిపేసిన శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో నిందితుడు సువేందు. శారద చిట్టీ మోసం కేసు తృణమూల్‌ కాంగ్రెస్‌పై బిజెపి ప్రధాన అస్త్రంగా వుంది. అయితే సువేందు బిజెపిలో చేరడంతో విచారణ ఆగిపోయింది. ప్రస్తుతం సువేందు అధికారి ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష బిజెపి నేతగా వున్నారు.

హిమంత బిశ్వ శర్మ
అసోంలో అగ్రగామి కాంగ్రెస్‌ నేతగా ఉన్న హిమంత బిశ్వ శర్మపై ‘నీటి కుంభకోణం’ ఆరోపణలు చేస్తూ బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. కేంద్ర ఏజెన్సీలు విచారణ ప్రారంభించాయి. శర్మ అవినీతిపై బిజెపి ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించింది. అయితే బిజెపిలో చేరాక ఆ అవినీతి అంతా మాయమైపోయింది.
ముకుల్‌ రారు
శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ నేత ముకుల్‌ రారు నిందితుడు. బెంగాల్‌లో రారు అతి పెద్ద అవినీతిపరుడని బిజెపి పేర్కొంది. శారద చిట్‌ఫండ్‌ స్కామ్‌, నారద స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో ప్రమేయం ఉందంది. డబ్బును తీసుకుంటున్న వీడియోను సిబిఐ సంపాదించింది. అయితే, 2017 నవంబర్‌లో ఆయన బిజెపిలో చేరిన తర్వాత కేసు దర్యాప్తు అంతా ఆగిపోయింది.

నారాయణ్‌ రాణే
రాణే తన రాజకీయ జీవితాన్ని శివసేనలో ప్రారంభించి, కాంగ్రెస్‌ ప్రతినిధిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అవినీతి, మనీలాండరింగ్‌ సహా నాలుగు కేసుల్లో ఇ.డి, సిబిఐ దర్యాప్తు ప్రారంభించాయి. 2019లో అరెస్ట్‌ దిశగా పనులు జరుగుతున్నాయని తెలియగానే రాణే బిజెపిలో చేరారు. ఆ తర్వాత కేసు విచారణ ముగిసింది.

పెమా ఖండూ
బిజెపిలో చేరక ముందు అరుణాచల్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూపై అవినీతి ఆరోపణలు, నేరపూరిత కుట్ర కేసులు నిరంతరం వెల్లువెత్తాయి. అయితే బిజెపిలో చేరిన తర్వాత అదంతా రద్దయింది. ప్రస్తుతం ఆయన బిజెపి నాయకుడు, అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి.

ప్రఫుల్‌ పటేల్‌
ప్రఫుల్‌ పటేల్‌ ఎన్‌సిపి నాయకుడు. శరద్‌ పవార్‌కు అత్యంత నమ్మకస్తుడు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎయిరిండియాకు విమానాల కొనుగోలుకు సంబంధించి జరిగిన అవినీతి కేసును సిబిఐ చేపట్టింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పటేల్‌…బిజెపికి సన్నిహితుడైన ఎన్‌సిపి అజిత్‌ పవార్‌ వైపు చేరడంతో కేసు దర్యాప్తు ఆగిపోయింది.

శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత చౌహాన్‌ దేశం ఇంత వరకు చూడని అతి పెద్ద ప్రవేశ పరీక్షల కుంభకోణం వ్యాపమ్‌ స్కాంలో ఇరుక్కున్నారు. అయితే విచారణలో అవినీతిని బయటపెట్టిన వారు, సాక్షులు మిస్టరీగా మరణించారు. ఆ తర్వాత ఆధారాలు లేకపోవడంతో 2017లో సిబిఐ క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

రమేష్‌ పోఖ్రియాల్‌
ఉత్తరాఖండ్‌ బిజెపి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన రెండు భారీ అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు. ఒకటి భూమికి సంబంధించినది. మరొకటి హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులకు సంబంధించినది. వివిధ అవినీతి కేసులతో కొట్టుమిట్టాడుతున్న ఆయన పాలన ప్రతిష్ట ఎంత దారుణంగా వుందంటే…2011లో బిజెపి ఆయనను బలవంతంగా రాజీనామా చేయించింది. అయితే సిబిఐ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసు పెట్టేందుకు సిద్ధంగా లేవు. ప్రస్తుతం ఆయన కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్నారు.

– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️