వంటా-వార్పు, భిక్షాటనతో నిరసన

  • 8వ రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

ప్రజాశక్తి- యంత్రాంగం : సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అంగన్‌వాడీల నిరవధిక సమ్మె ఎనిమిదో రోజూ కొనసాగింది. మంగళవారం నాడు కలెక్టరేట్లు, తహశీల్దార్‌ కార్యాలయాలు, ఎంపిడిఒ కార్యాలయాలు, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించి అక్కడే భోజనాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగించారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టడానికి అధికారులు కొన్నిచోట్ల ప్రయత్నించగా వారిని స్థానికులు, అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. అనంతపురం కలెక్టరేట్‌, శ్రీసత్యసాయి చిలమత్తూరు, గాండ్లపెంట, సోమందేపల్లి తదితర ప్రాంతాల్లో వంటా-వార్పుతో అంగన్‌వాడీలు నిరసన తెలిపారు.

గుంతకల్లులో కళ్లకు నల్లరిబ్బను కట్టుకుని గాడిదకు వినతిపత్రం అందజేశారు. రాయదుర్గంలో మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఒంటి కాలిపై నిలబడ్డారు. నంద్యాల జిల్లా నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, మిడూతరు, పగిడ్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె మండల కేంద్రాల్లో తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట వంటా-వార్పు చేపట్టారు. సున్నిపెంటలో రాస్తారోకో నిర్వహించారు. చాగలమర్రిలో భిక్షాటనతో నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట బైటాయించారు. ఎక్కడికక్కడే వంటా-వార్పు నిర్వహించారు. వేంపల్లె భిక్షాటన, జమ్మలమడుగులో పొర్లుదండాలతో నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లాలో పలు అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికుల ప్రతిఘటన ఎదురవ్వడంతో వెనక్కి తగ్గారు. ప్రకాశం జిల్లా కనిగిరి, మద్దిపాడు, దర్శి, వెలిగండ్ల, బాపట్ల జిల్లా రేపల్లె, అద్దంకిలో వంటావార్పు నిర్వహించారు. పర్చూరులో చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. నిజాంపట్నంలో భిక్షాటన చేశారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద, పల్నాడు జిల్లా చిలకలూరిపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి సమ్మె శిబిరాల్లో వంటా-వార్పు నిర్వహించి అక్కడే భోజనాలు చేశారు. తుళ్లూరు, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట, వినుకొండలో భిక్షాటనతో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం, మచిలీపట్నం, మొవ్వ, అవనిగడ్డ, కంకిపాడు తదితర మండలాల్లో వంటావార్పు నిర్వహించారు. భిక్షాటన చేశారు. ఏలూరు జిల్లా ఏలూరు, చింతలపూడి, టి.నర్సాపురం, కొయ్యలగూడెం, నిడమర్రు, జీలుగుమిల్లి, నూజివీడు, జంగారెడ్డిగూడెం, మండవల్లి, ఆగిరిపల్లి, ఉంగుటూరు, ముసునూరు, భీమడోలు, బుట్టాయగూడెం, కలిదిండి, పోలవరం, పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, ఆచంట (పెనుమంట్ర), పోడూరు, పాలకొల్లు, మొగల్తూరులో భిక్షాటనతో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద నిర్వహిస్తున్న సమ్మెకు పలు గ్రామాల సర్పంచులు మద్దతు తెలిపారు. రాజమహేంద్రవరం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చెవిలో పూలు పెట్టుకుని అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా వంటా-వార్పు, కిర్లంపూడిలో అంగన్‌వాడీలు భిక్షాటన చేశారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం దిబ్బిడి అంగన్‌వాడీ కేంద్రం తాళం పగలగొట్టడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఎస్‌.రాయవరంలో ధర్నా నిర్వహించారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి, చింతూరు, విఆర్‌.పురం, కొయ్యూరు కేంద్రాల్లో భిక్షాటన నిర్వహించారు. విఆర్‌.పురం మండలం చిన్నమట్టపల్లి అంగన్‌వాడీ సెంటర్‌ తాళాలు తీయడానికి సచివాలయ సిబ్బంది ప్రయత్నించగా ఎంపిటిసి సభ్యులు పూనెం ప్రదీప్‌కుమార్‌ ఆధ్వర్యాన స్థానికులు అడ్డుకున్నారు. కూనవరం మండలం బెస్త బజార్‌ అంగన్‌వాడీ సెంటర్‌ తాళాలు బద్ధలు కొట్టి సరుకులు అంచనా వేస్తున్న ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌, పంచాయతీ సిబ్బందిని అంగన్‌వాడీలు నిలదీశారు. విశాఖ జిల్లా ఆనందపురంలో ఒంటికాలిపై నిలబడి భిక్షాటన చేశారు. విజయనగరం కలెక్టరేట్‌ సమ్మె శిబిరంలో పలువురు తల్లులు తమ పిల్లలతో కలిసి పాల్గొన్నారు. ‘జగన్‌ మామా మా ఆయమ్మకు జీతం పెంచండి’ మా టీచర్ల కోర్కెలు తీర్చండి’ అంటూ చిన్నారులు పలకలపై రాసి ప్రదర్శించారు. జామి, గజపతినగరం, రామభద్రపురంలో అంగన్‌వాడీలు భిక్షాటన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వంటావార్పుతో నిరసన తెలిపారు. శ్రీకాకుళం, పొందూరు, బూర్జ, టెక్కలిలో వంటా-వార్పు, ఎచ్చెర్లలో మానవహారం నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఐసిడిఎస్‌ అధికారులు, సచివాలయ సిబ్బంది బలవం తంగా అంగన్‌వాడీ కేంద్రాలను తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా ప్రజల సాయంతో అంగన్‌వాడీలు అడ్డుకుంటున్నారు.

అంగన్‌వాడీకి అస్వస్థత, హెల్పర్‌కు గుండెపోటు

తిరుపతి జిల్లా రేణిగుంటలో అంగన్‌వాడీ హెల్పర్‌ సరోజమ్మ (55) గుండెపోటుకు గురయ్యారు. ఆమె పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రం తాళాలను సచివాలయ అధికారులు పగలగొట్టడంతో ఈ విషయం తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 108కు ఫోన్‌ చేయగా, అర్ధగంట తరువాత వస్తామని చెప్పడంతో, ఆటోలో ఆమెను ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ తీరు వల్ల తీవ్ర మనస్తాపంతో ఏలూరు ముసునూరు మండలం అన్నపనేనివారిగూడేనికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త నాగమణి అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. సహచరులు ఆమెను పిహెచ్‌సికి తీసుకెళ్లారు. బిపి బాగా పెరిగిందని వైద్యులు నిర్ధారించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరుకు, అక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వాస్పతికి తరలించారు.

విజయవాడలోకార్మిక సంఘాల ధర్నా

విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీల ఎనిమిదో రోజు సమ్మె శిబిరాన్ని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఎ.గఫూర్‌ ప్రారంభించారు. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన లెనిన్‌ సెంటర్‌లో ధర్నా జరిగింది. అనంతరం ర్యాలీగా అంగన్‌వాడీల సమ్మె శిబిరానికి చేరుకున్నారు. గఫూర్‌, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలను చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు, రాజోలులో అంగన్‌వాడీల సమ్మె శిబిరాల్లో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి పాల్గొని మాట్లాడారు. ఎనిమిది రోజుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తోన్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం శోచనీయమన్నారు. గుండెనొప్పితో బాధపడుతున్న సరోజమ్మను ఆస్పత్రికి తరలిస్తున్న అంగన్‌వాడీ నాయకులు

➡️