రసవత్తరం ‘అనంత’ రాజకీయం

Apr 11,2024 03:20 #2024 elections, #anathapuram
  •  రెండు ప్రధాన పార్టీల్లోనూ అసంతృప్తులు

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పట్టు సాధించేందుకు టిడిపి ప్రయత్నిస్తుండగా, మరోసారి గత ఫలితాలను పునరావృతం చేయాలని వైసిపి ప్రయత్నిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఫ్యాన్‌ గాలి జిల్లాలో బలంగా వీచింది. ఎప్పుడూ లేని విధంగా టిడిపి చావు దెబ్బతింది. అనంతపురం జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఆరింటిలో వైసిపి విజయం సాధించింది. ఒక్క ఉరవకొండలోనే పయ్యావుల కేశవ్‌ టిడిపి తరుపున గెలుపొందారు. అనంతపురం పార్లమెంటు స్థానంలోనూ వైసిపి విజయం సాధించింది. అదే ఫలితాలను ఈసారి పునరావృతంచేయాలని వైసిపి పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్టుగా అభ్యర్థుల ఖరారులోనూ అనేక మార్పులు చేపట్టింది. టిడిపి కూడా అందుకు అనుగుణంగా అభ్యర్థుల్లో మార్పులు చేపటట్టింది.

వైసిపిలో మార్పులు.. అసమ్మతులు..
అనంతపురం జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే మూడు నియోజకవర్గాల్లో మార్పులు చేపట్టింది. రాయదుర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డికి కాదని ఎపిఐఐసి ఛైర్మన్‌ మొట్టు గోవిందరెడ్డికి టిక్కెట్టు ఇచ్చింది. ఇక్కెట్టుకు దక్కకపోవడంతో కాపు రాచంద్రారెడ్డి బిజెపిలో చేరారు. ఇప్పుడు టిడిపి అభ్యర్థి కాలువ శ్రీనివాసులుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కళ్యాణదుర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఉషచరణ్‌ శ్రీని పెనుకొండ అసెంబ్లీకి మార్చారు. అనంతపురం ఎంపిగానున్న తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపింది. శింగనమల నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి కాదని వీరాంజినేయులుకు ఇచ్చారు. సామాన్యమైన వ్యక్తికి టిక్కెట్టు ఇచ్చినట్టు వైసిపి ప్రచారం చేసుకుంటోంది. ఆ పార్టీ నాయకులు వీరాంజినేయులను మార్పు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత అభ్యర్థులే పోటీ ఉన్న ప్రాంతాల్లో కూడా అసమ్మతి కొనసాగుతోంది. ప్రధానంగా అనంతపురం అర్బన్‌లో టిక్కెట్టు ఆశించి దక్కన నేతలు కొందరు అసంతృప్తితోనున్నారు. ఉరవకొండలో ఇదేపరిస్థితి ఉంది. వైసిపి అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి నుంచి వ్యతిరేకత ఉంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో కాంగ్రెసులో చేరారు. ప్రస్తుతం ఆయన ఉరవకొండ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

టిడిపిలో మార్పులు.. అసమ్మతులు..
తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి అభ్యర్థుల ఖరారులో కొన్ని మార్పులు చేపట్టింది. అనంతపురం అర్బన్‌కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి కాకుండా దగ్గుపాటి వెంకటప్రసాద్‌ను వ్యక్తిని బరిలో దింపింది. ఇక్కడ ప్రభాకర్‌చౌదరి నుంచి తీవ్రమైన వ్యతిరేకత దగ్గుపాటికి ఎదురవుతోంది. కళ్యాణదుర్గంలోనూ కాంట్రాక్టర్‌ అయిన అమిలినేని సురేంద్రబాబుకు ఇచ్చారు. దీంత మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా మొన్నటి వరకున్న మాదినేని ఉమామహేశ్వరనాయడు అసంతృప్తితో ఉన్నారు. మాదినేని ఉమామహేశ్వరనాయుడు టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. గుంతకల్లోనూ మాజీ ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్‌ను కాదని మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు టిక్కెట్టు కేటాయించారు. దీంతో అక్కడ జితేందర్‌గౌడ్‌ వర్గం ప్రచారానికి దూరంగా ఉంటోంది. ఇక తక్కిన నియోజకవర్గాల్లో పెద్దగా అసమ్మతుల్లేవీ లేవనే చెప్పవచ్చు. తాడిపత్రి నుంచి మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి.ప్రభాకర్‌రెడ్డి తనయుడు జెసి.అస్మిత్‌రెడ్డి బరిలో ఉండగా, రాయదుర్గం నుంచి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌ బరిలోనున్నారు.

➡️