‘సాగు’నీటి ప్రాజెక్టులు!

Dec 26,2023 10:23 #Irrigation Projects
  •  కేటాయింపులే తక్కువ
  •  ఖర్చు ఇంకా తక్కువ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. కేటాయింపులే తక్కువగా ఉంటే, దానిలోనూ చేసిన ఖర్చు ఇంకా తక్కువగా ఉంది. పోలవరం నుంచి గాలేరు నగరి, హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులు కూడా నెమ్మదిగానే సాగుతున్నాయి. ఎప్పుడో ప్రారంభమైన పథకాలు కూడా 2026 నాటికిగానీ పూర్తి చేయలేమంటూ అధికారులు తేల్చిచెబుతున్నారు. తాజాగా బడ్జెట్‌ ప్రతిపాదనల కోసం ఆర్థికశాఖకు ఇచ్చిన నివేదికలో పథకాల జాప్యంపై నీటిపారుదల శాఖ అధికారులు వివరించడం గమనార్హం.

ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు కేవలం 74 శాతం మాత్రమే పూర్తయింది. నిధుల లేమి, కాంట్రాక్టర్లను మార్పు చేయడ వంటి అంశాలు ఈ జాప్యానికి కారణంగా భావిస్తున్నారు. నిర్మించిన కొన్ని గేట్లు కూడా కొట్టుకుపోవడం, మరమ్మతులకు లోనుకావడం వంటివి కూడా జాప్యానికి కారణమవుతున్నాయి. అలాగే ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ముందుగా పునరావాసాన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే అనేక అడ్డంకుల కారణంగా ఇప్పటివరకు సహాయ పునరావాసం కేవలం 22.42 శాతం మాత్రమే జరిగింది. దీంతో మరో రెండు మూడేళ్లకుగానీ పోలవరం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.

ఇక ఉత్తరాంధ్ర జిల్లాల ప్రయోజనాల కోసం ప్రతిపాదించిన బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కూడా వేగంగా అడుగులు వేయడం లేదు. ఇది పూర్తయితే మూడు జిల్లాల్లోని ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందుతుంది. పూలసుబ్బయ్య వెలిగొండ పథకంపైనా ఇప్పటికీ కట్టుబడే ఉన్నామంటూ ఆ శాఖ అధికారులు చెబుతుండడం విశేషం.

మరో కీలకమైన గాలేరు నగరి, హంద్రీనీవా పథకాలు కూడా ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గాలేరు నగరి ఫేజ్‌-1 పనులు 95 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ మిగిలిన ఐదు శాతం పనులను పూర్తి చేసేందుకు 2025 మార్చి పడుతుందని అంటున్నారు.

ఫేజ్‌-2 పనులు 63.56 శాతం పూర్తికాగా, మొత్తం పనులు 2026 మార్చికి పూర్తిచేసేందుకు ప్రణాలిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హంద్రీనీవా పేజ్‌-1 పనులు 94 శాతం, పేజ్‌-2 పనులు 82 శాతం పూర్తికాగా, వాటికి 2025, 2026 సంవత్సరాల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పడం గమనార్హం.

➡️