సైన్స్‌ మాసోత్సవం

Jan 28,2024 07:16 #Science
science month celebrations

వివిధ దినోత్సవాల సందర్భంగా ఆయా ప్రభుత్వాలు వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తుంటాయి. ఇందులో భాగంగా ప్రజలలో చైతన్యం పెంచడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మత సంబంధిత కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటి గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. సాధారణంగా ప్రజల్లో కూడా మత క్రతువుల పట్ల ఆసక్తి వుంటుంది. అయితే మన దేశంలో వివిధ పండుగలకు ఇచ్చిన ప్రాధాన్యత సైన్స్‌ విషయాలకు ఇవ్వడం లేదు. ప్రజలలో రోజురోజుకు మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రతి ఏటా దేశంలో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌ దినోత్సవం జరుపుతారు. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే సైన్స్‌ పరిశోధనలు గురించి మాట్లాడుకుంటే సరిపోదు. ఫిబ్రవరి నెలను సైన్స్‌ మాసోత్సవంగా ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాలి. నెలంతా దేశ వ్యాప్తంగా సైన్స్‌ అవగాహన కార్యక్రమాలు చేయాలి. విశ్వవిద్యాలయాలలో సైన్స్‌ సెమినార్లు నిర్వహించాలి. సైన్స్‌ అభివృద్ధికి కృషి చేసిన మహనీయులను నేటి తరానికి పరిచయం చేయాలి. ఇటీవల ఐ.ఐ.ఐ.టి, హైదరాబాద్‌ ఆస్క్‌-ఆర్‌ సి టీ ఎస్‌ అనే యాప్‌ను సైన్స్‌ సందేహాల నివృత్తికి రూపకల్పన చేసింది. ఎటువంటి నెట్‌ సదుపాయం లేకుండానే ఒక్క ఫోన్‌ కాల్‌తో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇటువంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు దేశంలో విశ్వవిద్యాలయాలు గొప్ప పరిశోధనా కేంద్రాలుగా విరాజిల్లాయి. ఇప్పుడు సరైన బోధనా సిబ్బంది లేక వాటి ప్రాముఖ్యతను క్రమంగా కోల్పోతున్నాయి. సైన్స్‌ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా సైన్స్‌ అవగాహన కార్యక్రమాలు చేయాలి. సైన్స్‌ విషయాలను ప్రచారం చేసే జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలను ప్రోత్సహించాలి.అదే విధంగా మాహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూఢ నమ్మకాల నియంత్రణ చట్టాలను తీసుకురావాలి. సైన్స్‌ పరిశోధన చేసే విద్యార్థులకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సైన్స్‌ పరిశోధనల గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయాలి. అప్పుడే దేశంలో సైన్స్‌ ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుంది.

– యం.రాం ప్రదీప్‌, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి,

తిరువూరు. సెల్‌: 9492712836

➡️