పదేళ్ల బ్యాంకింగ్‌ సంస్కరణలు- శ్రమదోపిడీకి పరాకాష్ట

ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు కేంద్రప్రభుత్వం చేసిన చట్టాల ద్వారా ఏర్పడ్డాయి. కాబట్టి కార్మిక చట్టాలను, మార్గదర్శకాలను అమలు చేయటం వాటి కనీస బాధ్యత. సమాన పనికి సమాన వేతనం చెల్లించటం చట్టరీత్య తప్పనిసరి. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకత్వంలో పెద్ద ఉద్యమాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ప్రభుత్వం 1987లో జస్టిస్‌ ఓబుల్‌ రెడ్డి కమిషన్‌ నియమించింది. మూడేళ్ల సుదీర్ఘ వాదనల తరవాత ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు చేసేపనే చేస్తున్న గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగులకు కూడా ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల జీతాలనే చెల్లించాలని తీర్పునిచ్చింది. సమాన పనికి సమాన వేతనం బ్యాంకింగ్‌ రంగంలో అమల్లోకి వచ్చింది. కానీ గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన వినాశకర బ్యాంకింగ్‌ సంస్కరణలు సమాన పనికి సమాన వేతన నిబంధనలను తల్లకిందులు చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా లాభాల సంపాదనే ప్రధాన లక్ష్యంగా మార్చిన దరిమిలా శ్రమదోపిడే బ్యాంకుల విధానంగా మారింది. డబ్బుతో వ్యాపారం చేసే సున్నిత రంగంలో ఖాతాదారులు భద్రతకోసం బ్యాంకులలో పర్మినెంట్‌ ఉద్యోగులే పనిచేయాలనే నియమం అమలయ్యేది. ఆ నియమాన్ని నీరుగారుస్తూ నిరుద్యోగులను, బ్యాంకు ఉద్యోగులను శ్రమ దోపిడీకి గురిచేస్తూ అనేక పథకాలు రూపొందాయి.
2021-2022 ఆర్థిక సంవత్సర ఫలితాలను ప్రకటిస్తూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌, ప్రయివేటు బ్యాంకులతో పోటీపడి లాభాలు సంపాదిస్తున్నా ఖర్చు – ఆదాయనిష్పత్తి (కాస్ట్‌ టు ఇన్కమ్‌ రేషియో) ఎక్కువగా ఉండటం వలన స్టేట్‌ బ్యాంక్‌ నికర లాభాలు తక్కువగా ఉన్నాయని పత్రికా సమావేశంలో చెప్పారు. అంటే ఖర్చు తగ్గించుకోవాలని ఆయన తాత్పర్యం. ఆరోజు తెలియదు అది నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతుందని. మూడు నెల్ల తర్వాత ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆపరేషన్స్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌’ (ఎస్‌బిఓఎస్‌ఎస్‌) అనే అవుట్‌సోర్సింగ్‌ కంపెనీని స్వంతగా (రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతితో) స్థాపించింది. స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న శాఖలు నడపటానికి కావలసిన కాంట్రాక్టు ఉద్యోగులను ఎంపిక చేయటం ఆ కంపెనీ ఉద్దేశ్యం. స్టేట్‌ బ్యాంక్‌లో పనిచేసే పర్మినెంట్‌ ఉద్యోగుల జీతాలు వారికి వర్తించవు.
అప్పటికే రిజర్వ్‌బ్యాంక్‌ బిజినెస్‌ కరస్పాండెంట్లనే స్కీమ్‌ రూపొందించింది. ఖాతాదారుల నుంచి డబ్బు జమచేసు కోవటం, ఖాతా నుండి డబ్బు ఇవ్వటం, డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌ ఇవ్వటం, చెక్కులు ఖాతాలో జమ చేయటం లాంటి పర్మినెంట్‌ ఉద్యోగులే చేసే అనేక పనులు వీళ్లూ చేస్తారు. అన్ని బ్యాంకులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్కొక్క బ్యాంక్‌లో ఒక్కొక్క విధమైన జీతాలు. చేసిన వ్యాపారం మీద కమీషన్‌, లేక కొంత నిర్దిష్ట కమీషన్‌ కొంత జీతం. కొన్ని బ్యాంకులలో బ్యాంక్‌ శాఖల నుంచి, కొన్ని బ్యాంకులలో నిర్దిష్టమైన ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారు. సెంట్రల్‌ బ్యాంకులో మన రాష్ట్రంలో నెల రోజులు పనిచేసి రూ.రెండు వేల అతి తక్కువ ఆదాయంతో, కొంతమంది రూ.6 వేలు, రూ.10 వేల లోపు సంపాదనతో బిజినెస్‌ కరస్పాండెంట్‌ గా పనిచేస్తున్నారు. కొన్ని బ్యాంకులలో మాత్రమే నిర్దిష్ట జీతాలు ఉన్నాయి. ఈవిధంగా అరకొర జీతాలతో బ్యాంకులలో 35 లక్షల మంది బిజినెస్‌ కరస్పాండెంట్లున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు 15 లక్షల మంది. అంటే ఉద్యోగుల సంఖ్య కంటే రెట్టింపు పైగా బిజినెస్‌ కరస్పాండెంట్లున్నారన్న మాట. ఇంతేనా? ఇంకా నిర్ఘాంత పోయే రూపాలలో శ్రమదోపిడీ బ్యాంకులను ఏలుతుంది. గత పదేండ్లకాలంలో బ్యాంకుల వ్యాపారం 270 శాతం పెరిగింది. పెరిగిన వ్యాపారానికి తగిన రిక్రూట్మెంట్‌ జరగలేదు సరికదా పదవీ విరమణ వలన, ఉద్యోగుల మరణం, పర్మినెంట్‌ ఉద్యోగాల్లో ఏర్పడిన ఖాళీలలో కూడా రిక్రూట్మెంట్‌ జరగలేదు. ఉన్న ఉద్యోగుల మీద పనిభారం చెప్పలేనంతగా పెరిగింది. శాఖలు నడపలేని స్థితిలో టెంపరరీ, క్యాజువల్‌, కాంట్రాక్టు ఉద్యోగులను నియమిస్తూ వస్తున్నారు. ఇన్‌స్పెక్షన్‌, రుణాల మంజూరు, రికవరీ, క్రెడిట్‌ కార్డు వ్యాపారం, ఏటీఎంలలో క్యాష్‌ పెట్టటం, క్యాష్‌ శాఖలకు సరఫరా చెయ్యటం, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ స్థాయివరకు, ఒకటేమిటి అన్ని విభాగాలలో అన్ని క్యాడర్లలో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. సుమారు లక్షన్నర మంది పర్మినెంట్‌ ఉద్యోగాలలో టెంపరరీ క్యాజువల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లందరినీ పర్మినెంట్‌ చేయాలని ఏండ్ల తరబడి ఉద్యమాలు జరుగుతున్నా ప్రయోజనం లేదు. సమాన పర్మినెంట్‌ ఉద్యోగాలలో పనికి సమాన వేతనం మచ్చుకైనా మిగల్లేదు.

ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️