ఆ ప్రాంత ప్రజానీకం తీర్పు రాష్ట్ర ప్రజల నాడికి దర్పణం..

  • గత 40 ఏళ్లుగా అక్కడ గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికారం
  •  కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అటు సినిమా అయినా, ఇటు రాజకీయమైనా ఆ ప్రాంత వాసులు ఆదరిస్తే అది పక్కా హిట్‌. గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయానికైనా, సినిమాకైనా అక్కడి ప్రజానీకం ఇస్తున్న తీర్పే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిబింబిస్తూ వస్తోంది. అక్కడి ప్రజల నాడే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల నాడికి దర్పణంగా నిలుస్తూ ఉంటోంది. ఏదైనా ఒక కొత్త సినిమా విడుదల అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడి ప్రజల రెస్పాన్స్‌నే మొదటిగా తీసుకుని ఆ సినిమా హిట్టా? ఫట్టా? అని నిర్ణయించేవారు. ఈ మల్టీఫ్లెక్స్‌లు, శాటిలైట్‌ స్క్రీనింగ్‌ రాకముందు వరకూ ఇక్కడి ప్రేక్షకుల ఆదరణనే పరిగణనలోకి తీసుకునేవారు. ఇక రాజకీయపరంగానూ ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టే రాజ్యాధికారం నిర్ణయమతుందంటే ఎటువంటి సందేహం లేదు. అంతటి విశిష్ట లక్షణం కలిగిన ప్రాంతమే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం-పెడన ఏరియా. పేరుకు రెండు నియోజకవర్గాలు అయినప్పటికీ, ఈ రెండు ప్రాంతాలు అటు భౌగోళికంగా, ఇటు సాంస్కృతికంగా, చారిత్రకంగా, చైతన్యపరంగా ఒకటే. అందుకే ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. 1983లో టిడిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు ఇచ్చిన తీర్పులో ఎటువంటి బేధమూ కనపడదు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మల్లేశ్వరం నియోజకవర్గం పెడన నియోజకవర్గంగా మార్పు చెందింది. ఇక్కడి ప్రజలు ఆయా నియోజకవర్గాల్లో టిడిపిని గెలిపిస్తే.. రాష్ట్రంలో టిడిపి అధికారం చేజెక్కించుకుంటుంది. కాంగ్రెస్‌ను గెలిపించినా లేదా వైసిపిని గెలిపించినా రాష్ట్ర వ్యాప్తంగా వాటి ప్రభంజనమే ఉంటుంది.
అందరిదీ ఒకటే అభిప్రాయం
మచిలీపట్నం, పెడన నియోజకవర్గంలో ఎక్కువగా ఉండే ఓట్లు కాపులు (ఒసి), గౌడ, మత్స్యకార, ఎస్‌సి. వీరితోపాటు యాదవ, వైశ్యులు, ముస్లిములు, ముదిరాజ్‌, దేవాంగ, పద్మశాలి ఓట్లూ అధికంగానే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఒక్క సామాజిక వర్గం అనే డామినేషన్‌ లేకుండా అన్ని తరగతుల ప్రజలూ ఉన్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీలు నిలబెట్టే అభ్యర్థులు ప్రధానంగా కాపులు, బిసిలు. మచిలీపట్నంలో కాపులు-మత్స్యకారుల అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుండగా, పెడనలో కాపు-గౌడ సామాజిక తరగతులకు చెందిన అభ్యర్థుల మధ్య పోటీ ఉంటోంది. మరోవైపు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం చేతివృత్తిదారులు, రోజువారీ కూలీలు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు ఇచ్చే తీర్పే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లోనూ ఇక్కడ విజయకేతనం ఎగురవేయాలని టిడిపి-వైసిపి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

➡️