నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువతరం

Mar 6,2024 10:20 #Unemployment, #youths

 నిరుద్యోగం, ధరాఘాతం, ద్రవ్యోల్బణంపై ఆందోళన

మత సంబంధాల్లో పురోగతిపైనా పెదవి విరుపు

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గత సంవత్సరం డిసెంబరులో నిర్వహించిన యూగవ్‌-మింట్‌-సీపీఆర్‌ మిల్లెనియల్‌ సర్వే యువతలో నెలకొన్న నిరాశా నిస్పృహలకు అద్దం పట్టింది. రాబోయే ఐదు సంవత్సరాల్లో యువతకు మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయని 43% మంది ఆశాభావంతో ఉండగా 57% మంది మాత్రం తమకు ఆలాంటి నమ్మకం ఏమీ లేదని పెదవి విరిచారు. దేశంలో మతపరమైన సంబంధాలు మెరుగుపడతాయని 31% మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేస్తామని 79% మంది గట్టిగా చెప్పడం మంచి సంకేతంగా భావించవచ్చు. ముఖ్యంగా 1996 తర్వాత జన్మించిన వారు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వయసు వారిలో 75% మంది తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు. 1981కి ముందు జన్మించిన వారిలో ఈ శాతం 85గా ఉండడం గమనార్హం. దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలకు రాబోయే ఐదు సంవత్సరాల్లో పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం తమకు లేదని ప్రజలు తేల్చి చెప్పారు. ‘దేశంలో రాబోయే ఐదేండ్లలో హిందూ, ముస్లింల మధ్య మత సంబంధాలు మెరుగుపడతాయని 31% కంటే ఎక్కువ మంది భావించడం లేదు. సంబంధాలు మెరుగుపడతాయని అనుకుంటున్న వారిలో హిందువులు 31% మంది ఉండగా ముస్లింలు 42% మంది ఉండడం గమనార్హం. పేదరికం తగ్గుతుందని కేవలం 38% మంది మాత్రమే నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిచినప్పటికీ 2029 నాటికి యువతకు మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయని 43% మంది చెబుతుంటే 57% మంది అలాంటి ఆశలేవీ లేవని అంటున్నారు. ప్రపంచంలోని మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్‌ చేరుతుందని 48% మంది భావిస్తున్నారు’ అని సర్వే తెలిపింది. దేశం ఎదుర్కొంటున్న మూడు అతి పెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఒకటని 49% మంది అభిప్రాయపడ్డారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అయితే 54% మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. 40% మందికి ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలుగా కన్పించాయి. అవినీతి, మహిళల భద్రత సమస్యలను 34% మంది ప్రస్తావించారు. దేశంలోని 200 నగరాలు, పట్టణాలకు చెందిన 12,544 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 84% మంది 21 శతాబ్దం ప్రారంభం నాటికి యుక్త వయసుకు చేరుకున్న వారే.

➡️