ముంబైలో దుమ్ము తుఫాన్‌..

May 14,2024 08:16 #Dust Storm, #Heavy rain, #Mumbai

ఆకస్మిక మార్పులతో స్తంభించిన ట్రాఫిక్‌
ముంబై : ముంబైలో సోమవారం మధ్యాహ్నం భారీ ఎత్తున దుమ్ము తుఫాన్‌ సంభవించింది. ఆకస్మికంగా ఆకాశం నల్లగా మారిపోవడంతోపాటు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. అరే, అందేరి ఈస్ట్‌ మెట్రో స్టేషన్ల మధ్య బ్యానర్‌ విరిగిపడటంతో మెట్రో సేవలను నిలిపివేసినట్లు మెట్రో రైల్వే ప్రతినిధి తెలిపారు. పత్రా షేడ్‌ (రూఫింగ్‌ షీట్‌) పడిపోవడంతో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బిఎంసి అధికారులు చెప్పారు. ముంబైలో పెట్రోలు బంక్‌ వద్ద హోర్డింగ్‌ కూలడంతో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో 35 మంది ఘటకోపర్‌లోని జాజవాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వాతావరణంలో ఆకస్మికంగా వచ్చిన మార్పులతో.. నగరంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఘాట్‌కోపర్‌, బంద్రా కుర్లా, ధారావి ప్రాంతాల్లో వాతావరణం భీకరంగా మారింది. పాల్గర్‌, థానే ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆ ప్రాంతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో భీకర గాలుల వల్ల చెట్లు నేలకూలాయి. ఆరోలి సెక్టర్‌ 5 ఏరియాలో ఉన్న రోడ్డుపై ఓ భారీ వృక్షం పడిపోయింది. దీని వల్ల అక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

➡️