అరకులో ముక్కోణపు పోటీ

Apr 18,2024 03:15 #2024 elections, #Araku, #cpm
  • బిజెపిపై ఆదివాసీల్లో తీవ్ర వ్యతిరేకత
  •  వైసిపి క్యాండేట్‌ రాజకీయాలకు కొత్త
  •  సిపిఎం అభ్యర్థికి ప్రజల్లో ఆదరణ

ప్రజాశక్తి – పాడేరు, అరకులోయ, రంపచోడవరం విలేకరులు : అరకు పార్లమెంటు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. వైసిపి, బిజెపి, సిపిఎం అభ్యర్థుల మధ్య జరిగే పార్లమెంటు పోరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం ఎస్‌టిలకు రిజర్వు చేయబడింది. దీనిలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడి ఉన్న ఈ ఎంపి నియోజకవర్గం భౌగోళికంగా చాలా పెద్దది. ఇక అభ్యర్థుల విషయానికొస్తే.. వైసిపి ఎంపి అభ్యర్థిగా గుమ్మ తనూజరాణి, బిజెపి అభ్యర్థిగా కొత్తపల్లి గీత, సిపిఎం అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స బరిలో ఉన్నారు. టిడిపి, జనసేన బిజెపి కూటమి నుంచి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతపై గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె గిరిజనేతరురాలు అని, అవినీతిపరురాలు అని ఆదివాసీల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఒక దఫా ఎంపిగా ఎన్నికై తమను పట్టించుకోలేదన్న విమర్శలు ఆమెపై ఉన్నాయి. వైసిపి నుంచి అరకు ప్రస్తుత ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కోడలు డాక్టర్‌ గుమ్మ తనూజరాణి బరిలో ఉన్నారు. ఆమె రాజకీయాలకు పూర్తిగా కొత్త. సిపిఎం అభ్యర్థిగా బరిలో ఉన్న పి అప్పలనర్స ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. విద్యార్థి దశ నుంచీ ఆయన ఉద్యమాల్లో ఉండటంతో ఈ ప్రాంతంలో ఆయనంటే తెలియనివారు లేరు. గిరిజన హక్కులపై ఆయన గట్టిగా గళమెత్తుతారన్న నమ్మకం ఆదివాసీల్లో ఉంది.

అల్లూరి జిల్లాలో…
అల్లూరి జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గతంలో వీటిని వైసిపి కైవసం చేసుకుంది. ప్రస్తుతం అరకు అసెంబ్లీ నుంచి వైసిపి అభ్యర్థిగా రేగం మత్స్యలింగం, కూటమి అభ్యర్థిగా బిజెపి నుంచి పాంగి రాజారావు బరిలో ఉన్నారు. బిజెపి అభ్యర్థికి టిడిపి శ్రేణులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. తొలుత ఈ సీటును టిడిపి ఎస్‌టి సెల్‌ రాష్ట్ర నాయకులు దొన్ను దొరకు కేటాయించారు. ఆయన రెండు నెలలు పాటు ప్రచారం కూడా చేసుకున్నారు. ఆయన్ను కాదని తాజాగా బిజెపి అభ్యర్థి పాంగి రాజారావును కూటమి తరఫున ప్రకటించారు. ఆయనకు ఎన్నికల్లో సహకరించేది లేదని టిడిపి కార్యకర్తల సమావేశంలో దొన్నుదొర, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తేల్చి చెప్పేశారు. దొన్నుదొర ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వైసిపి అభ్యర్థి రేగం మత్స్యలింగం పార్టీలో గ్రూపుల పోరుతో సతమతమవుతున్నారు. ఇండియా వేదిక తరఫున కాంగ్రెస్‌ నుంచి శెట్టి గంగాధర స్వామి బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన సివేరి అబ్రహం కూడా ప్రభావం చూపుతారు. ఆయన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు. టిడిపి టికెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.

ఇండిపెండెంటుగా గిడ్డి ఈశ్వరి..!
పాడేరు నియోజకవర్గానికి సంబంధించి వైసిపి అభ్యర్థిగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు, టిడిపి అభ్యర్థిగా కిల్లు వెంకట రమేష్‌ నాయుడు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా శతక బుల్లిబాబు పోటీ చేయనున్నారు. ఈ ముగ్గురు ముమ్మర ప్రచారంలో వారున్నారు. మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరికి టికెట్‌ దక్కకపోవడంతో ఆమె ఇండిపెండెంటుగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే కూటమి అభ్యర్థికి తలనొప్పి తప్పదు. రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా మిరియాల శిరీషా దేవిని టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆమె రాజకీయాలకు పూర్తిగా కొత్త. పార్టీ కోసం ఐదేళ్లపాటు కష్టపడిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని కాదని కొత్త వ్యక్తికి సీటు ఎలా కేటాయిస్తారని రాజేశ్వరి మద్దతుదారులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధిష్టానం ఈ టికెట్‌పై పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏదేమైనా టిడిపిలో ఒకరికి టికెట్‌ ఇచ్చి మరొకరికి ఇవ్వకుంటే సహకరించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. వైసిపి అభ్యర్థిగా సిట్టింగు ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి బరిలో ఉన్నారు. ఆమెపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్న విమర్శలు ఉన్నాయి. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఆమె ఎటువంటి కృషీ చేయకపోవడంతో ప్రచారానికి వెళ్లినప్పుడు కొన్నిచోట్ల నిరసన వ్యక్తమవుతోంది.

➡️