ఏం చేద్దాం !

  • ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ సవరణలకు సర్కారు కసరత్తు
  • న్యాయనిపుణులతో చర్చలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-2022పై భూ యజమానులు, రైతులు, న్యాయవాదుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ఎన్నికలకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉండటం, టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రజల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం ఏం చేయాలా? అని పునరాలోచనలో పడింది. ఇదిలా ఉంటే ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు)తో పాటు పలు సంస్థలు హైకోర్టులో పిల్‌ వేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రారంభ దశలోనే నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే తెలంగాణలో ‘ధరణి’ పోర్టల్‌ను ప్రతిపక్షాలు ఎన్నికల ఆయుధంగా మలచుకున్నట్లు రాష్ట్రంలో కూడా ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను ప్రచారాస్త్రంగా చేసుకుని లబ్ధి పొందుతాయేమోననే ఆందోళన పాలకపక్షంలో కనబడుతోంది. ప్రజల్లో యాక్ట్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరిగితే చాపకింద నీరులా ఓటు బ్యాంక్‌కు గండి పడే అవకాశాలు కూడా లేకపోలేదనే భయం అధికార పార్టీని వెంటాడుతోంది. ప్రభుత్వ వర్గాలు, నల్సార్‌ యూనివర్సిటీ న్యాయ నిపుణులు, లా డిపార్టుమెంట్‌లోని నిపుణులు, ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ప్రభుత్వం ప్రాథమికంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనప్పటికీ ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు చట్టంలో పలు సవరణలు తీసుకురాక తప్పదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇదే విషయంపై ఫిబ్రవరి 7న హైకోర్టులో వాయిదా ఉన్న నేపథ్యంలో హైకోర్టుకు అభ్యంతరాలపై ఏదో ఒక సమాధానం ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌లో పేర్కొన్న పలు సెక్షన్లు భూ యజమానుల పాలిట గుది బండగా మారనున్నాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినబడుతోంది. ముఖ్యంగా భూ హక్కుల చట్టంలో 69 సెక్షన్లు ఉండగా అందులో 7, 9, 13, 37, 46, 64 వివాదంతో కూడుకుని, యజమానులకు నష్టాలను కలిగించే సెక్షన్లుగా పరిగణించాలని భూయజమానుల అభిప్రాయం. రాష్ట్రంలో 535 సివిల్‌ కోర్టులు ఉన్నా అధికారులతో ఏర్పాటుచేసిన 26 రెవెన్యూ ట్రిబ్యునల్‌తో వివాదాలను పరిష్కరించడం ఎలా సాధ్యమనే అభిప్రాయం భూ యజమానులు, అడ్వకేట్స్‌ నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోంది.ఇప్పటి వరకు భూములకు సంబంధించిన సమస్యలు వచ్చిన సందర్భంలో సివిల్‌ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండేది. ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తే సివిల్‌ కోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉండదని, కేవలం హైకోర్టులో మాత్రమే అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉండటం సామాన్యులకు ఆర్థిక భారంగా మారుతుందనే ఆందోళన సన్న, చిన్నకారు రైతుల్లో నెలకొంది.

టిఆర్‌ఒగా తహశీల్దార్‌తో పాటు సబ్‌ రిజిస్ట్రార్లు

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-2022లో పేర్కొన్న విధంగా టైట్లింగ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారాలు టిఆర్‌ఒగా వ్యవహరించే తహశీల్దార్లకు కల్పిస్తోంది. ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో తహశీల్దార్‌తోపాటు సబ్‌ రిజిస్ట్రార్‌కు కూడా కల్పిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ అధికారాలు టిఆర్‌ఒగా వ్యవహరించే తహశీల్దార్లకు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ అధికారాలు సబ్‌ రిజిస్ట్రార్లతో పాటు అదనంగా మరికొందరికి టిఆర్‌ఒ అధికారాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.

➡️