టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏదీ ?

Feb 23,2024 10:18 #special story
  • ప్రతిపక్ష హోదాలో జగన్‌ హామీ
  • మూడేళ్ల తరువాత భూమిపూజ
  • ప్రారంభం కాని పనులు
  • సీమ రైతుల ఎదురుచూపులు

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేస్తామన్న టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ భూమిపూజకే పరిమితమైంది. ఈ ప్రాంతంలో టమోటా జ్యూస్‌, సాస్‌ తయారు చేసేలా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత గతేడాది స్థలాన్ని కేటాయించి, భూమిపూజ చేశారు. యూనిట్‌ ఎప్పుడు ప్రారంభమవుతోంది..ఎప్పుడు తమకు గిట్టుబాటు ధర లభిస్తుందో అని టమోటా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

కర్నూలు జిల్లాలోని పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి వెల్దుర్తి మండలాల్లో ఖరీఫ్‌లో పత్తి, టమోటా, వేరుశనగ, ఉల్లి సాగు చేస్తారు. చిత్తూరు జిల్లా మదనపల్లి టమోటా మార్కెట్‌ తర్వాత కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో అత్యధికంగా క్రయవిక్రయాలు సాగుతాయి. పత్తికొండ నుంచి తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. టమోట ఎక్కువగా సాగవ్వుతుండడంతో ఆ ప్రాంతంలో టమోటా జ్యూస్‌, సాస్‌ తయారు చేసేలా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని గతేడాది సెప్టెంబర్‌లో పత్తికొండ శివార్లలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం మూడెకరాల స్థలాన్ని కేటాయించారు. యూనిట్‌ నెలకొల్పేందుకు రూ.12.5 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. భూమిపూజ అయితే చేశారు గాని పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభమైతే తమకు కాస్తో కూస్తో మంచి ధర లభిస్తుందని ఆశిస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది.

50 కిలోలు రూ.150

ప్రస్తుతం పత్తికొండ మార్కెట్‌లో జత గంప (50 కిలోలు) టమోటా రూ.150 నుంచి రూ.300 మధ్య పలుకుతోంది. కిలోకు రూ. మూడు నుంచి రూ.ఆరు మధ్య రైతుకు ధర లభిస్తోంది. ఒక ఎకరాలో టమోటా పంట సాగు చేసేందుకు దాదాపు రూ.50వేలు వరకూ పెట్టుబడి అవుతోంది. నారుకు రూ.13 వేలు, పురుగు మందులకు రూ.6 వేలు, పిచికారీ చేయడానికి రూ.ఐదు వేలు, ఎద్దులతో గుంటలు కొట్టడానికి రూ.పది వేలు, కలుపు తీయడానికి రూ.ఐదు వేలు, టమోటాకాయలు తీయడానికి కూలీలకు రూ.నాలుగు వేలు, రవాణాకు రూ. రెండు వేల నుంచి రూ. నాలుగు వేల వరకూ ఖర్చు వస్తుంది. ఒక ఎకరాకు ఏడు కోతల వరకూ పంట వస్తుంది. కోతకు వెయ్యి కిలోల వరకూ టమోటా వస్తుంది. ఏడు కోతలకు కలిపి ఏడు వేల కిలోల వరకూ దిగుబడి వస్తుంది. కిలో రూ.3 చొప్పున వేసుకుంటే రైతుకు రూ.21 వేలు మాత్రమే వస్తోంది. దీంతో అన్నదాతలు నష్టాలను మూటగట్టుకుంటున్నారు.

నష్టాలే మిగిలాయి

             ఒక ఎకరాలో టమోటా సాగుకు రూ.50వేలు పెట్టుబడి అయ్యింది. మొత్తం నాలుగు కోతల్లో 80 గంపలు వచ్చాయి. జత గంప టమోటా రూ.230 పలికింది. మొత్తం రూ.9,200 వచ్చింది. ప్రభుత్వం టమోటా జ్యూస్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే ధర కొంచెం గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. – శివ, పెరవళి, మద్దికెర మండలం.

పనులు ప్రారంభం కావాల్సి ఉంది

టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.12.5 కోట్లను మంజూరు చేసింది. భూమి పూజ కూడా జరిగింది. ఇటీవలె టెండర్లు కూడా పూర్తయ్యాయి. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. – ఉమాదేవి, ఎపిఎంఐపి పిడి, కర్నూలు.

➡️