Supreme Court: పతంజలిపై హెచ్చరికలు ప్రకటన రంగానికి మేల్కలుపు కానున్నాయా..!

Apr 25,2024 15:18 #fmcg sector, #Patanjali, #supreem court

న్యూఢిల్లీ :   తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలిపై సుప్రీంకోర్టు హెచ్చరికలు ప్రకటనల (ఎఫ్‌ఎంసిజి) రంగానికి మేల్కలుపు కానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుప్రీంకోర్టు హెచ్చరికలపై ఎఫ్‌ఎంసిజి ఆందోళన వ్యక్తం చేసింది.  సుప్రీంకోర్టు ధృడమైన చర్యలు  రాబోయే మార్పుకి సంకేతం కానుందని కొందరు వాదిస్తున్నారు.  మార్కెట్లో పోటీని తట్టుకోవాలంటే అతిశయోక్తులతో కూడిన ప్రకటనలు ఉండటం సర్వసాధారణమని మరికొందరు వాదిస్తున్నారు.

తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో పతంజలి ఆయుర్వేద్‌ వార్తాపత్రికల్లో ప్రకటనల సైజులో క్షమాపణలను ముద్రించింది. తాజా ప్రకటనలో రామ్‌దేవ్‌, కంపెనీ సిఇఒ బాలకృష్ణ ఇద్దరూ హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు వ్యక్తిగతంగా, పతంజలి సంస్థ తరపున క్షమాపణలు తెలిపారు. మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం  రామ్‌దేవ్‌పై అసహనం  వ్యక్తం చేసింది. మైక్రోస్కోఫిక్‌ సైజులో క్షమాపణలను ప్రకటించడంపై ధ్వజమెత్తింది. వార్తాపత్రికల్లో ప్రకటించిన క్షమాపణల క్లిప్పింగ్‌లను కోర్టుకు అప్పగించాలని ఆదేశించింది. ఫోటోకాపీని ఎనలార్జ్‌ చేసి చూపుతూ… మమ్మల్ని ఆకట్టుకోనే ప్రయత్నం చేయడం కాదు. క్షమాపణలను ప్రకటనల సైజులో ముద్రించాలని జస్టిస్‌ కొహ్లీ పేర్కొన్నారు.

ఎఫ్‌ఎంసిజి రంగాన్ని కూడా హెచ్చరించిన సుప్రీం
తమ తీర్పు కేవలం పతంజలి సంస్థకే పరిమితం కాలేదని, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసిజి), ఔషధ సంస్థలు తమ ప్రకటనలతో వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అవి వినియోగదారుల ఆరోగ్యం, ఇతర అంశాలను ప్రభావితం చేయవచ్చని సూచించింది.

గతంలో వివాదాస్పదమైన కేసులు
గతంలో అనేక కేసుల్లో ముఖ్యంగా హార్లిక్స్‌ లిమిటెడ్‌ ఙర జైడస్‌ వెల్‌నెస్‌ ప్రోడక్ట్స్‌ కేసులో జైడస్‌ ప్రసారం చేసిన తప్పుడు ప్రకటనకు వ్యతిరేకంగా శాశ్వతంగా నిషేదాజ్ఞలు విధించాలని కోరింది. ఒకగ్లాస్‌ హార్లిక్స్‌, రెండు గ్లాస్‌ల జైడస్‌ ఉత్పత్తి (కాంప్లాన్‌)తో సమానమని ప్రకటనలో పేర్కొంటూ వినియోగదారులను తప్పుదారి పట్టించిందని హార్లిక్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అదే విధంగా రాజేంద్ర ఙర యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఏ వస్తువూ లేదా సేవలు అద్వితీయ, అద్భుతమైన శక్తులు ఉన్నాయంటూ విక్రయించడాన్ని బాంబే హైకోర్టు అడ్డుకుంది.

స్పందించిన ప్రకటనల సంస్థ
”అతిశయోక్తులతో కూడిన ప్రకటనలు చాలా పాతకాలం నాటివి. ప్రతి ప్రకటనలోనూ అతిశయోక్తి సర్వసాధారణం. కొన్నేళ్లుగా ప్రభుత్వం మరో మార్గం కోసం చూస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్రాండ్లను లేదా కంపెనీలను ఎంచుకోవాల్సి వుండటంతో చాలా బ్రాండ్లు పొత్తులు పెట్టుకుంటున్నాయి” అని రెడిఫ్యూషన్‌ బ్రాండ్‌ సొల్యూషన్స్‌ (ప్రకటన సంస్థ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ సందీప్‌ గోయల్‌ పేర్కొన్నారు. పతంజలిపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించడం ఇతర బ్రాండ్లకు ప్రతిబంధకం కాకపోవచ్చని గోయల్‌ అభిప్రాయపడ్డారు.

అత్యధిక ఆహార ఉత్పత్తుల ప్రకటనలను ఫస్సీ పట్టించుకోవడం లేదని, దీంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్ధేశించాలని ఆయన సూచించారు. ఇతర బ్రాండ్‌ల ప్రకటనల్లోనూ ఏది కరెక్ట్‌, వాస్తవం ఏమిటని గుర్తించాల్సి వుందన గోయల్‌ పేర్కొన్నారు. ప్రకటనల ప్రాథమిక లక్ష్యం వినియోగదారుల మెదడుల్లో బలమైన ముద్ర వేయడమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది అతిశయోక్తులతో కూడిన ప్రకటనలతోనే సాధ్యమవుతుందని వాదిస్తున్నారు. అయితే ఆహార ఉత్పత్తులు, ప్రాథమిక న్యూట్రిషన్స్‌లలో తప్పుదారి పట్టించడం వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని థర్డ్‌ ఐసైట్‌ వ్యవస్థాపకులు దేవాంగ్సు దత్తా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని లేవనెత్తడం మంచి పరిణామమమని ఆయన పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై ఎఫ్‌ఎంసిసి కూడా స్పందించింది. ప్రకటనలపై ప్రామాణిక నిబంధనలను మెరుగుపరచాల్సి వుందని పేర్కొంది. వినియోగదారుల అవగాహన, కఠినమైన ఎఎస్‌సిఐ మార్గదర్శకాలు, మార్కెటింగ్‌ను ప్రభావితం చేసే వారి ప్రభావం తదితర అంశాలపై స్పష్టమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఎఫ్‌ఎంసిజి కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. తప్పుదారి పట్టించే ప్రకటనలపై తగిన చర్యలు తీసుకునేలా భవిష్యత్తులో మరింత ప్రణాళికతో ముందుకు సాగుతుందని అన్నారు.

➡️