అవును…సీఎం పర్యటనల ఖర్చు ప్రభుత్వమే భరించింది

Feb 9,2024 11:55 #cm, #cost, #government, #visits
  • ఖజానాపై రూ.58 కోట్ల భారం
  • శాసనసభ సాక్షిగా అంగీకరించిన అసోం సర్కారు

దిస్‌పూర్‌ : ప్రభుత్వేతర కార్యక్రమాల కోసం అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హెలికాప్టర్లు, ఛార్టర్డ్‌ విమానాలు అద్దెకు తీసుకొని ప్రయాణించి ఆ వ్యయాన్ని ప్రభుత్వ ఖజానాపై రుద్దారని, దీనివల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయిందని మూడు రోజుల క్రితం క్రాస్‌కరంట్‌ అనే మీడియా సంస్థ బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సాక్షిగా ఈ ఆరోపణను అంగీకరించింది. 2021 మే 10 నుండి ఈ ఏడాది జనవరి 30వ తేదీ వరకూ ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల హెలికాప్టర్‌, విమాన ప్రయాణాల కోసం ప్రభుత్వ ఖజానా నుండి అక్షరాలా రూ.58,23.07,104 ఖర్చు చేశామని తెలిపింది. శివసాగర్‌ ఎమ్మెల్యే, రారుజోర్‌ దళ్‌ నేత అఖిల్‌ గొగోరు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. అయితే శర్మ విమాన ప్రయాణాల కోసం ఎప్పుడు, ఎంత మొత్తం చెల్లించిందీ ఆ సమాధానంలో వివరించలేదు. 2021 మే 10 నుండి 2022 డిసెంబర్‌ 31 వరకూ రూ.10,19,81,946, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.34,01,05,848 ఖర్చు చేశామని చెప్పిది. అలాగే 2023 జనవరి నుండి 2024 జనవరి వరకూ రూ.14,02,19,313 ఖర్చయిందని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో శర్మ ప్రైవేటు పర్యటనల కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చు, గత సెప్టెంబరులో ప్రభుత్వం శాసనసభలో చేసిన ప్రకటనలో తెలిపిన వ్యయం ఒకేలా ఉన్నప్పటికీ సమాచార హక్కు చట్టం కింద క్రాస్‌కరంట్‌ అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంతో మాత్రం సరిపోవడం లేదు. క్రాస్‌కరంట్‌ అనే స్వతంత్ర వార్తా సంస్థ 2022 ఆగస్ట్‌ 26న ముఖ్యమంత్రి ప్రైవేటు పర్యటనల ఖర్చులపై ఆర్‌టీఐ ద్వారా సమాధానం కోరింది. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో శర్మ హెలికాప్టర్లు, ఛార్టర్డ్‌ విమానాలు అద్దెకు తీసుకొని పార్టీ సమావేశాలతో పాటు అనేక వివాహాలకు హాజరయ్యారని ప్రభుత్వం ఇచ్చిన సమా ధానంలో బయటపడింది. అయితే సర్కారు కార్యక్రమాల కోసమే సొమ్ము చెల్లించి ఛార్టర్డ్‌ విమానాలను అద్దెకు తీసుకున్నామని గత సెప్టెంబరులో శర్మ ప్రభుత్వం శాసనసభ సాక్షిగా అబద్ధం చెప్పింది. అయితే దీనిపై తాజాగా దుమారం రేగడంతో శాసనసభలో ప్రభుత్వం వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు.

➡️