స్పిన్నర్లపైనే భారం

Feb 14,2024 22:05 #Sports

రేపటి నుంచి ఇంగ్లండ్‌తో మూడోటెస్ట్‌

ఉదయం 9.30గం||లకు

రాజ్‌కోట్‌: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారీస్కోర్‌ చేయలేకపోయాడు. దీంతో మూడో టెస్టులో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో రాజ్‌కోట్‌లో ప్రాక్టీస్‌లో బ్యాటింగ్‌పైనే దృష్టి సారించి సాధన చేశాడు. ఇన్‌స్వింగ్‌, అవుట్‌స్వింగర్‌ బంతులను ఎక్కువగా ఆడాడు. మూడో టెస్ట్‌కు టీమిండియా స్పిన్నర్లను, ఇంగ్లండ్‌ పేసర్లను నమ్ముకొని బరిలో దిగుతున్నాయి. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లోనే భారత స్పిన్నర్ల త్రయం అత్యధిక వికెట్లు తీసారు. ఇక బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌ మూడోటెస్ట్‌కు దూరమయ్యారు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఫిట్‌నెస్‌ సాధించి మూడోటెస్ట్‌కు అందుబాటులోకి రావడం శుభపరిణామం. హైదరాబాద్‌ టెస్టును ఇంగ్లండ్‌ నెగ్గగా వైజాగ్‌ టెస్టులో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. దీంతో రాజ్‌కోట్‌ వేదికగా జరిగే మూడో టెస్టు ఇరుజట్లకూ కీలకంగా మారింది. ఇద్దరు పేసర్లతో ఇంగ్లండ్‌..ఇంగ్లండ్‌ సారథి బెన్‌ స్టోక్స్‌కు వందో టెస్టుగా బరిలోకి దిగబోతున్న ఈ టెస్టులో ఇంగ్లండ్‌.. ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. వైజాగ్‌ టెస్టులో అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్‌ షోయభ్‌ బషీర్‌.. మూడో టెస్టులో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్‌.. పేసర్‌ మార్క్‌వుడ్‌ను తుదిజట్టులోకి వచ్చాడు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌.. గత రెండు టెస్టుల మాదిరిగా ముగ్గురు స్పిన్నర్లు, ఒక పేసర్‌తో కాకుండా 2ం2 ఫార్ములాతో బరిలోకి దిగబోతుండటం గమనార్హం. రాజ్‌కోట్‌ పిచ్‌ కూడా బ్యాటింగ్‌ ఫ్రెండ్లీ అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టెస్టులో తొలి మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌ ఆఖరి రెండు రోజుల్లో మాత్రం స్పిన్‌కు అనుకూలించే అవకాశాలు మెండుగా ఉంటాయి. వైజాగ్‌ టెస్టులో కూడా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. వైజాగ్‌ టెస్టులో అరంగేట్రం చేసిన బషీర్‌.. రెండు ఇన్నింగ్స్‌లలో నాలుగు వికెట్లు తీశాడు.

జట్లు(అంచనా)…

భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), బుమ్రా(వైస్‌ కెప్టెన్‌), జైస్వాల్‌, శుభ్‌మన్‌, పటీధర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధృవ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, జడేజా, అక్షర్‌, సిరాజ్‌.

ఇంగ్లండ్‌: బెన్‌ స్టోక్స్‌(కెప్టెన్‌), క్రాలే, డకెట్‌, పోప్‌, రూట్‌, బెయిర్‌స్టో, ఫోక్స్‌, రిహాన్‌ అహ్మద్‌, టామ్‌ హర్ట్లీ, మార్క్‌ వుడ్‌, అండర్సన్‌.

➡️