వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా

Australia-in-ODI-World-Cup-final

సెమీస్‌ దక్షిణాఫ్రికాపై మూడు వికెట్ల తేడాతో గెలుపు
19న భారత్‌తో టైటిల్‌కై ఢీ
కోల్‌కతా: వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరోసారి సెమీస్‌లో నిష్క్రమించింది. ఇన్నాళ్లూ ఐసిసి నిబంధనలు, వర్షం, డీఆర్‌ఎస్‌లు ఆ జట్టు ఫైనల్‌ చేరకుండా అడ్డుకుంటే… ఈసారి బ్యాటింగ్‌ వైఫల్యం, తర్వాత ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడవడంతో దక్షిణాఫ్రికాకు మరోసారి నిరాశ తప్పలేదు. మెగా టోర్నీ ఆరంభంలో భారీస్కోర్లతో, దూకుడైన బ్యాటింగ్‌, బెంబేలెత్తించే బౌలింగ్‌, కళ్లు చెదిరే ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్న సఫారీలు.. కీలకమైన నాకౌట్‌ దశలో తేలిపోయారు. బ్యాటింగ్‌లో విఫలమైనా స్పిన్నర్లు కట్టడి చేయడంతో ఒక దశలో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చినా కంగారూలు పట్టు విడవకుండా ఆడటంతో సఫారీల పోరాటం మరోసారి సెమీస్‌కే పరిమితమైంది. దీంతో ఐదుసార్లు టైటిల్‌ విజేత ఆస్ట్రేలియా జట్టు మరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో గురువారం హోరాహోరీగా జరిగిన రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 49.4 ఓవర్లలో 212పరుగులకు ఆలౌటైంది.

డేవిడ్‌ మిల్లర్‌(101) సెంచరీతో కదం తొక్కాడు. ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు 47.2 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 215పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా.. ఈనెల 19న అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌తో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు వచ్చిన కంగారూలకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. డేవిడ్‌ వార్నర్‌ 18 బంతుల్లోనే ఒక బౌండరీ, నాలుగు సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. ట్రావిస్‌ హెడ్‌ కూడా దంచికొట్టడంతో ఆసీస్‌.. 6ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. రబాడా వేసిన ఆరో ఓవర్లో వార్నర్‌ రెండు, హెడ్‌ ఒక సిక్సర్‌ బాదారు. పేసర్లు ప్రభావం చూపకపోవడంతో బవుమా ఏడో ఓవర్లోనే పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ మార్క్‌రమ్‌కు బంతినిచ్చాడు. మార్‌క్రమ్‌ తొలి బంతికే వార్నర్‌ను బౌల్డ్‌ చేయడంతో ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయిది. వార్నర్‌ స్థానంలో వచ్చిన మిచెల్‌ మార్ష్‌ పరుగుల ఖాతా తెరవకుండానే రబాడా బౌలింగ్‌లో డసెన్‌ సూపర్బ్‌ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. గెరాల్డ్‌ కొయెట్జ్‌ వేసిన 12వ ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టిన హెడ్‌.. అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కానీ హెడ్‌ను 15వ ఓవర్లో కేశవ్‌ మహారాజ్‌ బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్లో తొలి బంతికే హెడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. లబూషేన్‌ (31 బంతుల్లో 18, 2 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. కానీ షంసీ 22వ ఓవర్లో ఐదో బంతికి లబూషేన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. షంసీ తన మరుసటి ఓవర్లోనే గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (1)ను కూడా బౌల్డ్‌ చేసి సఫారీలు మ్యాచ్‌ మీద పట్టుబిగించేలా చేశాడు.

ఆఖర్లో ఉత్కంఠ..
మ్యాచ్‌ మీద దక్షిణాఫ్రికా పట్టుబిగిస్తున్న తరుణంలో స్టీవ్‌ స్మిత్‌ తన అనుభవాన్నంతా ఉపయోగించి మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. జోష్‌ ఇంగ్లిస్‌తో కలిసి ఆరో వికెట్‌కు 59 బంతుల్లో 37 పరుగులు జోడించిన స్మిత్‌.. సఫారీ స్పిన్‌ ద్వయాన్ని సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు కవ్వించే బంతులు వేసినా సంయంనం కోల్పోకుండా ఆడాడు. మరో ఎండ్‌లో జోస్‌ ఇంగ్లిస్‌ (49 బంతుల్లో 28, 3 ఫోర్లు) కూడా స్మిత్‌కు చక్కని సహకారం అందించాడు. కానీ కొయెట్జ్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అతడు వేసిన 34వ ఓవర్లో మూడో బంతికి డికాక్‌ క్యాచ్‌ పట్టడంతో స్మిత్‌ కథ ముగిసింది. స్మిత్‌ నిష్క్రమించినా ఇంగ్లిస్‌ క్రీజులో ఉండటంతో కంగారూలు ధీమాగానే ఉన్నారు. కానీ సౌతాఫ్రికా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులను అడ్డుకుంది. అదీగాక కొయెట్జ్‌ మరోసారి సఫారీలకు బ్రేక్‌ ఇచ్చాడు. అతడు వేసిన 40వ ఓవర్లో ఇంగ్లిస్‌ను బౌల్డ్‌ చేయడంతో మ్యాచ్‌ ఉత్కంఠకు దారి తీసింది. అయితే.. ఆఖర్లో మిచెల్‌ స్టార్క్‌ (38 బంతుల్లో 16 నాటౌట్‌, 2 ఫోర్లు), పాట్‌ కమిన్స్‌ (29 బంతుల్లో 14 నాటౌట్‌, 2 ఫోర్లు)లు నింపాదిగా ఆడి కంగారూల విజయాన్ని ఖరారుచేశారు. ఈ మ్యాచ్‌లో సఫారీ ఫీల్డింగ్‌ కూడా నాసిరకంగానే ఉండటం కూడా ఆ జట్టు ఓటమికి కారణమైంది. ఫీల్డింగ్‌కు నానార్థంగా ఉండే ఆ జట్టు ఆటగాళ్లు ఐదు క్యాచ్‌లు మిస్‌ చేడం గమనార్హం. అంతకుముందు ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్‌ అయింది. మిల్లర్‌ (101) సెంచరీతో ఆదుకోగా క్లాసెన్‌ (47) రాణించాడు. వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఆసీస్‌ ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 5 సార్లు విజేతగా నిలవగా, టీమిండియా రెండు పర్యాయాలు కప్‌ నెగ్గింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హెడ్‌కు లభించింది.

స్కోర్‌బోర్డు..

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి)కమిన్స్‌ (బి)హేజిల్‌వుడ్‌ 3, బవుమా (సి)ఇంగ్లిస్‌ (బి)స్టార్క్‌ 0, డుస్సెన్‌ (సి)స్టీవ్‌ స్మిత్‌ (బి)హేజిల్‌వుడ్‌ 6, మార్‌క్రమ్‌ (సి)వార్నర్‌ (బి)స్టార్క్‌ 10, క్లాసెన్‌ (బి)హెడ్‌ 47, మిల్లర్‌ (సి)హెడ్‌ (బి)కమిన్స్‌ 101, జెన్సన్‌ (ఎల్‌బి)హెడ్‌ 0, కొయిట్జ్‌ (సి)ఇంగ్లిస్‌ (బి)కమిన్స్‌ 19, మహరాజ్‌ (సి)స్మిత్‌ (బి)స్టార్క్‌ 4, రబడా (సి)మ్యాక్స్‌వెల్‌ (బి)కమిన్స్‌ 10, షాంసీ (నాటౌట్‌) 1, అదనం 11. (49.4ఓవర్లలో ఆలౌట్‌) 212పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/8, 3/22, 4/24, 5/119, 6/119, 7/172, 8/191, 9/203, 10/212
బౌలింగ్‌: స్టార్క్‌ 10-1-34-3, హేజిల్‌వుడ్‌ 8-3-12-2, కమిన్స్‌ 9.4-0-51-3, జంపా 7-0-55-0, మ్యాక్స్‌వెల్‌ 10-0-35-0, హెడ్‌ 5-0-21-2.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి)మహరాజ్‌ 62, వార్నర్‌ (బి)మార్‌క్రమ్‌ 29, మార్ష్‌ (సి)డుస్సెన్‌ (బి)రబడా 0, స్మిత్‌ (సి)డికాక్‌ (బి)కొయిట్జ్‌ 30, లబూషేన్‌ (ఎల్‌బి)షాంసీ 18, మ్యాక్స్‌వెల్‌ (బి)షాంసీ 1, ఇంగ్లిస్‌ (బి)కొయిట్జ్‌ 28, స్టార్క్‌ (నాటౌట్‌) 16, కమిన్స్‌ (నాటౌట్‌) 14, అదనం 17. (47.2ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 215పరుగులు.
వికెట్ల పతనం: 1/60, 2/61, 3/106, 4/133, 5/137, 6/174, 7/193
బౌలింగ్‌: జెన్సన్‌ 4.2-0-35-0, రబడా 6-0-41-1, మార్‌క్రమ్‌ 8-1-23-1, కొయిట్జ్‌ 9-0-47-2, షాంసీ 10-0-42-2, మహరాజ్‌ 10-0-24-1

➡️